English | Telugu

5జీ సేవ‌లు వ‌ద్దంటూ కోర్టుకెక్కిన జుహీ చావ్లాకు రూ. 20 ల‌క్ష‌లు జ‌రిమానా!

స‌రైన ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌కుండా ఇండియాలో 5జీ టెక్నాల‌జీని అమ‌లు చేయ‌బోతున్నారంటూ, దానికి వ్య‌తిరేకంగా బాలీవుడ్ తార జుహీ చావ్లాతో పాటు మ‌రో ఇద్ద‌రు వీరేష్ మాలిక్‌, టీనా వ‌చ‌ని వేసిన దావాను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ దావా ప‌బ్లిసిటీ స్టంట్ లాగా క‌నిపిస్తోంద‌న‌ని పేర్కొన్న జ‌స్టిస్ జె.ఆర్‌. మిధా ఆధ్వ‌ర్యంలోని బెంచ్‌, వాదుల‌కు రూ. 20 ల‌క్ష‌లు జ‌రిమానా విధించింది.

"ఈ దావా పబ్లిసిటీ కోసం వేసిన‌ట్లు క‌నిపిస్తోంది." అని వ్యాఖ్యానించిన కోర్టు, సోష‌ల్ మీడియాలో కేసు హియ‌రింగ్ లింక్‌ను జుహీ చావ్లా షేర్ చేయ‌డాన్ని ప్ర‌స్తావించింది. జుహీ త‌ర‌పు న్యాయ‌వాది ఖోస్లా తీర్పుపై స్టే విధించాల్సిందిగా కోర‌గా, "విష‌యం పూర్త‌యిపోయింది. లీగ‌ల్‌గా ఏం చేయాలో మీకు తెలుసు" అని జ‌స్టిస్ మిధా చెప్పారు.

జూన్ 2న ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు కోర్టుకు హాజ‌రైన ప‌లువురు జుహీ చావ్లా సినిమాల్లోని పాట‌లు పాడుతూ, అనేక సంద‌ర్భాల్లో ప్రోసీడింగ్స్‌కు ఆటంకాలు క‌లిగించారు. దీంతో, "ఢిల్లీ పోలీసులు ఆటంకాలు సృష్టించిన వ్య‌క్తుల్ని గుర్తించి, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి." అని కోర్టు ఆదేశించింది. కాగా ఇటీవ‌ల జుహీ చావ్లా ఓ ప్ర‌క‌ట‌న‌లో త‌న ఎజెండా 5జీని నిషేధించ‌డం కాద‌ని తెలిపారు. 5జీ టెక్నాల‌సీ సుర‌క్షిత‌మ‌ని ప్ర‌భుత్వం స‌ర్టిఫై చేయాల‌ని ఆమె కోరారు.