English | Telugu

దిలీప్ కుమార్ మృతి చెందారంటూ వ‌దంతులు.. ఖండించిన సైరా బాను!

బాలీవుడ్ లెజండ‌రీ యాక్ట‌ర్ దిలీప్ కుమార్ అనారోగ్యంతో ఈ రోజు ఉద‌యం హాస్పిట‌ల్ పాల‌య్యారు. ఆయ‌న శ్వాస‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయ‌న మృతి చెందారంటూ సోష‌ల్ మీడియాలో, ప్ర‌ధానంగా వాట్సాప్ ద్వారా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ ప్ర‌చారాన్ని దిలీప్ కుమార్ భార్య‌, అల‌నాటి గ్లామ‌ర‌స్ హీరోయిన్ సైరా బాను ఖండించారు. దిలీప్ కుమార్ సాబ్ కండిష‌న్ స్థిరంగా ఉంద‌ని తెలిపిన ఆమె, ఆయ‌న ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అంద‌రికీ థాంక్స్ చెప్పారు.

దిలీప్ కుమార్ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో, "వాట్సాప్‌లో ఫార్వ‌ర్డ్ అవుతున్న వ‌దంతుల్ని న‌మ్మ‌కండి. దిలీప్ సాబ్ ఆరోగ్య స్థితి స్థిరంగా ఉంది. మీ మ‌నఃపూర్వ‌క ప్రార్థ‌న‌ల‌కు, ఆకాంక్ష‌ల‌కు థాంక్స్‌. డాక్ట‌ర్లు చెబుతున్న దాని ప్ర‌కారం ఆయ‌న రెండు మూడు రోజుల్లో ఇంటికి వ‌స్తారు. ఇన్షల్లా." అంటూ సైరా బాను రాసుకొచ్చారు.

ఆదివారం ఉద‌యం శ్వాస స‌రిగా ఆడ‌డం లేదంటూ ముంబైలోని పీడీ హిందుజా హాస్పిట‌ల్‌లో చేరారు దిలీప్ కుమార్‌. కొద్ది రోజులుగా ఆయ‌న శ్వాస‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వ‌స్తున్నార‌ని సైరా బాను వెల్ల‌డించారు. దిలీప్ వ‌య‌సు 98 సంవ‌త్స‌రాలు.