English | Telugu

'జ‌బ్ వి మెట్ 2' మేకింగ్‌లో ఉందా?

షాహిద్ క‌పూర్ పేరు తెలియ‌నివారు ఇప్పుడు ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ లేరు. అంత‌గా ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు షాహిద్ క‌పూర్‌. ఉడ్తా పంజాబ్‌, క‌బీర్ సింగ్‌, హైద‌ర్ వంటివ‌న్నీ అత‌నికి పేరు తెచ్చిపెట్టిన‌వే.

సిల్వ‌ర్ స్క్రీన్ మీదే కాదు, ఓటీటీలోనూ ఫ‌ర్జి, బ్ల‌డీ డాడీతో ప్రూవ్ చేసుకున్న హీరో షాహిద్‌. ఆయ‌న‌కు ఫ్యాన్స్ ఎక్కువ‌. ఏ మాత్రం టైమ్ దొరికినా షాహిద్‌తో ఇంట‌రాక్ట్ అవ్వ‌డానికి సిద్ధంగా ఉంటారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన షాహిద్ వీలైనంత వ‌ర‌కు ఫ్యాన్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇస్తూనే ఉంటారు. రీసెంట్‌గా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ నిర్వ‌హించారు.

ఈ ప్ర‌శ్న‌ల్లోనే ఆయ‌న ఓ విష‌యాన్ని లీక్ చేశారు. జ‌బ్ వి మెట్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించారు. "మీరూ, ఇంతియాజ్ అలీ ఈ మ‌ధ్య రెగ్యులర్‌గా మాట్లాడుకోవ‌డం గ‌మ‌నించాం. జ‌బ్ వి మెట్‌కి సీక్వెల్ ఏమైనా వ‌ర్క‌వుట్ చేస్తున్నారా? ఇంకేదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా?" అని అడిగారు. అందుకు షాహిద్ బ్ల‌డీ డాడీకి సంబంధించి స‌మాధానం ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్టు లేద‌నీ చెప్ప‌లేదు. అలాగ‌ని ఉంద‌నీ చెప్ప‌లేద‌న్న‌మాట‌. దీంతో, జ‌బ్ వి మెట్ మేకింగ్‌లో ఉందంటూ సంబ‌ర‌ప‌డుతున్నారు ఫ్యాన్స్. షాహిద్ న‌టించిన బ్ల‌డీ డాడీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. వ‌రుస‌గా ఇలాంటి సినిమాలే చేస్తుండ‌టంతో, త‌న‌కు లైట్ సినిమా చేయాల‌ని ఉంద‌ని, ఇప్పుడ‌ప్పుడే సీరియ‌స్ చిత్రం చేయాల‌ని లేద‌నీ అన్నారు. ఇప్పుడు షాహిద్‌, కృతి క‌లిసి చేస్తున్న సినిమా కూడా లైట్ ఫిల్మ్ అన్న‌ది సోర్స్.