Facebook Twitter
“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 12 వ భాగం

 

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 12 వ భాగం

 

తన చేతిలో పావులాగ అయిపోయిన సుల్తాన్ చేత ఎప్పుడో విల్లు వ్రాయించేశాడు కాఫర్. ఆ విల్లుని మంత్రి మండలికి చూపించి, బాలుడైన షిహాబుద్దీన్‍‍కి పట్టాభిషేకం చేయించాలని చెప్పాడు. ఆ విల్లులోనే, నయీబ్ మాలిక్ కాఫర్ రాజప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించాలి అని కూడా ఉంది.

హసన్ నిర్వికారంగా చేతులు కట్టుకుని దూరంగా నిలిచాడు.

జరుగుతున్న తతంగమంతా ప్రపంచానికి తెలియజెప్పడానికి, అక్కడనున్న ప్రజలంతా ఒక్కొక్కరే జారుకున్నారు..

ఇంకా అక్కడే ఉంటే ఏమవుతుందో!

అరాచకమైపోతే.. ఎవరు ఏం చేస్తారో తెలియదు. అందరూ కర్కోటకులే.. అల్లావుద్దీన్ అనుయాయులంతా అవాక్కై నిలబడిపోయారు. ఎవరైనా ఎదిరిస్తే..ఖండ ఖండాలుగా నరకడానికి సైనికులు కత్తుల మీద చేతులతో సిద్ధంగా ఉన్నారు.

పట్టాభిషేకం అయింది.

సభలోని వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. వాటిని చేతిలోనే ఉంచుకుని, ఇంకా నిశ్చేష్టులై ఉన్నారు యోధానుయోధులందరూ.

"హసన్!" గర్జించాడు రాజ ప్రతినిధి.

హసన్ ముందుకు నడిచాడు.

"ఈ రోజు నుండీ నువ్వు సర్వ సేనానివి.. నీ పేరు ఖుశ్రో ఖాన్. ఇక్కడ అంతా చూసుకో!

" హసన్ కొద్దిగా తల వంచి అభివాదం చేసి, వెనుకకు తిరిగాడు.

సగం మంది నిష్ణాతులైన సైనికులని తీసుకుని మాలిక్ కాఫర్ సుల్తాన్ ప్రతినిధిగా సభ బయటకు నడిచాడు. ఆ సైనికులంతా ఒకప్పుడు హిందువులే..

కొత్త సుల్తాన్ తనకి వింజామర వీచుతున్న దాసీ చేతిలోని మిఠాయి తీసుకుని ఏకాగ్రతతో తింటున్నాడు.

మాలిక్ కాఫర్ రక్తసిక్త పరిపాలన ఆ క్షణం నుంచే ప్రారంభమయింది. సైనికులు కవాతు చేస్తూ వెంటరాగా, అంతఃపురాల వైపు కదిలాడు.. కసి తీర్చుకునే కడలి కెరటంలా! సుల్తాన్ బంధువులు.. ఎవరైతే పదవికి అణుమాత్రమైనా అర్హులవుతారో.. వారందర్నీ నరికేశాడు.

చిన్నా పెద్దా.. పసివారా వృద్ధులా.. ఎటువంటి తడబాటూ, తత్తరపాటూ లేదు. రక్తం ఏరులై పారింది. కొందరు ఆడవేషాలు వేసుకుని అంతఃపురంలో, అల్లావుద్దీన్ అనేకమంది బీబీల్లో బీబీగా కలిసిపోదామని చూశారు. కానీ.. ప్రతీ బీబీ చరిత్రా కాఫర్‍కి తెలుసు. అందరివీ ముసుగులు తొలగించి మరీ తరిమి తరిమి కొట్టి చంపాడు.

ఆ చలువరాతి మందిరాల్లో... పాల వంటి తెల్లని రాళ్లు ఎర్రగులాబీ రంగులోకి మారిపోయాయి. సుల్తాన్ పెద్ద కొడుకులు ఖిజ్రి ఖాన్, షాది ఖాన్‍లు.. వారిని తన చేతుల మీదుగా ఆడించాడు. అయినా సరే.. ఏ మాత్రం సందేహించకుండా, వారిని చీకటి గదుల్లో బంధించి, కళ్ళు పొడిచేశాడు. మహారాణి, మాలికఇజహాన్‍ను కారాగారంలో బంధించాడు.

రోజు రోజూ, రెండు చేతులా నరికి పారేస్తున్నాడు కాఫర్.

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. జంతువు కంటే కనాకష్టంగా చేతులు మారి, మనిషికి మనసు.. ఆ మనసుకో అనుభూతి ఉంటాయని మరిచిపోయిన కాఫర్.. తనని, తన మతాన్ని, తన దేశాన్ని దోచుకుంటున్న దైత్యులని దునిమి దునిమి చిత్రవధ చేశాడు.

అందులో కొందరు అమాయకులున్నా సరే..

అమాయకులైన హిందువులనెందరిని చంపలేదు యుద్ధాలలో.. వీరొక లెక్కా!

ఖుశ్రో ఖాన్‍ని పిలిచి.. మదిర తెప్పించుకుంటున్నాడు ప్రతీ రోజూ రహస్యంగా.. మనశ్శరీరాలు విశ్రాంతి కోరుకుంటున్నాయి మరి.

ఇంక అల్లావుద్దీన్ మూడవ కొడుకు ముబారక్ షా మిగిలాడు. అతనొకడ్ని తొలగించేశాడంటే మాలిక్ కాఫర్‍కు ఎదురే లేదు.

అతన్ని వేయి స్థంభాల మందిరంలో, నేల మాళిగలో బంధించి, ఒక నెల పైనే అయింది. స్వైర విహారం పూర్తి అవ బోతోంది. ఆ తరువాత అతనే సుల్తాన్..

సుల్తాను అభిజాతులు, బానిసలు.. ఖిల్జీ వంశపు విశ్వాసపాత్రులంతా విసిగిపోయారు మాలిక్ కాఫర్ నిరంకుశత్వానికి. అర చేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతకవలసి వస్తోంది.. అందరూ ఖుస్రోఖాన్ వద్దకు రాయబారం పంపారు.

ఆ రోజు..

మదిర పానం ముగించి లేచాడు కాఫర్.

ముబారక్ పని ఒక్కటే మిగిలింది. అతన్ని బంధించిన నేల మాళిగలోనికి వెళ్ళాడు. కణకణ లాడుతున్న నిప్పుల మీదనున్న ఇనుప కడ్డీలని తెప్పించాడు. నిప్పులున్న గంపతో సహా తెచ్చారు సేవకులు. కొద్దిగా పొగ కూడా వస్తోంది.

ఎర్రగా సెగలు కక్కుతున్న రెండు ఇనుప కడ్డీలనీ తీసి తనే స్వయంగా కన్నులు పొడవబోయాడు. ఎవ్వరినీ నమ్మడానికి వీలు లేదు..

కొంచెం వికారంగా అనిపించింది. కన్నులు మూసుకు పోతున్నాయి. అప్పటి వరకూ జరిగిన ఆ నరమేధంతో అలసట చెందాడో ఏమో.. మరునాడు చూద్దాంలే అనుకుని తన మందిరానికి వెళ్ళి పోయాడు.

రాత్రికి రాత్రి ముబారక్ షా తప్పించుకున్నాడు.

మరునాడు ప్రొద్దుటికి మాలిక్ కాఫర్ శవమై తేలాడు తన మందిరంలో.

సుల్తాన్ విశ్వాసపాత్రులు ముబారక్ షాను రాజప్రతినిధిగా చేశారు. .....................

9 దక్షిణా పథంలో బెజవాడ దగ్గరగానున్న కొండపల్లి కోటలో..

ఐదేళ్ల క్రితం మాలిక్ కాఫర్ చేత తరమబడి, అక్కడ తల దాచుకుంటున్న క్షత్రియులు, నాయంకరులు.. అందరూ సమావేశమయ్యారు.

శివుడికైనా తప్పలేదు చెట్టు తొర్రలో నివాసం..

మానవ మాత్రులైన ఈ సైనికులేపాటి..

చాళుక్య, చోళ, కాకతీయ సేనానులు కోట లోపల ఉన్నారు.

కోట చుట్టూ, గడచిన ఐదు సంవత్సరాలలో బాగా పెరిగి, నవ యౌవనులైన, సుశిక్షుతులైన సైనికులు కాపలా కాస్తున్నారు.

ప్రతాప రుద్రుడు పంపిన వార్త తీసుకునొచ్చిన వేగులు అప్రమత్తులై నిలుచున్నారు. "ఢిల్లీలో ముసల్మానుల జోరు తగ్గింది. ఆరు సంవత్సరాల బాలుడు సింహాసనం మీద నున్నాడు. రాక్షసుడైన మాలిక్ కాఫర్ హత్య చెయ్యబడ్డాడు. గుజరాత్‍లో విప్లవం మొదలయింది.

మహమ్మదీయుల మదమడిచే సమయం ఆసన్నమయింది. మీరందరూ మీ మీ పట్టాణాలకేగి పరిపాలన సాగించండి. నేను ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం ప్రకటిస్తున్నాను." సాధారణంగా అటువంటి వార్త వచ్చినప్పుడు హర్షధ్వానాలు మిన్నంటాలి.

కానీ.. అక్కడ నిశ్శబ్దం నిలిచింది నిస్త్రాణగా.

కాప నాయకులలో ఒకరు లేచాడు.

"ప్రతాపరుద్ర చక్రవర్తి తొందర పడుతున్నారనిపిస్తోంది. ముష్కురులు మాయగాళ్లు.. అస్సలు నమ్మడానికి లేదు. ఇప్పుడిప్పుడే అశ్వాలను, ఏనుగులను సమకూర్చుకుంటున్నాం. జన నష్టాన్ని కొద్ది కొద్దిగా పూడ్చుకుంటున్నాం. ప్రజలు ఇంకా ఆ భయానక స్థితి నుంచి తేరుకోలేదు. పగ వాళ్లేమో విభజించి పాలిస్తున్నారు. దేవగిరి వంటి దక్షిణ రాజ్యాలు కొన్ని వారి అధీనంలోనే ఉన్నాయి. మనం అందరూ ఏకం అయినా చాలదు వారి బలం ముందు. ఈ వేగుల ద్వారానే కబురంపుదాం.. కాస్త ఆగుదామని.. ఏమంటారు అందరూ?"

అప్పుడు సన్న సన్నగా వినిపించాయి కరతాళధ్వనులు.. వారి అభిప్రాయం కూడా అదే అన్నట్లు. ఆ సమావేశానికి వచ్చిన అద్దంకి నాయకుడు కూడా అదే సరి అన్నాడు. అతని వెంటనున్న సూరనార్యుడు మెచ్చుకుంటున్నట్లు తల ఊపాడు.

వారి నిర్ణయం సరి అయినదే అని అతి త్వరలోనే తెలిసింది. అదీ.. ఆ వేగులు, ఓరుగల్లు చేరిన కొద్ది దినములకే.

తన సామంతుల, సేనానుల నిర్ణయానికి ప్రతాపరుద్రుడు ఖిన్నుడయ్యాడు.

అంతే మరి.. యుద్ధంలో ఓడిపోయిన చక్రవర్తి తను..

ఢిల్లీ సుల్తానుకు కప్పం కట్టుట వలననే కదా వారికి అంత చులకన.. అది మానేస్తే..

ఆ వారమే రెండు ఒంటెల నిండుగా నాణాలను, నగలను తీసుకుని ఢిల్లీ వెళ్ళాలి. మైలి సేనానికి కబురు చేశాడు ప్రతాపరుద్రుడు.

"సేకరించిన ధనమంతా ధనగారంలోనికి చేర్చండి. మనం కప్పం కట్టట్లేదు. గుజరాత్ రాష్ట్రీయులకున్న ధైర్య సాహసాలు మనకి లేవా? ఆల్లావుద్దీన్, మాలిక్ కాఫర్.. ఇద్దరూ మరణించారు. ఆరేళ్ళ పిల్లవాడు చక్రవర్తట. వానికి మనం సామంతులమా!"

"అది కాదు ప్రభూ! ముబారక్ ఖిల్జీ రాజ ప్రతినిధి. అతని నయీబ్ ఖుస్రోఖాన్, మాలిక్ కాఫర్ కంటే రాక్షసుడు. అతడే మాలిక్‍ని చంపేశాడంటారు. వారు మరల దండెత్తుతే.. మన సేనలు కూడా చెల్లా చెదురైపోయాయి.." మైలి సేనానిని చెయ్యి అడ్డం పెట్టి ఆపేశాడు ప్రతాప రుద్రుడు.

హృదయం భగ్గుమంది. హు.. ప్రతీ వాడూ చెప్పేవాడే..

కాని కాలం వస్తే తాడే పామై కరుస్తుందట.

"నువ్వా నేనా ప్రభువు.. చెప్పింది చెయ్యి."

ఏదో చెప్పబోయి ఆపేశాడు మైలి సేనాని.

పోగాలము దాపురించినవాడు మిత్రవాక్యమును వింటాడా..

మైలి సేనాని వెనుకకు మరలాడు, చింతిస్తూ.. ఈ ధిక్కారానికి ఏ పణం చెల్లించాలో! వీరిక్కడ భేటీ అవుతున్న సమయంలోనే ఢిల్లీ సింహాసనం మీద మార్పులు సంభవించాయి.

ముబారక్ షా ఖిల్జీ, తమ్ముడిని.. ఆరు సంవత్సరముల ముక్కు పచ్చలారని పసివాడిని బంధించి, వాడి కళ్లు పెరికించి, సింహాసనం ఎక్కాడు.

ఆ చిన్నారికి తాను సింహాసనం ఎందుకెక్కాడో తెలియదు. ఎందుకు కళ్ళు పీకారో అసలే తెలియదు.. బాధకి దిక్కులు పిక్కటిల్లేటట్లు ఏడవడం తప్ప.

అరవై రోజులు ఢిల్లీ సుల్తాన్‍గా ఉన్న అమాయకుడైన ఆ బాలుడు జీవితాంతం చీకటిలోనే మగ్గాలి, అతని ఇతర సోదరుల వలె. రాజ్య కాంక్షకి మంచి చెడ్డలు ఉండవు. రక్త సంబంధాలుండవు.

ఇదంతా ఖుస్రో ఖాన్ పర్యవేక్షణలోనే జరిగింది. రాజ్య స్వీకారం అయిన వెంటనే విప్లవాలని అణచి వేయసాగారు ముబారక్, ఖుస్రోలు.

గుజరాత్ విప్లవాన్ని ముబారక్ షా మామగారైన జఫార్ ఖాన్ అణచి వేశాడు. అతనిని గుజరాత్‍కి రాజ ప్రతినిధిని చేశాడు సుల్తాన్.

దేవగిరి రాజు కూడా స్వతంత్రాన్ని ప్రకటించాడు.

ఖుస్రోఖాన్ అనంత సేనావాహినిని తోడ్కొని దేవగిరి మీదికి దండెత్తాడు.. అల్లాహో అక్బర్ అంటూ! యాదవరాజు హరపాల దేవుడు వీరోచితంగా ఎదుర్కున్నాడు. కానీ, ఖుశ్రో సైనికుల పశుబలం ముందు ఓడిపోయి, పట్టుబడ్డాడు. ఖుశ్రో తమ సైన్యంతో పట్టణం మీద పడి, వేల కొలదీ హిందువులని ఊచకోత కోశాడు.. ఆ వధ కొన్నిరోజులు సాగింది.

హరపాల దేవుడిని ఢిల్లీ తీసుకురమ్మని, నిండు సభలో తన ఎదురుగానే, చర్మం ఒలిపించాడు కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ. అతను పెట్టే హృదయ విదారకమైన కేకల్ని వింటూ ఆనంద కేళి సలిపాడా రాక్షసుడు.

అతడి శరీరాన్ని, ఒలిచిన చర్మాన్ని తీసుకెళ్ళి దేవగిరి కోట గుమ్మానికి వేళ్ళాడ దీయించాడు, ప్రజలందరూ చూచేలాగ. రాబందులు రాజు శరీరాన్ని పీక్కు తింటుంటే వికారంతో వందలమంది కళ్ళు తిరిగి పడిపోయారు చూడలేక.

సుల్తాన్ ధ్యేయం అదే.

ఎంత శతృవుకైననూ అటువంటి శిక్ష విధించడం, అమలు జరపడం.. అతి దారుణం. ఆ చర్య హీనాతి హీనం. అంతకు అంతా అనుభవించక తప్పదు భవిష్యత్తులో.

చివరికి దేవగిరిలో మసీదు కట్టించి, తన ప్రతినిధిని ఉంచి, అక్కడి కోటలోని క్షత్రియ స్త్రీలని తన అంతఃపురంలోకి చేర్చాడు. దేవగిరి శాశ్వతంగా ముస్లిమ్ రాజ్యం కింద మారింది.

కోటగుమ్మానికున్న మహరాజు దౌర్భాగ్యాన్ని చూసిన వారెవ్వరూ మరి విప్లవాన్ని ఆహ్వానించరు. ఆ తరువాత.. కాకతీయుల విప్లవ ఛాయల్ని పసికట్టి, ఖుస్రో ఖాన్‍తో అతి పెద్ద సేనని ఓరుగల్లు మీదికి పంపాడు సుల్తాన్.

కర్కోటకుడైన ఖుస్రోఖాన్‍తో పొలిమేరల్లోనే సంధి కుదుర్చుకున్నాడు ప్రతాపరుద్రుడు. రెండు ఒంటెల బదులు నాలుగు ఒంటెలమీద ధనరాశుల్ని కప్పంగా కట్టాడు.

మైలి సేనాని మాట విని వుంటే..

కనీసం రెండు ఒంటెలు, వాని మీది ధనరాశులు మిగిలేవి. మరలా దక్షిణా పథంలో కల్లోలం అణిగి ప్రశాంతత నెలకొంది.. తాత్కాలికంగా!

ఢిల్లీలో మాత్రం అల్లకల్లోలం మొదలయింది.

వరుస విజయాలతో ముబారక్ తనంతటి వాడు లేడనుకున్నాడు. తండ్రి విధించిన నియమాలను ధిక్కరించాడు. పన్నులను కొన్నింటిని తీసి వేశాడు. తను కారాగారంలో నిరంతరం భయంతో బ్రతికాడు కనుక, ఖైదీ లందరినీ విడుదల చేశాడు.

అది చాలదన్నట్లు, మాలిక్ కాఫర్ చంపగా మిగిలిన రాజవంశీయులందరినీ చంపేశాడు. దగ్గర బంధువులనే వాళ్ళు లేకుండా పోయారు చివరికి.

ఈ పరిపాలనా విషయాలలో వజీర్‍గా పదోన్నతి పొందిన ఖుస్రో ఖాన్ కల్పించుకోలేదు. పైగా సుల్తాన్‍ను తాగుడికి బానిసని చేశాడు. అతడి వ్యభిచారాన్ని ప్రోత్సహించాడు.

ముబారక్ షాకి మదం తలకెక్కి, తనే ఇస్లాము మతానికి అధికారిగా ప్రకటించుకున్నాడు. ఫలితం..

ఖజానా ఖాళీ అయిపోతోంది. మంత్రులు, సేనానులు బలహీన పడి, ప్రజలను శాసించలేకపోతున్నారు. ముసల్మాన్ మంత్రులు, దండనాయకులు సుల్తాన్ చర్యలకు అవమానంతో తలదించుకుంటున్నారు.

అరాచకం, అంతర్గత విప్లవం ఆరంభం అయ్యాయి.

గుజరాత్‍లో ముప్పది వేలమంది హిందూ సైనికులు రహస్యంగా సుశిక్షితులవుతున్నారు.. బలవంతంగా కాదు.. స్వఛ్ఛందంగా.. హిందూ ధర్మ పరిరక్షణకై, ఒక ధృఢ సంకల్పంగల సేనాని ఆధ్వర్యంలో.

నమ్మినబంటు ఖుశ్రోఖాన్ సుల్తాన్ తరువాత రెండవ స్థానంలోనికి చేరాడు.. అల్లావుద్దీన్‍కి మాలిక్ కాఫర్‍లాగ.

మొత్తం పరిపాలన అంతా ఖుస్రోకి వదిలేసి సుల్తాన్ విలాసాల్లో మునిగి తేలసాగాడు. రాజ్యపాలన వ్యవహారాలలో అన్నదమ్ములని కూడా నమ్మకూడదని మరచాడు.

వినాశకాలే విపరీత బుద్ధి..

విధాత నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు?

ఖుశ్రోఖాన్‍కి అంతఃపురంలో కూడా ప్రవేశముంది. సుల్తాన్ ఎక్కడుంటే అక్కడికి స్వేఛ్ఛగా వెళ్ళగలడు.. అతని ప్రియుడు కూడా కనుక..

వజీర్ సాబ్ ఖుశ్రో కూడా మాలిక్ కాఫర్ లాగ నపుంసకుడనుకుని అంతఃపుర స్త్రీలు కూడా సంకోచం లేకుండా అతని ఎదురుగా తిరిగేస్తుంటారు..

ఒక్కోసారి పర్దా లేక పోయినా పట్టించుకోరు.

ఆ రోజు కూడా ఖుశ్రో, సుల్తాన్‍తో ఆంతరంగిక విషయం మాట్లాడాలని అంతఃపురానికి వచ్చాడు. ముబారక్ షా మత్తుగా పడిపోయి ఉన్నాడు. నిరాశగా వెనుతిరిగిన ఖుశ్రోకి ఎదురుగా ఒక మెరుపు మెరిసినట్లయింది.

ఆ మెరుపు తీవె కూడా తడబడకుండా ఖుశ్రోని తీక్షణంగా చూసింది. కళ్లల్లోకి.. నిర్భయంగా. మేలి ముసుగు లేదు.. మెడ నిండుగా నగలు. దాసి అయితే కాదు.

సాధారణంగా వజీర్ సాబ్‍కి ఎవరు ఎదురు పడినా కూడా తప్పించుకుని, తల దించుకుని వెళ్ళి పోతారు, ఎటు పోయి ఎటు వచ్చినా మనకెందుకని. అతడికి అంతటి ప్రఖ్యాతి ఉంది ఢిల్లీ కోటలో. అటూ ఇటూగా ఇరువది సంవత్సరాలుంటాయి ఆ యవ్వనికి.

ఆమెని ఎక్కడో చూసినట్లనిపించింది ఖుశ్రోకి. ముస్లిం యువతి వేషధారణ అయినా, మొహంలో ఆ ఛాయలు లేవు. కనుముక్కు తీరు, మేని రంగు.. కాంతి, ఠీవి.. హిందూ రాకుమారిలాగ ఉంది. ఏ దండయాత్రలో తమ జనానాలో కలిపేసుకున్నాడో సుల్తాను.

"నా పేరు దేవల్ దేవి." గోజ్రీ భాషలో చెప్పింది.

ఖుశ్రోకి ఆ గొంతు వినగానే గుర్తుకొచ్చింది. తామిద్దరూ ఒకే సారి తమ దేశం నుండి విడివడిపోయారు. తన వయసే.. తన మతమే. తన భాషే.

కానీ హస్తిమశకాంతరం భేదముంది ఇద్దరికీ.

ఆమె రాజు కూతురు. ఉత్తమకుల సంజాత. తాను పనివాడి కొడుకు. హీన కులజుడు. విధి విచిత్రమయింది. ఇద్దరికీ ఒకే రకం రాత రాసింది.

ఇద్దరికీ కన్నులు చెదిరే అందమిచ్చింది.. అదే వారి పట్ల శతృవయింది.

ఖుశ్రోఖాన్‍కి దేవల్ దేవి గురించి బాగా తెలుసు. కానీ అప్పటి వరకూ కలిసే అవకాశమే రాలేదు. తను ఈ స్థాయికి ఎదగడానికి.. ఇష్టం వచ్చిన ప్రదేశానికి అడ్డు లేకుండా, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళగలగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది.

దేవల్ దేవికి కూడా అంతే కాలం పట్టింది, అయితే స్త్రీ కనుక దారి వేరే. ఇద్దరి దారుల్లో ముళ్ళ కంపలూ, ఎదురు దెబ్బలూ, లైంగిక హింసలూ.. భౌతిక, మానసిక గాయాలూ.. అవీ దారుణమైనవి. లోతైనవి. ఎప్పటికీ మాననివి. పచ్చిగా ఉంటూ క్షణక్షణం బాధించేవి.

ఆ బాధని ఎక్కడో గుండె లోతుల్లో పాతేశారు ఇరువురూ. అప్పుడు.. పదునైదు సంవత్సరముల తరువాత బహిర్గతమయిన ఆ బాధ.. ఖుశ్రో కన్నులలో రవ్వంత కనిపించింది.

దేవల్ దేవి నిస్తేజంగా చూసింది. సుల్తాన్ సమక్షంలో తెచ్చి పెట్టుకున్న ఉత్సాహం మాయమయి, ఆత్మీయులు కనిపిస్తే కలిగే వేదన, ఆమె మోములో. సుల్తానా దేవల్ దేవికి ఖుశ్రో గాధ విదితమే.. ఆ విషయం అతను గ్రహించాడు.

గుజరాత్ దండయాత్ర జరిగినప్పుడు ఖుశ్రో చాలా చిన్నవాడయినా, ఇతర బానిసల మాటలను బట్టి జరిగింది తెలుసుకున్నాడు. ---- 

 

 

 

 

......మంథా భానుమతి