Facebook Twitter
తేనెపట్టులాంటి మునిమాణిక్యం కథలు

 

తేనెపట్టులాంటి మునిమాణిక్యం కథలు

తెలుగుకథను సుసంపన్నం చేసిన కథారచయితల్లో మునిమాణిక్యం ఒకరని అందరికీ తెలిసిన విషయమే. అయితే మిగిలిన కథకులకు మునిమాణిక్యం నరసింహరావుకు తేడా ఏమిటంటే ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామా అతడు. కథను ప్రత్యేకంగా హాస్యం కోసం రాయడు. కానీ కథలో హాస్యం ఓ భాగమై పోతుంది. చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి కథా రచయితలు కథలకు ప్రాణం పోస్తున్న కాలంలో, భావకవులు ఊహా ప్రేయసులు అంటూ నేల విడిచి సాము చేస్తున్న రోజుల్లో ఓ సాధారణ మధ్యతరగతి గృహిణిని, ఆమె సంసార జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాస్యాన్ని పుట్టించారు నరసింహారావు. మునిమాణిక్యం అంటే ఏ మాత్రం సాహిత్యాభిమానం ఉన్నా గుర్తొచ్చే పేరు కాంతం. కాంతం పాత్ర తెలుగువారి సొంతమైపోయింది. దాదాపు కథలన్నిటిలో ఒకేపాత్ర ఉండేలా, ఆపాత్ర నిడివితో ఇతర పాత్రలను చేర్చుతూ ఒకే రకమైన కథలు రాసిన వారిలో మునిమాణిక్యం గొప్పవారు.

ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామాగా చెప్పుకునే మునిమాణిక్యం నరసింహారావు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో 1898 మార్చి15న పుట్టారు. పేద కుటుంబంలో జన్మించినా కష్టపడి గుంటూరు కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తర్వాత కొండా వెంకటప్పయ్య సహాయంతో విజయనగరంలో బి.ఎ., రాజమమండ్రిలో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. చివరి రోజుల్లో హైదరాబాదులోని ఆకాశవాణిలో కూడా పనిచేశారు. సహజంగా హాస్యంతో సంభాషించే చాతుర్యం ఉన్న మునిమాణిక్యం ఆనాటి కవులు, పండితులతో అలానే మాట్లాడేవారు. ముఖ్యంగా నోరి నరసింహశాస్త్రి, జరుక్ శాస్త్రులు వీరిని కథలు రాయమని ప్రోత్సహించారు. తను రోజు చెప్పే కబుర్లనే కథలుగా రాయమని తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి అనడంతో కథా రచనకు పూనుకున్నట్లు నరసింహారావే చెప్పుకున్నారు. మునిమాణిక్యం తొలిసారిగా 1923లో తేనీరు అనే కథ రాశారు. మొత్తంగా అరవై కథలు రాసినట్లు తెలుస్తుంది. కథలతోపాటు శరద్రాత్రులు, రుక్కుతల్లి, మేరీకహానీ అనే నవలలు, గాలిపిల్లలు పేరిట బాలలకోసం కథలు... ఇంకా జయమ్మకాపురం, ఎలోప్ మెంట్ వంటి నాటికలు ప్రకటించారు. అప్పుచెయ్యడం, తీర్చడం, భార్యను లొంగదీసుకోవడం వంటి కొన్ని హాస్య వ్యాసాలనూ రాశారు. హాస్య కథలు, కాంతం కథలు, అల్లుళ్లు వంటి వీరి కథా సంపుటాలు ప్రచురింపబడ్డాయి.

ఎన్ని రాసినా మునిమాణిక్యం అంటే కథా రచయితగానే గుర్తింపు వచ్చింది. వారు సృష్టించిన కాంతం పాత్రే తెలుగువారిలో ముద్రపడిపోయింది. అనురాగం, ఆత్మీయతతో కూడిన చాతుర్యం, మాటకారితనం, కొద్దిగా వెటకారం, శృతిమించని శృంగారం, నిండుదనం, కొంటెదనం... ఇలా అన్ని ఉన్న స్వచ్ఛమైన తెలుగు ఇల్లాలు కాంతం. మునిమాణిక్యమే ఆ కథల్లో వెంకట్రావుగా మనకు కనిపిస్తాడు. అతను అమాయకుడు. అలాగని భార్యపై పెత్తనం చేసి తను నెగ్గుకు రావాలనుకున్నా చివరకు తనే లొంగిపోయే స్వభావం కలవాడు. అసలు కాంతం పాత్రకు స్ఫూర్తి నరసింహారావు మొదటి భార్యేనట. ఆ పేరు మాత్రం అతని స్నేహితుల్లో ఒకరి చెల్లెలదని చెప్పారు రచయిత. మొదటి భార్య జీవితానుభవాల నుంచి పుట్టిన కథలే కాంతం కథలు. కాంతం కథలు చాలా చతురతతో పాటు శిల్ప పరంగా కూడా గొప్పవే. కథ సాధారణంగా ఒక వాక్యంతోనో, వర్ణనతోనో, సన్నివేశంతోనో మొదలవుతుంది. మధ్యలో పీటముడి పడుతుంది. చివరకు చురకతో ముగుస్తుంది. మనకు నవ్వు తెప్పిస్తుంది. చాలా కథల్లో అర్థాల ద్వారా మునిమాణిక్యం హాస్యాన్ని సృష్టించారు. కాంతం మాట్లాడే మాటల్లో వెటకారంతోపాటు, ఆ మాటల వెనుక అర్థవంతమైన లోగుట్టు ఉంటుంది.

కాంతం భర్తతో చాలా చమత్కారంగా మాట్లాడుతుంది. సన్నివేశాన్ని బట్టి, అవసరాన్ని, అవకాశాన్ని బట్టి చతురోక్తులు విసురుతుంది. ఉదాహరణకు- కొండపల్లి వెళితే మీకు కొయ్యబొమ్మలు కనపడతాయా... అంటే అక్కడ కూడా అమ్మాయిలను చూస్తుంటారు కదా అని ఆమె ఉద్దేశ్యం. ఆ అమ్మాయిని అంతధైర్యంగా ప్రేమించేశారేం... మరి ఆ సమయంలో మీ దగ్గర అద్దం లేకపోయిందా.., అలానే మరోచోట- మా వాళ్లందరూ తోకలేని కోతులా.. పాపం మీ వాళ్లకు ఆ లోటు కూడా లేదులేండి. అంటుంది. మరికొన్ని వాక్యాలలో నరసింహారావు హాస్యం చాలా గొప్పగా ఉంటుంది. విరహం అంటూ అనుభవించాలేగాని హంసతూలికా తల్పమే కావాలా... నులకమంచంలో పడి దొర్లినా నానాహంగామా చెయ్యకూడదా..., లెంపలేసుకున్నారా, స్వయంగానేనా లేక మీ ఆవిడా... పిల్లలు కోతి బొమ్మ కావాలంటున్నారు, వచ్చేటప్పుడు తెస్తారా లేక మీరే వస్తారా...ఇక కొన్ని కథల్లో కాంతం భర్త వెంకట్రావు మాటలైతే ఆయనకు భార్యపై కోపాన్ని చతురోక్తులతో చెప్తాడు మునిమాణిక్యం- కోతి కనిపించే సరికి మా ఆవిడ గుర్తుకొచ్చింది. నేనా పిల్లను ఆటపట్టిద్దాం అనుకున్నాను, కానీ నా ఊహల్లో మా కాంతం ముఖం సూపర్ ఇంపోజ్ అయింది. ఇలా ఎన్నో సున్నితమైన హాస్యపు చెణుకులు వారి కథల్లో మనకు కనిపిస్తాయి.

అసలు కాంతాన్ని పెళ్లిచేసుకున్న కొత్తల్లో భర్త వెంకట్రావే పైచెయ్యి సాధించేవాడు. భార్య ఎంత లొంగదీసుకోవాలన్నా కుదిరేది కాదు. అసలు కాంతం దగ్గరకు వస్తేనే చిర్రుబుర్రు లాడేవాడు. కానీ క్రమంగా కాంతం మచ్చికచేసుకుంది. లొంగదీసింది. ఇక అమాయకుడైన వెంకట్రావు సాధుజీవిలా మారిపోతాడు. కాంతం చిరునవ్వుకు అర్థం ఇదే నట. ఇలా కథలన్నీ సున్నితమైన హాస్యంతో పాఠకుల పెదవిపై చిరునవ్వు చెరగనివ్వవు. మిగిలిన పాత్రలు కూడా సందర్భోచితంగా వచ్చిపోతున్నా, కథలో హాస్యానిదే రాజ్యం. అందుకే ఇవి ఏవో టైంపాస్ కథలు కావు. చదివిన ప్రతి కథను గుర్తుపెట్టుకొని మీమీ జివితాల్లో ఎదురయ్యే సన్నివేశాలకు, సంఘటనలకు ఆపాదించుకుంటుంటే జీవితమే హాస్యపు జల్లులా కురుస్తుంది. నవ్వు కరువై, తోటి మనుషులతో మాట్లాడే తీరికే లేని నేటి అత్యాధునిక బిజీ సమాజానికి మునిమాణిక్యం నరసింహారావు కథలు తేనెపట్టులాంటివి. హాస్య రసమాధుర్యాన్ని పంచే మందుల్లాంటివి. అందుకే నేటి యువతీ యువకులతోపాటు పెళ్లైన ప్రతిఒక్కరూ చదవాల్సిన మంచి కథలు ఇవి.

డా. ఎ.రవీంద్రబాబు