Facebook Twitter
వెలుగు నీడలు

 

అసలు కథకు కథానిక అని నామకరణం చేసిన వ్యక్తి హనుమచ్ఛాస్త్రి. కథానిక అంటే ఇది అని చెప్పిన రచయిత. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కేవలం కథా రచయితే కాదు, కవి, విమర్శకులు కూడా. ఎన్నో అద్భుతమైన, అరుదైన సాహితీ గ్రంథాలను మనకు అందించారు. తెలుగువారి సాహితీ చరిత్రలో గుర్తుండిపోయే నవ్యసాహితీ పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘాల్లో ప్రధాన పాత్ర వీరిది. పద్యాలు రాసే హనుమచ్ఛాస్త్రి కథలు కూడా రాసిన విషయం చాలా మందికి తెలియదు. కానీ వీరు రాసిన 29కథల్లో మౌనసుందరి, ఆశ్రమవాసి లాంటి గొప్పకథలు ఉన్నాయి. వాస్తవ జగత్తుకు, ఊహలోకానికి మధ్య ఉన్న చిన్న పొరను వెలుగు నీడలు కథలో అద్భుతంగా ఆవిష్కరించారు.

ఈ కథలో ప్రధాన పాత్ర కవి. ఆ కవి రాత్రంతా మేలుకొని విక్రమోర్వశీయ పద్యకావ్యంలోని ఊర్వశి సౌందర్యాన్ని, పురూరవ చక్రవర్తి ప్రేమ సల్లాపాల్ని గొప్పగా వర్ణించి ఉంటాడు. ఉదయాన్నే సుధర్మలో భరతముని ప్రయోగించే నాటికలోని అప్సరస సుందరి రంగస్థలం మీదకు వచ్చినప్పుడు రాసిన పద్యం గురించి మననం చేసుకుంటూ ఉంటాడు. హఠాత్తుగా భార్య గొంతు వినిపిస్తుంది - రేషను షాపుకెల్లి బియ్యం తేవాలని. ఒక్కసారిగా ఊహాలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి రేషను షాపుకు వెళ్లాలనుకుంటాడు. బియ్యం లేవని తెలియగానే కడుపులో ఆకలి కూడా పెరుగుతుంది. ఆంధ్రకవీశ్వరునికి ఆకలి కలగడాన్ని నీచంగా భావించి సంచీ తీసుకొంటాడు. దారిలో జమీందారు కారు, టౌనుహాలులో జరిగే పార్టీలోని టీ వాసన, నగరంలో బియ్యంకోసం తొక్కిసలాడే పేదలు, లంచాల చేతులతో బలిసిన సిల్కు సూట్లు ధరించిన బొజ్జలు చూసి నవ్వుకుంటాడు.

కవి రేషను షాపు క్యూలో నిలబడితే లోపల గొడవ జరుగుతుంటుంది. కొద్ది సేపటికి ఓ ఆకారాన్ని పదార్థంలా చేసి రోడ్డుమీద పడేస్తారు షాపులో వాళ్లు. ఆ ఆకారం దుమ్ము దులుపుకొని పక్కనున్న తూము మీద కూర్చొంటుంది. కవి బియ్యం కొనగానే దగ్గరకొచ్చి, కూలి కావాలా అని ఆడిగి దమ్మిడీ ఇవ్వమంటే కవి పావలా ఇస్తానని చెప్పడంతో సంతోషిస్తాడు. అతని పేరు సన్నాసి. బియ్యం మోయడం వల్ల వచ్చిన పావలా చూసి తెగ ఆనందపడిపోతాడు. ఆ సంతోషం కవిలో ఉదయం ఇంట్లో వదిలేసిన పురూరవుడ్ని జ్ఞాపకానికి తెస్తుంది. కవి సాయంత్రం కూరగాయల కోసం సంతకు వెళ్తాడు. అక్కడ అమ్ముతున్న కూరగాయలు చూసి విజయనగర సామ్రాజ్య కాలం నాటి రత్నాలు గుర్తుకు తెచ్చుకుంటాడు. అంతలో ఇద్దరు పెద్దమనుషులతో సన్నాసి గొడవపడడం చూస్తాడు. వాళ్లు సన్నాసిని దొంగగా ముద్రవేసి కొడతారు. సంతలో మిగిలిన జనాల్లో చాలామంది సన్నాసిని దొంగ వెధవ...కూలి అని చెప్పి, దొంగతనం చేస్తాడు అని తిడతారు. ఆ అలజడి తగ్గాక సన్నాసి నెమ్మదిగా గొడవలో కాలికింద తొక్కిపట్టిన పెద్దకాపు రొంటి నుంచి జారిన వస్తువును పదిలంగా తీసుకొని నల్లమందు కొట్టుకు వెళ్తాడు.

సిరాలా చీకటి పడుతుంది. ఎక్కడి వాళ్లు అక్కడ నిద్రపోతూ ఉంటారు. గాలి చల్లగా వీస్తుంది. ఒక్క సంతపాకల్లో తప్ప ఊరుఊరంతా నిద్రపోతుంది. ఎఱుకల నీలాలు మాత్రం ఆకలేసి నిద్రలేస్తుంది. చీకటి రాత్రులు పడుచువాళ్లకు సరదాగా ఉంటాయి అనుకుంటుంది. రేగిన జుట్టును సరిచేసుకుంటూ ఆకలి ఎట్లా తీరుతుందా అని ఆలోచిస్తుంది. ఎదురుగా మిఠాయి కొట్టు కనిపిస్తుంది. కానీ దొంగతనం ఎలా చేయాలా అని అనుకుంటుండగానే ఒక ఆకారం ఆ కొట్టు వెనక నీడలా కనిపిస్తుంది. ఆ ఆకారం మిఠాయి కొట్టు వెనకబల్లను ఊడగొడుతుంటే తనూ వెళ్తుంది. అంతలో ఆకారం తప్పుకోగానే, నీలాలే బల్ల కొద్దిగా మేకుకు పట్టుకొని ఉంటే లాగుతుంది. లాగుతూ లాగుతూ వెనక్కు పడితే- ఆ ఆకారం పట్టుకుంటింది. చిన్నగా ఇద్దరూ కలిసి జంగిడిలో వేరుశనగ ఉండల్ని దొంగతనం చేస్తారు. ఆ వ్యక్తి సన్నాసి అని గుర్తుపడుతుంది నీలాలు. కుక్క అరవడంతో, ఎవరో కదిలినట్లు అనిపించి సన్నాసి పరుగెత్తబోతే వేరుశనగ ఉండలు మురిక్కాలవలో పడతాయి. నీలాలు తను దాచిన ఒక్క శనగ ఉండను కొరికి సగం సన్నాసికి పెడ్తుంది. వర్షం మొదలుకావడంతో నీలాలు వణుకుతుంది. సన్నాసికి దగ్గరగా జరుగుతుంది. తన రెండు చేతుల్తో సన్నాసి వొంటిమీద గాయాలను మృదువుగా తాకుతుంది. సన్నాసి గాజుకళ్లు తలవని తలంపుగా చెమ్మగిల్లుతాయి. వాన కురుస్తూనే ఉంటుంది.

ఈ కథంతా అద్భుతమైన కవిత్వంగా రాశారు హనుమచ్ఛాస్త్రి. కథ ప్రారంభానికి, ముగింపుకు అంతగా సంబంధం కనపడకపోయినా, కథంతా ఆకలి గురించే అన్న భావన పాఠకుడిలో కలుగుతుంది. అరుదైన, గొప్పవైన వర్ణనలు ప్రతి పేరాలోనూ ఉన్నాయి. ఆకలితో అలమటించే వారి మాటల్లో వేదాంతాన్ని పలికిస్తాడు. సంతలో కూరగాయల్ని- ఇంద్రనీల మణి రాసుల వంటి వంకాయలు, కెంపుల వంటి ఉల్లిగడ్డలూ, పచ్చల వంటి బచ్చలకూర... అని వర్ణిస్తాడు. అలానే స్వార్థావరణం చీల్చి నిజమైన మనస్సు తెరచి చూపితే మనుషులు ఎంత దగ్గరకు వస్తారు అన్నారు. నీలాలు నవ్వును గురించి చెప్తూ - అడవిలో ముళ్లపొదల మీద అడవి మల్లెపూలు జ్ఞాపకం వస్తాయి అంటాడు. ఇక కథ ప్రారంభంలో కవి కవితాలోకంలో ఉన్నప్పుడు భార్య వచ్చి రేషను షాపుకు వెళ్లు అని చెప్పినప్పుడు అతని మనోలోకం గురించి హనుమచ్ఛాస్త్రి చెప్తూ - ఇంద్ర సభకు బదులుగా మా చాలీచాలని అద్దెవాటా, నాట్యఉజ్ఝ్వల రూపిణి ఊర్వశికి బదులుగా నిత్య సంసార యాత్రలో నలిగే పాతగళ్ల చీర బ్రాహ్మణీ కనపడేసరికినా పురూరవ చక్రవర్తి హిందూదేశంలో ఒక నాగరిక పట్టణంలోని ఆరో నెంబరు రేషను షాపు దగ్గరకు నడవలేక చట్టున తప్పుకున్నాడు అంటాడు. ఇలా కథంగా పాటకుడి భావనా లోకానికి, వాస్తవ లోకానికి మధ్య వంతెన కడుతుంది.

- డా. ఎ. రవీంద్రబాబు