Facebook Twitter
మానవత్వ వర్ణన ప్రతిభాశాలి ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి

 

కుటుంబ సంబంధాల్లోని తీరుకు, సమాజంలోని మానవ ప్రవర్తనకు కారణాలైన సిద్ధాంతాలను నమ్మి రచనలు చేసిన రచయిత్రి అచ్యుతవల్లి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మనుషుల జీవితాల్లోని అనేక పార్శ్వాలను నిజాయితీతో చెప్పిన రచయిత్రి. ఎక్కడా పరిమితులు, పరిధులు విధించుకోకుండా... సూక్ష్మంలో విశాలత్వాన్ని గ్రహించి కథల్లో రాసిన రచయిత్రి అచ్యుతవల్లి. నా పోరాటం పురుషుల మీద కాదు, వారిలో ఉన్న పురుషాధిక్య భావజాలం మీద అని సగర్వంగా చెప్పి, ఆ కోణంలోనే రచనలు చేసింది. చిన్నచిన్న హాస్యాన్ని, ప్రజలు మాట్లాడుకునే సాధారణ భాషలో అలవోకగా రాయగల ప్రతిభ అచ్యుతవల్లిది. తచన జీవితం నుంచే కాకుండా, సమకాలీన జీవితంలోని సమస్యలను గుండెలు బరువెక్కేలా చెప్పగలరు.

అచ్యుతవల్లి పూర్తి పేరు ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని దొంతవరంలో మే1, 1943లో జన్మించారు. కాకినాడలో తర్వాత మాధ్యమిక విద్యను పూర్తి చేసి, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. పట్టా పొందారు. ఇతర భాషల పై మక్కువతో హిందీ, సంస్కృత భాషల్లో విశారద పూర్తిచేశారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. హిస్టరీ చదివారు. ఇలా పలు భాషలపై పట్టు సాధించడం ఆమె రచనలకు ఎంతో ఉపయోగమైంది. తర్వాతి కాలంలో జయశ్రీ పత్రికలో కాలమిస్టుగా ఇజ్జత్, ఆజ్ ఔర్ కల్... రచన మాసపత్రికలో బాతోంమే ఖూనీ వంటి శీర్షికలు నిర్వహించి కాలమిస్టుగా పేరు తెచ్చుకోడానికి ఇవి ఎంతో ఉపకరించాయి. అలానే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని ఆకాశవాణిలో 1962 నుంచి 64 వరకు లలిత గీతాలు పాడారు. 1964లో రాఘవాచారిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పేరుతోనే రచనలు చేశారు. భర్త ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలకు వెళ్లడం ఆయన రచనా వస్తువు విస్తృతికి ఎంతో ఉపయోగపడింది.

అచ్యుతవల్లి సుమారు 400ల కథలు రాశారు. వీటిలో ఎక్కువభాగం మూగవోయిన ప్రకృతి, అవ్యక్తాలు - మనస్తత్వాలు, బాత్ ఏక్ రాత్ కీ, నాగావళి నవ్వింది, అచ్యుతవల్లి కథలు వంటి సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలు ఇతర భాషల్లోకీ అనువాదాలయ్యాయి. అచ్యుతవల్లి మొదటి కథ 'వంచిత' జగతి మాసపత్రికలో వచ్చింది. కానీ తర్వాత భారతి పత్రికలో వచ్చిన 'దీపకరాగం' ఆమెకు కథా రచయిత్రిగా మంచి పేరు తెచ్చింది. అసలు అచ్యుత వల్లి అనగానే తెలుగు కథా సాహిత్యంలో గుర్తుకు వచ్చే కథలు- సన్నాటా, ముత్యాల చెరువు, వర్షం వచ్చినరోజు, అభిశంస, ప్రయాణం, ఇజ్జత్... 'సన్నాట' కథలో పావురాళ్ల గూడు వంటి ఇంటికి ఓ వ్యక్తి కారులో రావడంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్లు వాళ్లవాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించే వాళ్లు వచ్చారని ఆశపడతారు. కానీ తీరా ఆ వ్యక్తి పాత ఇంటిని లాడ్జింగ్ గా మార్చడానికి వచ్చాడని తెలుసుకుంటారు. లేమిరికం కల్పించే ఊహలు ఆలోచనలకు, వాస్తవలాకు మధ్య జరిగే పోరాటం ఈ కథలో కనిపిస్తుంది. 'వర్షం వచ్చినరోజు' కథలో ధనవంతులైన సునంద, జయరాం భార్యాభర్తలు. కానీ సునంద అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. మొక్కజొన్న పొత్తులు అమ్మే ఎల్లమ్మ, టీ అమ్మే అప్పిగాడు... వారి మానసిక జగత్తు వర్షం కురిన రోజు ఎలా కకావికలంగా ఉందో అద్భుతంగా వర్ణిస్తుంది అచ్యుతవల్లి.

ఇక 'ముత్యాల చెరువు' కథలో ముత్యాలు దళిత స్త్రీ. ఆమెను ఆర్థిక, లైంగిక, కుల దోపిడీకి గురవుతున్న స్త్రీగా చిత్రీకరించారు రచయిత్రి. ఈ కథ చదివితే చలనచిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది. కుటుంబ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలను బహిరంగంగా విమర్శకు పెట్టిన కథ 'అభిశంస'.భార్యాభర్తల సంబంధం గురించి చెప్తూ - హైందవ వివాహ ధర్మం, సెక్స్ కోరికలకు లైసెన్స్ అనుకుంటారు చాలామంది పురుషులు. గృహస్థ ధర్మంలో ఎంత ఆనందం పొందవచ్చునో, ఎంత నిర్భయం, సంతృప్తి, ప్రశాంత జీవన మాధుర్యం అనుభవించవచ్చునో చాలామందికి తెలియదు. జీవితాన్ని సమస్యల వలయంలోకి నెట్టుకుంటారు. అని అంటారు. జీవితంలో ఏదశలో నైనా పెళ్లిచేసుకోవచ్చు అని 'జీవితానికో తోడు' కథలో చెప్తుంది. ఇలా స్త్రీల జీవితాల్లోని పలుకోణాల్లో వివరించేవే వీరి కథలు. 'వర్షించని మబ్బులు', 'నాతిచరామి' కథలో జయప్రద, 'మూగబోయిన ప్రకృతి' కథలో శంకరి, 'అబల' కథలో అచల, 'ఆజ్ అవుర్ కల్' కథలో మధుర... ఇలా ప్రతి పాత్రా వైవిధ్యమైన వ్యక్తిత్యంతో, సమాజంలోని విభిన్నమైన జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇంకా వీరి కథల్లో ప్రమే, స్నేహం, ఆర్ద్రత, సామాజిక బాధ్యత, భిన్నమైన మనస్తత్వాలు కనిపిస్తాయి.

అచ్యుతవల్లి ఇదెక్కడి న్యాయం, సీతకలలు, కొడిగట్టిన దీపాలు, తీరం చేరిన కెరటం, భ్రమరగీతం, పుట్టిల్లు, కానుక, కోరిక, ఏకాంత... వంటి 19 నవలలు రాశారు. ఇదెక్కడి న్యాయం నవల నాలుగు భాషల్లో చలనచిత్రంగా వచ్చింది. 1977లో ఈ చిత్ర పరంగా అచ్యుత వల్లికి అనేక అవార్డులు వచ్చాయి. వీరికి ఇంకా 1970లో మద్రాసు కేసరీ కుటీరం వారి గృహలక్ష్మీ స్వర్ణకంకణం, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, 1995లో సుశీలా నారాయణరెడ్డి అవార్డు, 2000లలో యువభారతీ సాహితీ పురస్కారం వచ్చాయి. ఈమె రచనలపై పరిశోధనలు కూడా జరిగాయి. ఎన్నో ప్రఖ్యాతమైన రచనలు మనకందించిన అచ్యుతవల్లి 2010లో మరణించారు. ఇప్పటి సమాజానికీ ఆమె రచనలు ఎంతో అవసరం.

- ఎ.రవీంద్రబాబు