Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 6

 

 “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 6

 గుడ్లూరులో ఎర్రపోత సూరి గారింట ఆనందమునకు అవధి లేదు.
   ఎర్రపోతనగారి మనుమడు ఎర్రనకి అక్షరాభ్యాసం. వంశపు పేరు ప్రతిష్థలను ఇనుమడింపజేసే వంశోద్ధారకుడుదయించి ఐదు సంవత్సరాలు అయింది.
   పోతమాంబ ఆమ్మాయి కావలెననుకుని అంబని వేడుకున్నా.. అంబ బ్రతిమాలినా, ఆ పరమశివుడు వినిపించు కోలేదు. తన అంశతో అబ్బాయి పుట్టాల్సిందే అని పట్టుబట్టాడు.
   పున్నమి చంద్రుని వంటి మోముతో వెలిగి పోతున్న పుత్రుని చూసిన పోతమ్మ తన కోరిక మాటే మరచిపోయింది.
   తండ్రి పేరే పెట్టాడు కుమారుడికి సూరన్న.
   అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు చిన్నారి ఎర్రన. అలనాటి శ్రీరామ చంద్రునికి ఏమాత్రం తీసిపోని ముద్దు మోము.. ఆకర్ణాంత విశాల నేత్రాలు.. తీర్చి దిద్దినట్లున్న నాసిక, ముచ్చటైన చిన్ని నోరు.. నవ్వుతే మెరిసే ముత్యాలవంటి పలువరుస.
   ఆ పైన.. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. "ఆకలి వేసినప్పుడు కూడా ఏడ్వకపోయిన ఎటులరా కన్నయ్యా.." అని అమ్మ ముద్దుగా కసురుకుంటుంది.
   ఐదు సంవత్సరాలు, ఐదు ఘడియల్లా అయిపోయాయి.
   నాయనమ్మకి ఎంత ఎత్తుకున్నా.. ఎంత ఆడించినా తనివి తీరదు. ఏనెలకానెలే కొత్త వింతలు బాలునిలో. అత్తా కోడళ్లిద్దరికీ బాలుని ఆట పాటలలోనే దినమంతా.
   "కొంచెం మేము కూడనూ ఇంటిలో సభ్యులమే నని గురుతుంచుకోండి. ఎప్పుడూ మనుమడేనా.. మా సంగతి ఏమిటి?" ఎర్రపోతన భోజనానికై పీట మీద కూర్చుని భార్యని పిలుస్తాడు.
   "ఇదిగో.. వచ్చేస్తున్నా. పప్పులో తాళింపు వేసి.." పేరమ్మ అనే లోపు తాళింపు మాడిన వాసన.
   "హమ్మమ్మ.. ఇవేళ మన పని గోవిందా! మాడిన పప్పే గతి." సూరన్న నవ్వుతూనే నిట్టూర్పు..
   "మ్మమ్ మ్మ.. తాతా.." కిలకిలా నవ్వుతూ బాలుడు వెనుకనుంచి తాత వీపు మీదికి ఎగ బ్రాకుతాడు. ఎర్రనకి పది మాసములున్నప్పుడు..
   బుడిబుడి అడుగులు వేసే వేళ.. అమ్మ తులసి కోట చుట్టూ, పెరడంతా తిరుగుతూ వెతకి వెతకి వేసారిపోయేది.
   "కన్నయ్యా! ఈ ఒక్క ముద్ద.. వెన్న వేసిన పెరుగన్నం. ఇదిగో ఈ ఉడుతకి పెట్టేస్తున్నా.."
   "ఏదీ ఉడుత?" అప్పుడు మల్లె పొద చాటునుంచి ఒక్క దుముకు దుమికి అడుగుతాడు, చిన్ని కృష్ణయ్య వలెనే మూతి కంటిన వెన్నని అరచేతితో తుడుచుకుంటూ..
   "ఇదిగో.." ఎత్తుకుని, ఒలిచిన అరటి పండు చిన్ని నోట్లో పెడుతుంది నాయనమ్మ.. ఎర్రనకి పదునెనిమిది మాసములప్పుడు.
    తాత కళ్లల్లో వెలుగై, ఆ ఇంటి నిత్య కృత్యములకు ఆధార కేంద్రమై తానే ప్రధానమై ప్రగడ అయ్యాడు ఎర్రన.
   అక్షరాభ్యాసమునకు అన్ని ఏర్పాట్లూ జరిగాయి.
   ఇల్లంతా కొత్త సున్నపు వాసన వేస్తోంది. ద్వారాలకి మామిడి తోరణాలు, బంతి పువ్వులు అలంకరించారు. ఎర్రని పట్టు చీర అంచు కనిపించేలాగ అందంగా కట్టి, పోతమాంబ పదుగురిచే పని చేయిస్తూ తిరుగుతోంది. సూరన్న శిష్యులు వీధి అరుగు మీద వేద పఠనం చేస్తున్నారు.
   శారదా నిలయమే ఆ గృహము. ఆ ఇంట వాగ్దేవి విహరిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎర్రన చిన్ని వేళ్లతో ఆకారాలు దిద్దుకుందామా అని అక్షర సరస్వతి ఎదురు చూస్తోంది.
   "ముహుర్తం దగ్గర పడుతోంది. గురువుగారు వచ్చు వేళ అయింది. అక్షింతలు కలిపారా? వెండి పళ్లెరంలో బియ్యం సిద్ధంగా ఉందా? ఫలములు, తమలపాకులు, వక్కలు, పసుపు కుంకుమలు.." పేరమ్మ హడావుడిగా అటూ ఇటూ నడుస్తూ, గడప తట్టుకుని పడబోయింది.
   "నాన్నమ్మగారూ! వస్తున్నా.. ఆగండి." పట్టుపంచ జారకుండా ఒక చేత్తో పట్టుకుని, పరుగెత్తుకుంటూ వచ్చాడు బుజ్జి ఎర్రన.
   బాల సుబ్రహ్మణ్యం అభయం ఇవ్వడానికి వస్తున్నట్లు అనిపించింది పేరమ్మకి. ఒక్క చిన్న త్రిశూలం మాత్రం లోటుగా అనిపించింది. ద్వారబంధం పట్టుకుని నిలదొక్కుకున్న నాన్నమ్మకి చెయ్యి అందించాడు ఎర్రన. కన్నుల ఆనంద భాష్పాలు తిరుగుతుండగా, ఆ చిన్ని చెయ్యి అందుకుని ఆ ఆసరాతోనే నిలబడినట్లు నటించింది.
   కించిత్తు గర్వంగా తలెగరేసి తల్లి వంక చూస్తూ, నాయనమ్మని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి ఆసనం మీద కూర్చుండబెట్టి అన్నాడు,
   "నాన్నమ్మగారూ! మీరిచ్చటనే ఉండండి. అమ్మగారు మిగిలిన పనులన్నీ చూసుకుంటారు." మనవడి ముద్దు మాటలకి మురిసిపోతూ, ఎర్రపోతన ప్రక్కనే తనకి అమర్చిన ఆసనం మీద కూర్చుంది పేరమ్మ.
   "ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో.." ఆహ్వానాన్ని అందుకుని, చూడవచ్చిన  పెద్దలు ఆశ్చర్యంగా చూశారు.
   హృదయం ఉప్పొంగగా ఎర్రపోతన పసివాడిని ఎత్తుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆనంద భాష్పాలని కండువాతో తుడుచుకున్నాడు.

   వాకిట ఒకటే కలకలం.
  "గురువుగారొచ్చారు.. అభివాదం చెయ్యండి.." గుసగుసలు..
   అందరూ ప్రక్కకి జరిగారు. సూరనాచార్యుడు గురువుగారి పాదాలు కడిగి, వినమ్రంగా లోపలికి తీసుకొచ్చాడు.
   శంకరస్వామి.. సూరనార్యుడి గురువు.
   అపర శివుని వలే గంభీరంగా అడుగులు వేస్తూ లోనికి వచ్చారు.
   అనుదినమూ శివార్చన జరుపుట వలన అలౌకికమైన ఆనందంతో ఆయన పెదవులు ఎప్పుడూ నవ్వుతున్నట్లే ఉంటాయి. మోములో ప్రశాంతత.. పవిత్రత. చూసిన వారు చేతులు అసంకల్పితంగా జోడిస్తారు.
   ప్రతీ శివరాత్రీ నిష్ఠగా, నియమంగా నిర్వహిస్తారు. శంకరస్వామి సమక్షంలో కైలాసంలో ఉన్న అనుభూతి కలుగుతుంది ప్రతీ ఒక్కరికీ. ఆ శంకరస్వామి శిష్యుడే సూరన్న.. ఆయన భావి శిష్యుడు ఎర్రన్న.
   గురువుగారిని ఉచితాసనం అలంకరించమని ప్రాధేయపడి, ఎర్రన్నని నమస్కరించమని ఆదేశించాడు సూరన్న. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు ఎర్రన్న.. పట్టుపంచ పైకి లాక్కుని.
   "గురువుగారికి నమోవాకములు." ముద్దుముద్దుగా అంటున్న ఎర్రన్నని ఆప్యాయంగా ఒడిలోనికి తీసుకున్నారు శంకరస్వామి.
   ఒకసారి వినాయకుని వలే.. ఒకసారి షణ్ముఖుని వలే గోచరించాడు ఎర్రన.
   సంకల్పం, వినాయక పూజ, నవగ్రహ పూజ, చేశారు సూరన్న దంపతులు. పిదప వెండి పళ్లెంలో నున్న పసుపు బియ్యంలో బాలుని చేత అక్షరాలు దిద్దించారు శంకరస్వామి.
   "ఓం నమః శివాయః సిద్ధం నమః" మూడు మారులు అనిపించారు. ఆ బాలుని స్పష్టమైన ఉఛ్ఛారణ, వీణ మీటినట్లున్న కంఠస్వరం ఆలకించి అక్కడున్న వారందరు ముగ్ధులైపోయారు.

   ఎర్రన్నకి ఎనిమిదో ఏట, ఎనిమిది మంది ఋత్విక్కులను రావించి అంగరంగ వైభవంగా ఉపనయనం కావించారు. నిత్యం త్రి కాలముల యందు సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపం తాతగారి పక్కన కూర్చుని నిష్ఠగా చేస్తాడు.

vadugu9.jpg

 (చిత్రం- గూగుల్ సౌజన్యంతో)

గాయత్రి జపిస్తున్నప్పట్నుంచీ ఎర్రన్నలో కొత్త వెలుగు పొడచూపసాగింది. ఏకాగ్రత పెరిగింది. తాతగారితో ఎర్రన అనుబంధం మరింత పటిష్ఠమయింది. తాతగారితో ఉదయం కేశవుని దర్శనం, సాయం సమయం తండ్రి గారితో.. ప్రదోష వేళల్లో నీలకంఠేశ్వరుని సేవ, నిత్య కృత్యాలయ్యాయి.
   పగటి వేళల గురువుగారైన శంకర స్వామి సేవ చేసుకుంటాడు. ఆ సమయంలో ఆయన వద్ద అనేక ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుంటాడు.
   ఆచార్యుడైన తండ్రి శిష్యులకి నేర్పిస్తున్న సమయంలో.. తను కూడా అన్ని పాఠాలనూ వల్లె వేయ సాగాడు. చురుకుగా ప్రతీ పాఠమూ ఇట్టే పట్టేసి తాతగారికి అప్పచెప్పేస్తాడు.. వెన్నెల్లో ప్రక్కనే పడుక్కుని.
   మహాభారత కథలు విటుంటే ఎన్నో సందేహాలు.. తాతగారికి కూడా కష్టమే అవి తొలగించడం.
   "తాతా! కొంచెం పెద్దయ్యాక నీ అంతట నువ్వే చదువుకుని అర్ధం చేసుకోవాలిరా! నేను తీర్చలేను నీ అనుమానాలు.." ఎర్రపోతన చేతులెత్తేస్తాడు.
   "చదవడ మేం తాతగారూ! నేను రాసేస్తా మహాభారతం." హామీ ఇచ్చేశాడు తొమ్మిదేళ్ల ఎర్రన.
  
   ఎర్రన్న పది సంవత్సరములు నిండుతుండగానే ఉభయభాషల్లోనూ ప్రావీణ్యత సంపాదించాడు. సూరన్న, కుమారునికి సంస్కృతాంధ్రాలలోని కవిత్వ రహస్యాలను సవిస్తరంగా నేర్పాడు.
   గురువుగారైన శంకరస్వామి ప్రభావం ఎర్రన్న మీద రోజు రోజుకూ అధికం అవుతోంది. తండ్రి కంటే గురువుగారే ఆదర్శం ఎర్రన్నకి. శివారాధన కూడా పెరుగుతోంది. గురువుగారు ఈశ్వర సమానుడనీ, ఆయన చరణారవింద ధ్యానం ఆనందం కలిగిస్తుందనీ చిన్నతనమందే గ్రహించాడు.
   శ్రీశైలం ఆదిగా ఆ చుట్టు ప్రక్కల అన్ని శివక్షేత్రములలోనూ శంకరస్వామి శివపురాణం ప్రవచిస్తూ ఉద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. శైవమతం ప్రాచుర్యంలో ఉన్న రోజులు అవి.
   పలనాటి యుద్ధం ముగిశాక ప్రజల్లో మతం అంటేనే భయం పట్టుకున్న రోజులు. ఆ భయం పోగొట్టి దేముడి మీద నమ్మకం కలిగించి, క్రమశిక్షణతో జీవనం గడవడానికి శంకరస్వామి వంటి గురువుల ఆవశ్యకత అవసరమయింది.
   "ఏ మతమైనా చేసే మంచి ఒక్కటే.. క్రమశిక్షణ. దేముడు ఉన్నాడా? ఉంటే ఏ రూపంలో ఉంటాడు.. అనే సందేహం కంటే, మనల్ని కాపాడడానికి ఎవరో ఉన్నారన్న నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. ఆ దేముడు శివుడైనా సరే.. కేశవుడైనా సరే.." ఎర్రపోతన మనుమడ్ని ప్రక్కన పడుక్కోబెట్టుకుని, ప్రతీ రాత్రీ శివపురాణం, విష్ణుపురాణం వివరిస్తాడు.
   ఎర్రపోతన తన ఇష్ట దైవమైన నరసింహుని గాధలను.. చిన్నారి ప్రహ్లాదుని కాపాడిన విధానమును చెప్తుంటే ఎర్రన కళ్లు పెద్దవి చేసుకుని వింటూ ఉంటాడు.
   "నేను నృసింహుని కథ కావ్యంగా రాస్తా.." తాతగారికి మాట ఇచ్చేశాడు కూడా.
   "మరి ఈశ్వరుడంటే నీకు ఇష్టం కదా! మీ గురువుగారు శంకర తత్వం ఉపదేశిస్తూ ఉంటారు. నువ్వు కూడా రోజూ శివపురాణం చదువుతావు. కేశవుని కథ రాయగలవా?" ఎర్రపోతన అడిగాడు.. మనవడి అభిప్రాయం తెలుసుకోవడానికి.
   "అవును తాతగారూ. నాకు శివతత్వం నచ్చుతుంది. ఈశ్వరుడు భోళాశంకరుడు. భక్త వత్సలుడు. తలచినంతనే భక్తుల అభీష్టాలు నెరవేరుస్తాడు. అంతే కాక సులభ ప్రసన్నుడు. మామ దక్షుడు అంత అపకారం చేశాడా.. సతీదేవి ఆత్మాహుతికి ఆయనే కారణమా.. అయినా ఏంచేశాడో చూడు." మిలమిలా మెరుస్తున్న కళ్లతో అన్నాడు ఎర్రన.
   "ఏం చేశాడేం?"
   కొంచెం సిగ్గుపడ్డాడు ఎర్రన తన ఆవేశానికి.
   "ఫరవాలేదు చెప్పు." తాతగారు చిరునవ్వుతో అన్నారు.
   "ముందర మహోగ్ర రౌద్రాకారుడై జటాజూటంలో నుంచి జటను పెరికి విసిరి, భద్రకాళి, వీరభద్రులను సృష్టించాడా.. వారు వికటాట్ట హాసాలు చేస్తూ, దక్షయజ్ఞ వాటికకు వెళ్లి, సమస్తం ధ్వంసంచేసి, దక్షుని తల నరికి హోమ గుండంలో పడేశారు. ఆ తల మాడి మసైపోయింది. వీరభద్రుడు వికటాట్టహాసం చేశాడు. భద్రకాళి నాలుక జాపి విలయతాండవం చేసింది. దేవతలు భయోద్వేగులై కైలాసం చేరి శాంతింపచేయమని వేడుకున్నారు ఆ పరమశివుని.
   విష్ణు, బ్రహ్మాది దేవతలు వేడుకోగా శివుడు శాంతించి, దక్షయజ్ఞం పూర్తి చెయ్యడానికి అనుమతి ఇచ్చాడు. ఉత్తరంగా నిద్రిస్తున్న ఒక మేక తలకాయ తెచ్చి దక్షుని మొండెమునకు అతికించి దక్షునికి ప్రాణం పోశాడు శివుడు. దక్షుడు తన తప్పిదం తెలుసుకుని, శివుని స్తుతించి యజ్ఞం పూర్తి చేశాడు. చూడండి తాతగారూ.. తన భార్య మరణానికి కారకుడైన వాడికి ప్రాణం పోశాడా లేదా? తాతగారూ.. ద్రాక్షారామం వెళ్దామా ఒక్కసారి.."
   "ఎందుకూ?"
   "అక్కడే కద దక్షుడు యజ్ఞం చేసింది. దానినే దక్ష వాటిక అంటారు"
   "నిజమే.. అటులనే వెళ్దాం. సమయం వచ్చినప్పుడు.  కానీ చెయ్యని తప్పుకి ఎందరో బలైపోయారు.. వీరభద్రుని ఆవేశం వల్ల. దక్షుడినొక్కడినీ చంపమనచ్చు కదా.. అంత విధ్వంసం ఎందుకు? ఎందరికో అవయవాలు పోయాయి. ఎంతో బాధననుభవించారు. మరి అన్యాయం కదా? పరమ శివుడు ఆ విధంగా చెయ్యవచ్చునా.. భక్త వరదుడంటావు.. ఆ పోయిన వారిలో ఆయన భక్తులు కూడా ఉండ వచ్చును కదా!" ఎర్రపోతన కుతూహలంగా అడిగాడు.
   "పరమ శివుడు లయకారకుడు. ప్రళయ తాండవం ఆయన సహజ ధర్మం. మహాభారతంలో వ్యాస మహర్షి చెప్పలేదా చేసిన కర్మ అనుభవించక తప్పదని. పాపక్షయం తప్పదని. అందుకే ఆ విధ్వంసం. ఎవరైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు."
   ఆ వయసులో అంతటి వేదాంతం చర్చిస్తున్న మనవడిని చూసి ఎర్రపోతన మూగవాడయ్యాడు. అది చాలదన్నట్లు ఆశువుగా ఒక కవిత చెప్పాడు ఆ బాల ప్రాయంలోనే ఎర్రన.. తన ఇష్ట దైవమైన నీలకంఠేశ్వరుని మీద..
   "నిను సేవించిన కల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
   ఘన కోటీశ కటీపటీ తటిపటీ గంధేభ వాటీపటీ
   రసటీ హారికటీ సువర్ణ మకుటీ ప్రఛ్ఛోటికాపేటికల్
   కన దామ్నాయ మహా తురంగ శివలింగా నీలకంఠేశ్వరా"
   తాతగారు నిశ్చేష్టులై నిలబడ్డారు. ఇంత జటిలమైన సమాస కల్పనా? ఇతడెవరు? ఏదో కార్యోద్ధరణకై అవనికొచ్చిన శంభు సుతుడా!
   "అయిననూ తాతగారూ! శివకేశవులలో భేదం లేదు కదండీ. అదే కదా హరిహరాద్వైతం."
   "అవును.. అది నిరూపించడానికి నీకొక కథ చెప్తాను విను."
   "ధధీచి కథేగా.."
   "ఊ.. నీకు తెలుసా?"
   "పూర్తిగా తెలియదు తాతగారూ.. ఆ మధ్యన ఒక పిచుక పిల్ల గూటిలోంచి కింద పడి, మెడ విరక్కొట్టుకుంది. గిలగిలా కొట్టుకుంటుంటే దాని పని అయిపోయిందనుకున్నాం నాన్నమ్మ గారూ, నేనూ. కానీ అది కొంచెం సేపటికి, మెడ విదిలించి లేచి ఎగిరి పోయింది అప్పుడు నాన్నమ్మ అన్నారు, ’ఇది ధధీచి వంటిదిరా బాబూ.” అని. అప్పుడే విన్నా. నాన్నమ్మని అడుగుతే.. హరిహరాద్వైతం, శివకేశవులు.. అంటూ చెప్పబోయారు. ఈ లోగా ఏదో పనిలో ప్రవేశించి మరచారు."
   ఎర్రపోతసూరి ఫక్కున నవ్వి బాలుని తల నిమిరాడు.

ధధీచి మహర్షి(గూగుల్ సౌజన్యంతో)

 

"పూర్వకాలంలో క్షుపుడను రాజు ప్రజలను కన్నబిడ్డల వలే పాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థానానికి ధధీచి మహర్షి తరచు వెళ్లి రాజుకి ధర్మ శాస్త్రాలు బోధిస్తూ ఉండే వాడు.
   భృగు వంశీయుడు.. చ్యవన మహర్షి కుమారుడు ధధీచి మహర్షి. సకల ధర్మ శాస్త్రాలను ఔపోసన పట్టిన వాడు. క్షుపునికి శాస్త్రాలను బోధిస్తూ అతను ధర్మ మార్గమున నడచుటకు తోడ్పడుతూ ఉండే వాడు. ధధీచి శివ భక్తుడు. క్షుపుడు విష్ణు భక్తుడు.
   రాజు కూడా మహర్షి ఆశ్రమానికి తరచుగా వెళ్తుండే వాడు. ఇరువురి మధ్య స్నేహము, ఆప్యాయత నెలకొన్నాయి.
   ధధీచి బోధించిన ధర్మ సూత్రాలను తన పాలనలో ఉపయోగిస్తూ ప్రజారంజకంగా పాలించే వాడు క్షుపరాజు. ఒక రోజు క్షుపుడు, ధధీచి ఆశ్రమానికి వెళ్లినప్పుడు జరిగిందీ అవాంచనీయ సంఘటన..
   ఉన్నట్లుండి క్షుపుడు మహర్షిని ఒక ప్రశ్న అడిగాడు.
   "స్వామీ! సకల సంపదలూ ఇచ్చే లక్ష్మీదేవి పతి, పీతాంబరధారి, అష్టైశ్వర్యములూ కల వైకుంఠ నివాసి, సర్వ వ్యాపకుడు అయిన విష్ణు మూర్తిని వదిలి.. పులి చర్మం కట్టి, శ్మశానంలో తిరుగుతూ, పాములని ఆభరణాలుగా ధరించి, నెత్తి మీదినుంచి నీరు కారుతూ, బిచ్చమెత్తుకునే శివుడ్ని మీరెందుకు ఆరాధిస్తున్నారో నాకు అర్ధం అవడం లేదు. వివరించ గలరా?"
   "మహారాజా.. అనాలోచితంగా పలుకుతున్నావు. ఈశ్వరుడు శాసకుడు. జగత్పిత. పార్వతీ దేవి జగన్మాత. బిక్షమెత్తుట ధర్మ మార్గం. అది భక్తులకు మోక్షం ఇవ్వడానికి మాత్రమే. బిక్షాటనం ప్రాచీన సాంప్రదాయం. అందుకే ఆయన ఆది భిక్షువైనాడు. ప్రపంచంలో బ్రతకటానికి కావలసింది ఆహారం, నిద్ర, భయం లేకపోవడం. ఇవి ప్రాధమిక అవసరాలు. అందుకే ఆయన నివాసం రుద్రభూమి. భయం పోగొట్టడానికే అది. ఆహారం ఎటువంటిదైనా కడుపు నిండటం ప్రధానం. అదే విధంగా నిద్ర.. హంస తూలికా తల్పం అయినా, కటిక నేల అయినా నిద్ర పోవడం ముఖ్యం.
   ఇంక నెత్తి మీది నీరా.. ఆ జటాజూటమున గంగమ్మని బంధించకపోతే నువ్వూలేవు.. నేనూ లేను. జగమే లేదు. అంతా నీటి మయమే.
    అష్టైశ్వర్యాలూ అనుగ్రహించే శివుడికి అష్ట దిక్కులు అంబరాలే. ఆయన భక్తులందరి హృదయాలలోనూ నివసిస్తాడు. శ్మశానవాసి అని చులకనగా చూడ కూడదు.
   అణిమాది అష్ట సిద్ధులను, పద్మాది నవ విధులనూ అనుగ్రహించ గలవాడు ఈశ్వరుడే. వీటిని కుబేరునికి అనుగ్రహించినదే ఆయన. ధన, వస్తు వాహనాలమీద కోరిక సామాన్యులకి ఉంటుంది. వాటిని అనుగ్రహించే దేవ దేవునికి ఎందుకుంటుంది?"
   మహర్షి, శివుని గురించి చెప్తుంటే.. చెప్పమని అడిగిన మహరాజు కనులు ఎర్రవడ సాగాయి. ఎంతటి అహం.. తన ఎదుటే.. ఆ కొండలు కోనలు పట్టుకుని తిరిగే వాడిని పొగుడుతాడా!
   కోపోద్రేకాలతో, ముందూ వెనుక చూడకుండా ఒర లోనుండి కత్తి లాగి ఒక్క వ్రేటుతో ధధీచి తల నరికాడు. ఆ తరువాత ఒక్క క్షణం కూడా ఆగకుండా నిష్క్రమించాడు.
   ధధీచి మహర్షి, ప్రాణం పోయే సమయంలో తాతగారైన శుక్రాచార్యుడ్ని స్మరించాడు. స్మరించి ప్రాణం విడిచాడు. వెంటనే శుక్రాచార్యుడు ప్రత్యక్షమయి, మనుమని మృత దేహాన్ని చూసి.. మృత సంజీవనీ విద్యతో ధధీచిని బ్రతికించాడు. భవిష్యత్తులో ఎవరూ చంపకుండా మృతసంజీవనీ విద్య ఉపదేశించాడు. ఒక మండల కాలం ఆ మహా మంత్రాన్ని నియమ నిష్ఠలతో జపించమన్నాడు.
   మహర్షి ఆ విధంగా చేసి దృఢకాయుడయ్యాడు.
   అతని తపస్సుకి మెచ్చిన పరమశివుడు భక్తుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
   ధధీచి కోరినట్లు మరణం లేకుండా వరమిచ్చి, త్రిశూలం ఒసగాడు.
   వెనువెంటనే ధధీచి మహర్షి, మహోగ్ర జ్వాలలతో దహించిపోతూ, మంత్రి సామంతాదులతో నిండు కొలువులో నున్న క్షుపుని వద్దకు వెళ్ళి ఎడం కాలితో బలంగా తన్నాడు.
   క్షుపుడు వెంటనే సింహాసనం మీదినుంచి కింద పడిపోయాడు. అవమానం పట్టలేక ధధీచి మీదికి ఒరలోని కత్తిని తీసి ప్రయోగించాడు. కానీ చిరంజీవి అయిన ధధీచిని ఆ ఆయుధం ఏమీ చెయ్యలేకపోయింది. అది మరీ పరాభవమనిపించింది.
   శ్రీమన్నారాయణుని ధ్యానించాడు. "నీ అంశతో జన్మించిన నన్ను కాషాయ బట్టలు కట్టుకున్న ఒక సన్యాసి అవమానించాడు. ఇది నేను భరించలేకపోతున్నాను స్వామీ.. పాహిమాం.." అని వేడుకున్నాడు.
   ధధీచి శివుడిని ప్రార్ధించాడు. "నన్ను ప్రశ్నించి, సమాధానం ఎరుక చేస్తుంటే అన్యాయంగా నరికాడు.. ఈతడి మద మణచు స్వామీ.."
   అప్పుడు శ్రీమన్నారాయణుడు, శివుడు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు.
   విష్ణుమూర్తి మహారాజునకు, శివుడు ధధీచికి బోధ చేశారు.
  "బ్రాహ్మణ తేజం ముందు క్షత్రియ తేజం నిలువలేదని మహరాజుకీ, విష్ణు స్వరూపుడైన రాజుని అవమానించ తగదని మహర్షికీ నీతి చెప్పారు.
   "శివుడూ కేశవుడూ ఒకరే. ’నేహనా నాస్తి కించన”. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఈ తత్వాన్ని మీరు తెలుసుకోవాలి.
   "మద్భక్తా శంకర ద్వేషీ మా ద్వేషీ శంకర ప్రియః
    తావుభో నరకం యాతః యావచ్చంద్ర దివాకరే//
   విష్ణు ద్వేషి అయిన శివ భక్తుడు, శివ ద్వేషి అయిన విష్ణు భక్తుడు, సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకం అనుభవిస్తారు. మీరిద్దరూ పూర్వం వలే మంచి స్నేహితులుగా ఉండి ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్ధించుకోండి. సామాన్య ప్రజలకి ఆదర్శంగా నిలవండి."
   దేవదేవులిద్దరి హితం విన్న మహరాజు, మహర్షి భక్తితో మ్రొక్కి, సాష్టాంగ ప్రమాణం చేశారు."
   "తాతగారూ! విష్ణువుని సేవిస్తే శివుడు ప్రీతి చెందుతాడు కదూ.." తాతగారు చెప్పిన ధధీచి వృత్తాంతం శ్రద్ధగా విన్న ఎర్రన వెంటనే అనేశాడు భక్తిగా చూస్తూ.
   "అవును.. ఆ పరమ శివుడే తారక మంత్రం జపిస్తూ ఉంటాడు. విష్ణ్వవతారమైన రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు రామేశ్వరంలో."
   "అయితే నేను రామాయణ కావ్యం కూడా రాసేస్తా!" ముద్దు ముద్దుగా మాట ఇచ్చిన మనుమని అపరి మితమైన వాత్సల్యంతో చూసి, హృదయానికి హత్తుకున్నాడు ఎర్రపోతన.
  
    "అవును ఎర్రనా! నీకొక పని చెప్తాను చేస్తావా?"
   "ఆనతినివ్వండి. అవశ్యం నెరవేరుస్తా."
   "దానికంటే ముందుగా నీకొక చరిత్ర చెప్పాలి. ఆ తరువాత నీవొక కర్తవ్యం నెరవేర్చాలి."
   "తమ ఆజ్ఞ."
                                ……… ( ఇంకా వుంది) ………..


.... మంథా భానుమతి