Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 5

   


“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 5

gudi.jpg


                   
   అద్దంకి సీమ ఆ సమయంలో ప్రశాంతంగానే ఉంది. గుడ్లూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళ లాడుతూ ఉంది. ఎర్రపోతన, సూరన్న కూడా ఆ పురి గురించి వినే ఉన్నారు. అందుకనే నిస్సంకోచంగా ఆహ్వానాన్ని అంగీకరించారు.
   ముక్కంటి మిన్నగా వెలసిన పురము
   నిక్కముగ నంబ న్తెచ్చిన పురము
   చక్కగ చెన్నకేశుడు చేరిన పురము
   చొక్కముగ మారుతి చొప్పిన పురము.
   ఈ నేత్రపురమున..
   గుట్టలు గుళ్లై ప్రకాశించాయి. హరి హరులు ప్రజలకు స్వయంగా అద్వైతం బోధించినట్లుగా సమానంగా పూజలను అందుకుంటున్నారు. లక్ష్మీ సరస్వతులు ఆ పురిలో తిష్టవేసుకుని కూర్చున్నారు.
   నేత్రపర్వంగా వయ్యారి పారిజాతములు, సొంపగు సంపంగిలు, దీటైన దేవకాంచనములు, గుత్తముగ గన్నేరులు, సువర్ణ గన్నేరులు, చెంగలువలు.. నాగమల్లెలు, మందారాలు.. అన్ని చెట్లుయు నాలయమ్ముల నందముగా నిలిచి, ఎప్పుడెప్పుడు పరమాత్మ సన్నిధికేగుదుమా అని ఎదురు చూస్తూ ఉన్నాయి.
   మరి ఫల వృక్షములేమైన తక్కువ ఉన్నవా..
   నారింజలు, మామిళ్లు.. కదళీ ఫలములు, నారికేళములు.. తియతియ్యని తొనలొసగు పనసలు.. వనములన్ మెండుగ నుండి, అచ్చోట ఏ లోటు లేకుండ నిండుగ నైవేద్యమునకు నిబిడముగా కాస్తున్నాయి.
   అది నాకపురమా లేక వైకుంఠపురమా అనిపించక మానదు.
   అమృతధారలనొసగు ఆవు అమరావతినందు నొకటియే నుందేమో.. ఈ పురమున మాత్రము పెక్కు ధేనువులు ఉన్నాయి.
   ఇంక ఇచ్చోట గృహములు..
   తీరుగా, శుభ్రముగా.. గడపలన్నీ పసుపు, కుంకుమలతో శ్రీకరములై అలంకరించి ఉన్నాయి.
   చాతుర్వర్ణములవారు కలసి మెలసి.. అవసరాలలో, ఆపదలలో ఒకరినొకరు ఆదుకుంటూ జీవిస్తున్నారు.
   సూరన్న కుటుంబం ఈ గ్రామమునకు వచ్చి మూడు మాసములవుతోంది.
   సూరన్న ఆలయ నిర్వహణ చూస్తూ, విప్రబాలురకు వేద మంత్రాలు, క్షత్రియ బాలురకు యుద్ధనీతి, వైశ్య బాలురకు వ్యాపార రహస్యాలు నేర్పుతున్నాడు. వృత్తివిద్యలనభ్యసించేవారు పురాణగాధలను, ఇతిహాసాలను వింటూ అందునుండి భక్తి భావనలు, నీతి శాస్త్రమును నేర్చుకుంటున్నారు.
   నెమ్మది నెమ్మదిగా పేరమ్మ, పోతమాంబలు కూడా కొత్త పరిసరాలకి అలవాటు పడుతున్నారు. ఇంచుక ప్రశాంతత కన్న మరి కావలసిందేమి?     కడుపుకింతన్నము, కాయమునకింత బట్ట.. అంతియే కదా!
   అయితే.. మానవునికి సంతృప్తి ఎందులో కలుగుతుంది?
   ఒక రోజు..
   ఎర్రపోతన మన్నేరుకి వెళ్లి, స్నానం చేసి వచ్చి, కేశవుని ఆలయానికి వెళ్లాడు. సూరన సరే.. అనుదినమూ బాలభానుని దర్శనమే నీలకంఠుని సన్నిధిలో, ఆ విద్వన్మణికి.
   ఇంట పనిపాటలు ముగించుకుని, చావడిలో కూర్చుని వత్తులు చేసుకుంటోంది పేరమ్మ. కోడలు, పెరటి అరుగు మీద బియ్యం, పప్పుధాన్యాలు బాగు చేసుకుంటూ వాల్మీకి రామాయణంలో, బాలకాండలోని శ్లోకాలు పాడుకుంటోంది.
   "నమోస్తు రామాయ సలక్ష్మణాయ
    దేవ్యైచ తస్మై జనకాత్మజాయై
   నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
   నమోస్తు చంద్రార్క మరుద్గుణేభ్యః"
   సన్నని కంఠంతో రాగయుక్తంగా పాడుతున్న కోడలి స్వరం వింటున్న పేరమ్మ, వాకిట్లో చప్పుడు విని లేచింది.. కుతూహలంగా చూస్తూ.
   సైనికులు కవాతు చేస్తున్న శబ్దం..
   అత్తా కోడళ్లు ఇద్దరూ వాకిలి తలుపు తీసుకుని మిద్దె బయటికి వచ్చారు.
   పన్నెండు మంది.. పదునాలుగు నుంచీ పదహారేళ్ల వయసు మధ్య మగపిల్లలు.. సైనికుల ఆహార్యము, చేత ఖడ్గములు ధరించి, కవాతు చేస్తూ  వెళ్తున్నారు. వారి ముందు ఒక శిక్షకుడు నడుస్తూ సూచనలిస్తున్నాడు.
   పోతమాంబ కన్నులు పెద్దవి చేసి చూస్తోంది ఆశ్చర్యంగా.
   "ఈ పసివారు ఎక్కడికి అత్తయ్యా? గురుకులంలో పాఠాలు వల్లె వేయవలసిన వయసులో.."
   "ఏముంది.. రాచ సైన్యంలో చేరడానికి.. శిక్షణకై తీసుకు వెళ్తున్నట్లున్నారు. మరలా ఎప్పుడు ఇళ్లకి వస్తారో ఏమో? ఏం యుద్ధాలో.. ఏం రాజ్య కాంక్షలో! అన్యాయంగా పసి మొగ్గల జీవితాలు వాడిపోతున్నాయి." పేరమ్మ గట్టిగా నిట్టూర్చి లోపలికి నడవబోయింది.
   "అంటే వీరందరూ ఇంటికి తిరిగి వెళ్లరా?" కోడలి మాటల నిండా ఆవేదన..
   "ఏం చెప్పం తల్లీ! ఎవరి రాత ఏ విధంగా ఉందో.." పేరమ్మ మాట పూర్తి కానే లేదు..
   వీధరుగు చివరికి వెళ్లి భళ్లున వాంతి చేసుకుంది పోతమ్మ.

   కళ్లు గిర్రున తిరిగి కిందికి పడిపోబోతున్న కోడలిని పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లిమంచం మీద పడుక్కోబెట్టింది పేరమ్మ. చల్లని నీటిలో ముంచిన బట్ట తీసుకొచ్చి మొహం తుడిచి, లేపి వేడి వేడి పాలు తాగించింది.
   పాలు తాగిన వెంటనే కళ్లు మూసుకుని, పడుక్కుంది పోతమాంబ. నుదుటి మీద చెయ్యివేసి చూసింది పేరమ్మ. చల్లగా.. మంచుముక్క పట్టుకున్నట్లుంది. వెంటనే, పళ్లెంలో పసుపు ముద్దగా కలిపి, అరిపాదాలకి రాయసాగింది.
   "ఏం జరిగింది?" అప్పుడే లోనికి వస్తున్న ఎర్రపోతన అడిగాడు, ఆందోళనగా.
   "ఏం లేదు.. సైన్యంలో చేరబోతున్న ఆ చిన్న పిల్లలని చూసి వ్యాకులపడినట్లుంది. సున్నితమనస్కురాలు.. ఏ కొంచెం అలజడికి తట్టుకోలేదు."
   "ఉండు.. వైద్యుడ్ని పిల్చుకొస్తా.." వెంటనే వెళ్లి పక్క వీధి చివరనే ఉన్న ధన్వంతరిగారిని తీసుకొచ్చాడు ఎర్రపోతన.
   "అమ్మాయి అప్పట్నుంచీ కళ్లు తెరవడం లేదు. అపస్మారకంగా పడుంది. సూరన్నకి కబురంపండి.. " పేరమ్మ ధైర్యంగానే ఉంది కానీ, వయో భారం చేత కాళ్లు, చేతులు వణుకుతున్నాయి.
   వైద్యుడు నాడి పట్టుకుని చూశాడు. కను రెప్పలు లేపిచూశాడు, అప్పుడు కొద్దిగా కదిలింది పోతమ్మ. "నోరు తెరుస్తావామ్మా?"
   బలవంతమ్మీద నోరు తెరిచి నాలుక జాపింది.
   "ఏమీ ఆందోళన వద్దండీ ఎర్రనగారూ! కాస్త రక్త హీనత.. అంతే. మీ ఇంట పాపాయి పారాడ బోతున్నాడు. మంచి ఆహారం.. రోజూ క్షీరాపానం చేయించండి. అంతా సవ్యంగా అయిపోతుంది." ధన్వంతరిగారు సరంజామా సర్దుకుని బైటికి నడిచారు.
   శిష్యునిచే కబురందుకుని పరుగున వచ్చిన సూరన్న శుభవార్తని విన్నాడు.
   పక్కన కూర్చుని ఆప్యాయంగా భార్య చెయ్యి పట్టుకున్నాడు.
   "మనకి అమ్మాయే పుట్టాలి స్వామీ.." నీరసంగా అంటున్న పోతమ్మని ప్రశ్నార్ధకంగా చూశాడు సూరన్న.
   "అబ్బాయైతే యుద్ధంలోకి తీసుకుపోతారు.." కళ్లు పెద్దవి చేసి, భయంగా చూస్తూ అంది పోతమాంబ.. ఒక స్త్రీ.. కాబోయే మాతృ మూర్తి.
   "ఆలోచన మాని విశ్రాంతి తీసుకో."
                                              ……………

                                                      3
                                               అధ్యాయము
  కాకతీయుల రాజధాని, ఓరుగల్లు పట్టణంలో..
 "హూ! విశ్రాంతి.. ఎక్కడుందది? ఆ పదానికి అర్ధం మర్చిపోయి చాలా కాలమయింది. సామాన్య ప్రజకే నయం. అమ్మాయయితే రక్షణ ఉంటుంది. మరి రాచ పుట్టుక పుడితే.. అబ్బాయైతేనే కాదు యుద్ధంలోనికి తీసుకుని వెళ్లేది!"
   గుడ్లూరుకి వాయవ్య దిశగా కొన్ని యోజనాల దూరంలో మరొక స్త్రీ అటువంటి ఆవేదనతోనే ఆలోచిస్తోంది. ఆవిడే కాకతీయ సామ్రాజ్య మహా రాజ్ఞి రుద్రమదేవి.
   రాణీ రుద్రమదేవి తన ప్రాసాదంలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతోంది. ముఖంలో గాంభీర్యం, కన్నులలో వేదన. కుడి చేయి పిడికిలితో ఎడమ చేయి అరచేతిలో కొట్టుకుంటోంది.
   తన తండ్రి అమ్మాయినైనా అబ్బాయి వలెనే పెంచాడు. యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. రుద్రదేవుడని్ లోకానికి పరిచయంచేసి యువరాజ పట్టాభిషేకం చేశాడు. కానీ ఎంతకాలం మభ్యపెట్టగలిగాడు? చివరికి.. తను ఉండగానే కాబోయే మహారాణి అని రాజ్యాధికారం అప్పచెప్పాడు.
   తను అమ్మాయే కానీ.. రాజ్య స్వీకారం అయినప్పటిప్పటినుండి.. ఎన్నెన్ని యుద్ధాలు? శిరస్త్రాణం ధరించి.. కత్తీ, డాలూ, కవచం.. అశ్వారోహణ.
   అనుక్షణం అప్రమత్తత.
   అంతూ దరీ కనిపించడం లేదు. ఎన్ని ప్రాణాలు గాలిలో కలిశాయి.. కలిసి పోతున్నాయి? అంతర్యుద్ధాలు.. తను స్త్రీ అని మరింత చులకన..
   నలు ప్రక్కలనుండీ సరిహద్దులోని రాజులు అనుక్షణం కయ్యానికి కాలుదువ్వడమే..
   సమర్ధులైన సేనానులు సహకరిస్తుంటే రాజ్యాన్ని ఒక్కతాటి మీద నడపగలుగుతోంది.
   "మహారాణీ వారికి నమస్సులు.." పరిచారిక వినయంగా వచ్చి నిలిచింది.
    రాణీ రుద్రమ దేవి కనుబొమ్మలు ముడిచి చూసింది.
   "మహారాణీ వారి దర్శనార్ధం మంత్రి శివదేవులవారు విచ్చేశారమ్మా."

   శివదేవయ్య ఉచితాసనం అలంకరించి, మందస్మిత వదనంతో మహారాణీని చూశారు.
   తిక్కన సోమయాజిచే ఈశ్వరుని అవతారంగా చెప్పబడిన గురుదేవుడు.
   "వసుమతీ నాధః యీతడీశ్వరుడె గాని
    మనుజ మాత్రుండు గాడు పల్మారు నితని
    యను మతంబున నీవు రాజ్యము నెమ్మి ఏలుమని" తిక్కన, గణపతి దేవునికి చెప్పిన వాడు. మహా జ్ఞాని.. మహా మంత్రి.
   రుద్రమ దేవి ఎదురేగి అభివాదం చేసింది.
   "అమ్మా! ప్రతాప రుద్రదేవ మహారాజునకు ఉపనయనం జరిగి రెండు వత్సరములైనది కదా.. ఉభయభాషల యందు కొంత ప్రవేశం వచ్చింది. ఇంక ధనుర్విద్య, కత్తి యుద్ధం, మొదలైన యుద్ధ విద్యలు నేర్పాలి. కొంచెం పొడవు పెరిగినాక గజ, తురగాదుల ఆరోహణం నేర్పించాలి. మీ అనుమతి తీసుకుని ప్రారంభించవలెనని ఆగాను. ఇంత కాలం మీరు దేవగిరి రాజుతో.."
   "అవును స్వామీ! యుద్ధం.. యుద్ధం.. యుద్ధం. ఎంతటి జన నష్టం. ఎందుకు ఇదంతా.."
   శివదేవయ్య చిరునవ్వు నవ్వారు.
   "అంతటి భీకర సమరం తరువాత ఈ నిర్వేదం సహజమే తల్లీ! మూడు లక్షల పదాతులు, లక్ష గుర్రంబులు నేల కూలిన పిదప ఈ విచారం సముచితమే! యుద్ధమున గెలిచి కోటి ద్రవ్యములు సుంకము కింద కానుక తీసుకొన్ననూ.. జయ స్థంభముల పాతించిననూ సరే.."
   తను గెలిచి, విప్రులకు దాన ధర్మములు చేయుట, సామంత రాజులకు చీని చీనాంబరములు, మణిమయ భూషణములను ఒసగుట.. విజయ భేరీలు మోగించుట.. మొదలగు విజయోత్సవములను సందర్భోచితంగా గుర్తు చేశారు శివదేవయ్య.
   "ఏమిటో ఆచార్యా.. అది అయిపోయిందిలే అనుకోవడానికి లేదు కదా! నెల్లూరు సీమ పాండ్యుల వశమయింది. వల్లూరు సామంతులు, కాయస్త జన్నిగదేవుడు, త్రిపురారిదేవుడు మనకి అనుకూలంగా ఉన్నారనుకుంటే.. ఇప్పుడు సింహాసనం ఎక్కిన వారి సోదరుడు అంబదేవుడు ఎదురుతిరుగుతున్నాడు. కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఈ నర మేధానికి ఎక్కడా అంతం లేదా స్వామీ?" ఆవేదనగా అంది రుద్రమదేవి.
   "ఇటువంటి అర్జున విషాద యోగం ప్రతీ సామ్రాజ్య పరి రక్షణలోనూ సామాన్యమే తల్లీ! తప్పదు. ప్రజా క్షేమం కోరే ఏ ఏలిక అయినా ప్రతీ క్షణం అప్రమత్తం అయుండాలి. ఆ పైన వారసుడ్ని తయారు చెయ్యాలి. కాకతీయ యుగం మరి కొన్ని దశాబ్దాలు మార్తాండ తేజో విరాజితమై వెలగాలి."
   "సరే స్వామీ! మీ అభీష్టం ప్రకారమే కానియ్యండి. ప్రతాపునకు సకలవిద్యలూ అభ్యసింపజేయాలి. నేను.. అంబదేవుని పై యుద్ధానికి సన్నిద్ధం కావాలి."
   ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు. ముమ్మడమ్మ కుమారుడు.
    రుద్రమదేవి వానిని దత్తత తీసుకొని, వారసుడిగా చేసికొన్నది.
    కాయస్త ప్రధాని అంబదేవుడు బలవంతుడు. తన రాజ్యాన్ని విస్తరింజేయాలని.. ఎవరికీ సామంతునిగా ఉండనని ప్రతిన పట్టినవాడు. సింహాసనం ఎక్కినప్పట్నుంచీ కాకతీయ సామ్రాజ్ఞికి కప్పం కట్టడం మానేశాడు.
   పాండ్య రాజులతోటీ, సోన యాదవులతోటీ స్నేహం కలిపి, వారి సైనిక బలం సహాయంతో స్వతంత్రం ప్రకటించుకున్నాడు అంబదేవుడు.
   చుట్టుపక్కలనున్న డెబ్భై రెండు మంది నాయకులతో పోరాడి గెలిచాడు. నెల్లూరు, ఎరువనాడు, పెండేకల్లు మొదలైన రాజుల్ని ఓడించి కాయస్త రాజ్యంలో కలిపేసుకున్నాడు. చివరికి పాండ్యులని కూడా తరిమి కొట్టాడు. ఆంధ్ర దేశంలో పాండ్యుల సార్వభౌమత్వం అంతరించిపోయింది.
   దక్షిణ భారతంలో అంబదేవుని బలమైన కాయస్త స్వతంత్ర రాజ్య విస్తరణ, కాకతీయ సామ్రాజ్యానికి పెద్ద సమస్యగా మారింది. మహారాణి రుద్రమదేవి, అంబదేవుని సార్వభౌమ ధిక్కారత్వాన్నీ, నిరంకుశత్వాన్నీ సహించ లేక పోయింది. మల్లికార్జున సేనానితో కలిసి అంబదేవుని పై పోరు సలపడానికి బయలుదేరింది.
   యుద్ధానికి బయలుదేరే ముందే.. పదునారు సంవత్సరాలు నిండిన ప్రతాపరుద్రునికి వివాహం జరిపించింది.. అదీ.. విశాలాక్షి మొదలుగాగల పదహారు మంది కన్నెలతో. 

              

   జరుగబోయేది ఎరుకే నన్నట్లు ఓరుగల్లు ప్రజలంతా మహారాణీగారికి పుర వీధుల్లో నిలబడి, వీడ్కోలు చెప్పారు. కవచ శిరస్త్రాణాలతో కత్తి, డాలు చేపట్టి అశ్వాన్ని ముందుకురికించింది వీర నారి రుద్రమ దేవి.
   అప్పటికే రాజ్యవిస్తరణతో సైనిక బలం పెంపొదించుకున్న అంబయ్య, పాండ్యుల, యాదవ సైనల సహకారంతో భీకరపోరు సలిపాడు. లక్షలమంది పదాతి దళాలు, అశ్వ దళాలు, వేల సంఖ్యలో గజబలం నాశనమయ్యాయి.
   ఆ భీకర సంగ్రామంలోనే కాకతీయ సామ్రాజ్య మహారాజ్ఞి రుద్రమ దేవి వీరమరణం పొందింది.
   ఓరుగల్లు నగరం, పాకనాడు, పలనాడు, వేంగి.. యావత్ కాకతీయ సామ్రాజ్యం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
   రుద్రమ దేవి ప్రజలను కన్నబిడ్డలవలే పాలించింది. వారి క్షేమం కోసం నిరంతరం యుద్ధరంగంలోనే ఉండేది. అయినా.. సమర్ధులైన మంత్రులతో, సేనానులతో.. రాజ్య పాలనకి ఎటువంటి లోటూ రానియ్యలేదు. వ్యవసాయం, వ్యాపారం, శిల్పకళ, సాహిత్యం.. నాట్య సంగీతాలు అభివృద్ధి చెందాయి.
   ఎన్ని చేస్తేనేం.. విధికి ఎదురీదలేదు కదా!
   ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్టించాడు. సార్వభౌమునిగా బాధ్యతలు స్వీకరించాడు.. ఎదుట నెరవేర్చవలసిన కార్యములు, చెయ్యవలసిన యుద్ధములు అనంతములు. అది సింహాసనము కాదు.. పగతో సెగలు కక్కుతున్న వేయితలల సర్పము.

     అద్దంకి సీమ కూడా అల్లల్లాడిపోయింది.
   రాజ్య క్షేమం కోసం వీర మరణం పొందిన మహారాణి రుద్రమదేవిని తలుచుకోని వారు లేరు... విలపించని వారు లేరు. మహారాణీ తన సువిశాల సామ్రాజ్యంలో, ప్రతినిధుల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. ముఖ్యంగా చెరువులు, పంట కాలువలు తవ్వించి దేశాన్ని సస్య శ్యామలం చేశారు. సామాన్యులు ఎంతో హాయిగా జీవనం గడుపుతున్నారు.
   అద్దంకి నాయంకరులు కూడా ప్రతాపరుద్ర దేవ మహరాజుకి తమ విధేయతని ప్రకటించారు.
   ప్రతాపరుద్రుని కీర్తి అప్పటికే నలుదిశలా మారు మ్రోగుతోంది.
   చక్రవర్తి గుణ సంపదను, శివదేవయ్యగారు పుట్టిన వెంటనే తెలియ జేశారు.
   "ఈ బాలుడు సర్వ లక్షణ సంపన్నుడు. విక్రమార్కుడు, దాన కర్ణుడు. ఇతడు ఇంద్ర సన్నిభుడు కానీ మానవ మాత్రుడు కాడు. ఇతను పుట్టినపుడే సింహాసన మెక్కగలడు." శివదేవయ్యగారు సాక్షాత్తు పరమశివుని అవతారమని ప్రతీతి. ఆయన అన్నటులే ఆ పసివాడిని ఊయల యందు నుంచి సింహాసనమెక్కించింది మహారాణి రుద్రమ దేవి.
    అయిననూ.. ప్రతాప రుద్రదేవుడు సింహాసన మధిష్టించిన పిదప కొంత అరాచకము తప్పలేదు.
   కొందరు దుండగులు శివాలయములో పూజలు జరుపుకుంటున్న మునులను బెదిరించి వారు సేవించుచున్న పరశువేది శివలింగమును ఎత్తుకుపోయారు. మహారాజు వారిని సంహరించి శివలింగమును తిరిగి మునులకి చేర్చాడు.
   ఇంకొక రేయి.. దుష్టులు, ఒక విప్రుని ఇంట దూరి, సొమ్ములు అపహరించి, యజమానిని పొడిచి పోయారు. అదృష్టవశాత్తూ ఆ బ్రాహ్మణుడు బ్రతికి బైట పడి రాజునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకోకుండా బయట పడేశాడు.
   ఇటువంటి దుష్ట చర్యలను నివారించుటకు, డెబ్బది ఏడుగురు పద్మనాయకులను పిలిపించి వారికి నాయకత్వం ఇచ్చాడు. వారి బంధువులకు ఉపనాయకత్వం.. రాజ్యములో కొంత భాగం విప్రులకు, కొంత బంధువులకు వితరణ చేశాడు.
   కోటి సువర్ణములు దానం చేసి జనరంజకంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు ప్రతాపరుద్రుడు.
   రాజ్యంలో ప్రజలందరు ధర్మవర్తనులై, సిరి సంపదలతో ఆనందిస్తున్నారు.
   ఇంక మిగిలింది సామ్రాజ్య విస్తరణ.. కోల్పోయిన రాజ్య భాగాలను తిరిగి పొందే ప్రయత్నం..
   అన్నింటి కంటే ప్రధానమైన కర్తవ్యం.. మహారాణీ రుద్రమదేవిని చంపిన అంబయని మట్టుపెట్టడం.
   అందులకే సంసిద్ధుడవుతున్నాడు మహా్రాజు ప్రతాపరుద్ర దేవుడు.
   యుద్ధ భేరీలు మ్రోగుతూనే ఉన్నాయి. రాజ్యంలోని ప్రతీ గ్రామం నుంచీ యువకులను సైన్యంలోనికి చే్ర్చుకుంటూనే ఉన్నారు.. వారికి శిక్షణ ఇస్తూనే ఉన్నారు.
   కాకతీయ సామ్రాజ్యం ప్రశాంతంగా ఉన్నట్లుగానే ఉంది. నివురు గప్పిన నిప్పులాగ!

……… ( ఇంకా వుంది) ………..


 (చిత్రాలు- మాలా పర్చా గారి సౌజన్యంతో)
.... మంథా భానుమతి