Facebook Twitter
అక్క మహాదేవి


 

 

ఈ కాలం లో రచయిత్రులని పరిచయం చెయ్యటం కోసం మొదటగా కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళి రచయిత్రిని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, కాల మాన పరిస్తితుల ప్రభావాలు ఆడవారు రచయిత్రులుగా ఎదగడానికి ఎలా దోహద పడ్డాయి ఎలా అడ్డుపడ్డాయి, ఎలా వారి రచనలను ప్రభావితం చేసాయి, వారి అలోచనా సరళి ఎలా మార్పు చెందుతూ వచ్చింది, ఎటువంటి క్లిష్ట పరిస్తితులని ఎదుర్కొంటూ వాళ్ళు వారి రచనలు కొనసాగించి చరిత్రలో వారి పేజీలు రాసుకొన్నారో తెలుసు కోవటానికి మాత్రమే. అక్క మహా దేవి విషయంలో మాత్రం ఈ విషయాల్ని తెలుసుకుని తీరవలసిందే.  


అక్క మహాదేవి (1130-1160)

అక్క అన్నది మనం తెలుగులో మాత అన్నట్లు, కన్నడిగులు ప్రేమగా పిలుచుకొన్న తీరు. ఆమె అసలు పేరు మహా దేవి, అపురూప సౌందర్యవతి, అద్భుతమైన కేశ సౌందర్యం. ఈమె గురించి తెలుసుకునే ముందు, ఈమె పెరుగుతున్నపుడున్న దేశ కాల పరిస్తితులను గురించి, ఆ సమయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను గురించి తెలుసుకుందాము. ఎందుకంటే, అప్పటి పరిస్తితులు ఆమెనెంత ప్రభావితం చేసాయో, ఆమె కూడా వాటిని అంతే ప్రభావితం చేసింది కనక.

బసవేస్వర (1134-1196) ఒక గొప్ప వేదాంతి, సంఘ సంస్కర్త. పరమ శివుడు ఒక్కడే సర్వ సృష్టి స్తితి లయ కారకుడైన, నిరాకారుడైన దేముడిగా గుర్తించే శైవ (లింగాయతిస్మ్) మతంగానే ప్రచారం చేసినవాడు. లింగ ధారణ వీరికి ముఖ్యం. లింగాన్ని ధరించి శివ పూజలు చేసే వారే శరణులు. వీరు రాసినవే వచనాలు. ఈ వచనాలకి చందస్సు, వ్యాకరణం ఏమీ అక్కర్లేదు, కేవలం భావ ప్రాధాన్యమైన ఫ్రీ వర్స్. అయితే ఈ లింగాయతిజం హిందూయిజం లోని సనాతన ధర్మాలకి వ్యతిరేకంగా, వేదాలను పూర్తిగా అంగీకరించకుండా, అలాగే వర్ణ విభజన, కుల వ్యవస్థ, లింగ వివక్ష లేకుండా, అంటరానితనాన్ని కూడా వ్యతిరేకిస్తూ, మూఢ నమ్మకాలు లేని, సమానావకాశాలు గల ప్రజాస్వామ్య వ్యవస్థని, అందరికీ విద్యనీ, స్త్రీ స్వేఛ్చనీ ముఖ్య ప్రాతిపదికలుగా పెద్ద సంఖ్యలో ప్రజలందరినీ ఆకర్షించింది. బసవని మొట్ట మొదటి భారత దేశ ప్రజాస్వామ్య వాదిగా చెప్పొచ్చట. ఈయన ప్రతిపాదించిన ప్రజాస్వామ్యం పనిచేసేది అనుభవ మంటప, మన ప్రస్తుత పార్లమెంట్ లాగే ఉంటుందట. కొన్ని గుళ్ళలో వీటి చిత్రాలను కూడ చెక్కారట. బుడ్ధుడిలాగా బసవ కూడా ప్రజలకు సమస్యలను అహింసాయుతంగా పరిష్కరించుకుని సామరస్యంతో, ఆనందంగా ఎలా గడపాలో చెప్పేవాడట. ఈయన శ్రీకారం చుట్టినదే కన్నడ భాషలో వచన సాహిత్య విప్లవం.

అక్క మహాదేవి శివమొగ్గ జిల్లా కర్ణాటక లో సుమతి, నిర్మలసెట్టి దంపతులకు పుట్టింది. తల్లితండ్రులు శివభక్తులు. ఈమె, తన తోటి పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే, తను చెన్నమల్లికార్జునుడి బొమ్మతో ఆడుకునేదట. నిర్బంధిత వాతావరణంలో, ఆడపిల్లకి ఉండే ఇంటి బాధ్యతలు ఆమెకున్న శివ భక్తికి అడ్డుగా తోచాయి. ఇంట్లో చేసే సంప్రదాయ శివార్చనలు ఆమెకు తృప్తి నివ్వలేదు. ముక్తి, మోక్ష మార్గాల్లో పయనించడానికి ఆడవారి మీదున్న ఆంక్షలు ఆమెకు నచ్చలేదు. మొండితనంతో ఆ రోజుల్లో ఆమె గురుకులంలో గురువు దగ్గర విద్యనభ్యసించింది. ఇది ఆమె సాధించిన మొదటి గొప్ప విజయం ఆ రోజుల్లో ఆడవారున్న పరిస్తితుల దృష్ట్యా.

చిన్నతనంలోనే జరిగిన వివాహం, రాజయిన భర్తనీ, రాజ సౌధమయిన భర్త గృహాన్నీ, ఇతర భోగాలు వదిలి, సన్యాసిని గా మారాలన్న తన చిన్ననాటి కోరికతో ఇల్లువదిలింది. సాధారణంగా అయితే కట్టు బట్టలతో ఇల్లు వదిలారంటాము కదా. ఈమె కట్టు బట్టలు కూడా లేకుండా, ఆ రోజుల్లో, ఇల్లు వదిలింది. దీని వల్ల ఆమె తరవాతి రోజుల్లో చాలానే కష్టాలు ఎదుర్కొంది కానీ తన పంతం విడువలేదు. అతి పొడవైన ఆమె శిరోజాలే ఆమె శరీరాన్ని కప్పి ఉంచేవట. ఈమెను సన్యాసినిగా ఒప్పుకోవడం, చెన్న బసవనికి, అల్లమప్రభు అనే శైవ సన్యాసులకు మరి పెద్ద అభ్యంతరమే. వారికి ఈమె సమాధానాలు చెప్పిన తీరు, ఒప్పుకోక తప్పని పరిస్తితిని కల్పించడమే కాకుండా, ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తాయంటే, అది కూడా, మగ సన్యాసులనుండి అంటే, ఆమె స్థాయి ఏంటో మనం ఊహించుకోవచ్చు.

ఒక స్త్రీ తన జీవితాన్ని భక్తి మార్గంలో జీవించదల్చుకుంటే అందుకామెకు సర్వ హక్కులూ ఉన్నాయని, ఆపడం ఎవరి తరమూ కాదని ఆమె నిరూపించింది. తన మనసున నిండి ఉన్న దైవం తప్పించి, ఎటువంటి సంసారిక బంధమూ లేకుండా ఈ ప్రపంచంలో బతకటం ఒక స్త్రీకి సాధ్యమన్న విషయం నిరూపించడానికి ఆమె చాలానే కష్టాలకోర్చింది. తన చిన్ని ముప్పై ఏళ్ళ జీవితాన్ని పణంగా పెట్టింది. ఆమె స్థిరపడిన కల్యాన్ (ఇప్పటి బీదరు) ప్రజలు తమను తాము పెళ్ళికూతురి తరపు బంధువులుగా అభివర్ణించుకుని ఆమెను శ్రీశైలం చెన్నమల్లికార్జున స్వామి వద్దకి సాగనంపారని ప్రతీతి. ఈమె, ఈమె తోటి సన్యాసులు, మిస్టిక్స్ రాసిన వచనాలను భద్రపరచాల్సిన అవసరం గుర్తించిన బసవ, వచనాల చివరి పంక్తిలో రాసిన వారి పేరు వచ్చేట్టుగా చేసారట. ఇంగ్లీష్ లోకి అనువదించిన ఈమె రాసిన కొన్ని వచనాలను చూద్దాం.

(1)

For hunger, there is the village rice in the begging bowl,
For thirst, there are tanks and streams and wells
For sleep temple ruins do well
For the company of the soul I have you, Chenna Mallikarjuna


ఆకలికి, ఊరివారు ధర్మం చేసేందుకొక బిక్షా పాత్ర ఉంది
దాహానికి, గుంటలూ, సెలఏళ్ళూ, బావులూ ఉన్నాయి
విశ్రాంతికి, ఆలయ శిధిలాలే చాలు
నా ఆత్మ సంగతికి, నాకు నీవున్నావు చెన్న మల్లికార్జునా!


(2)

“I am without pride of caste
Without pride of resolute will am I.
I have cast away the arrogance of riches,
Of the pride of learning also I have none.
No manners of pride dare some near me,
For Thou hast blest me with Thy Grace.”


నాకు కుల గర్వము లేదు
నాకు పొగరు లేని ధృఢనిశ్చయముంది
నేను ధనహంకారాన్ని విడిచివేసాను
విద్య వల్ల వచ్చే గీర్వాణమూ నాకు లేదు
మిటారపు ఛాయలు కూడా నా వద్దకు రావు
ఎందువలనంటే, నీ కరుణతో నన్ను దీవించావు


(3)

The bounteous will not brim over, you see.
The trusting will not doubt, you see.
The loving will not waver, you see.
The well-understood is not forgotten, you see.
Chennamallikaarjunayya
The sharana whom you accept
has boundless bliss, ayya.

నిండు కుండ ఎన్నడూ తొణకనట్లు
నమ్మినవారికెప్పుడూ అనుమానం కలగనట్లు
ప్రేమించినవరెప్పుడూ తొట్రు పడనట్లు
సంపూర్ణమైన జ్ఞానమెప్పుడూ మరువబడనట్లు
చెన్న మల్లికార్జునయ్యా
నీవు గైకొన్న శరణుల కెన్నడూ
అవధిలేని ఆత్మానందమే కదయ్యా!(4)

Without union, there is no fire.
Without union, there is no sprouting.
Without union, there is no flower.
Without union, there is no bliss.
Chennamallikaarjunayya,
in union with those greats who have your spiritual experience
I became supremely happy.

కూడక, అగ్ని పుట్టనట్టు
కూడక, విత్తు మొలకెత్తనట్టు
కూడక, పూవు పుష్పించనట్టు
కూడక, తన్మయత్వము లేనట్టు
చెన్న మల్లికార్జునయ్యా,
కూడి, ఆధ్యాత్మికానుభవ జ్ఞానులతో
నేనమితానంది నైతిని.


(5)

Maya has haunted the body as shadow
Maya has haunted the life-breath as mind
Maya has haunted the mind as memory
Maya has haunted the memory as awareness
Maya has haunted awareness as forgetting
Maya has haunted the milling crowds of this world
with a beating stick.
No one can overcome the Maya you have set
O Chennamallikaarjuna.


మాయ వెంటాడుతుంది శరీరాన్ని ఒక ఛాయలా
మాయ వెంటాడుతుంది ఊపిరిని ఒక మనసులా
మాయ వెంటాడుతుంది మనసుని ఒక స్మృతిలా
మాయ వెంటాడుతుంది స్మృతిని ఒక స్పృహలా
మాయ వెంటాడుతుంది స్పృహని ఒక మరపులా
మాయ వెంటాడుతుంది ఈ ఆడేటి జనాన్ని శిక్షించే ఒక బెత్తంలా
ఓ చెన్నమల్లికార్జునా!How can you be modest?
People, male and female,
blush when a cloth covering their shame
comes loose
When the lord of lives
lives drowned without a face
in the world, how can you be modest?

When all the world is the eye of the lord,
onlooking everywhere, what can you
cover and conceal?


ఈ వచనంలో అక్కమ్మ అంటుంది, ఒంటిమీద గుడ్డ కొద్దిగా జరిగినప్పుడు మగా, ఆడా లేకుండా సిగ్గు పడతారే, ఎవరి నుంచి కాపాడుకుంటారు మీ మానాన్ని, ప్రపంచంలో మునిగి ఉండి, తనకంటూ ఒక ముఖం లేకుండా, అసలు ప్రపంచమంతా తన కన్నుగా అంతటా చూసే ఆ ప్రభువు దగ్గర దేన్ని కప్పగలరు? ఏమి దాచగలరు? అని. చిన్నతనం నుంచి ఆమె కున్న ఈ పిచ్చి భక్తిని, భక్తిగా కన్నా, పిచ్చి గానే వర్ణించిన కధనాలూ ఉన్నాయి కానీ, ఆమె వచనాలు చదివినపుడు మాత్రం అటువంటి భావన కలగదు.

ముప్పై ఏళ్ళ వయసులో పరమ శివుడిలో ఐక్యమైన ఈమెకు అంత చిన్న వయసులోనే ఎంత వేదాంతం ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం అని నాకే కాదు తప్పకుండా మీకందరికీ అనిపించి ఉండచ్చని అనుకుంటున్నాను. ఆమె అప్పటి ప్రజల జీవనాన్ని ఎంత ప్రభావితం చెయ్యక పోతే ఆమె ఇంత కాలం ప్రజల మనసుల్లో ఉండి పోతుంది. ఎంతో ఉన్నతమైన ఆశయాలతో మొదలైన లింగాయతిసం వల్ల ఆమె, ఆమె వల్ల లింగాయతిసం బలపడ్డాయనడం అతిశయోక్తి కాదు. ఇన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళిన ఫలితం దక్కిందని నాకనిపించింది.

 


- శారద శివపురపు