Facebook Twitter
హరిశ్చంద్రుడు

 

హరిశ్చంద్రుడు

- శారద

 

శారదగా అందరికి పరిచయమైన కథా రచయిత అసలు పేరు ఎస్. నటరాజన్. పుట్టుకతో తమిళుడు. కాని బతుకు తెరువుకోసం తెనాలి వచ్చాడు. ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కొని తెలుగు చదువుకున్నాడు, నేర్చుకున్నాడు. తన అనుభవాల ద్వారా అద్భుతమైన కథలు, నవలలు రాశాడు. వీరి రచనలు పలు పోటీలలో బహుమతులు కూడా పొందాయి. అనారోగ్యం, దారిద్ర్యం అయినా లెక్కచేయని సాహిత్య రచన ఆయన గొప్పతనానికి నిదర్శనం. అందుకే నేమో జీవితాన్ని అర్ధాంతరంగా 31వ ఏటనే ముగించి తన రచనలను మనకు మిగిల్చి వెళ్ళిపోయాడు శారదగా పరిచయమైన నటరాజన్. మంచీచెడు, ఏది సత్యం, అపస్వరాలు వంటి నవలలు, వందకు పైగా కథలు వీరి సాహితీ సంపద. వీటిలో హరిశ్చంద్రుడు కథ బతుకులోతుల్ని, పేదరికంలోని ఘాటను రియాల్టీగా మనకు చూపుతుంది.
     సినిమాకు వెళ్లాలని హాలు దగ్గరకు వచ్చిన నాగభూషణం ఆ విషయాన్ని మర్చిపోయి స్త్రీల గేటు వైపు చూస్తూ నిలబడిపోతాడు. తెల్లటి లాల్చీలో చంద్రుడిలా మెరిసిపోతూ ఉంటాడు. సినిమా ప్రారంభం అవుతుంది. నాగభూషణం చూపు బుగ్గమీద గాలికి ఊగే ఉంగరాలు జుట్టు పడుతున్న అమ్మాయిపై పడుతుంది. చామనఛాయలో అందంగా కనిపిస్తుంది. ఆమె చూపును, చిరునవ్వుతో పలకరిస్తాడు. ఇద్దరి చూపులు కలుస్తాయి. కన్నుగీటుతాడు. ఆమె సిగ్గు నటిస్తుంది. ఇద్దరూ సినిమాహాలు నుంచి బయటకు వస్తూ మట్లాడుకుంటారు. నాగభూషణం "సినిమాకు వెళ్లాలంటే టిక్కటు ఇప్పిస్తాను" అంటాడు. అందుకు ఆమె "నా భర్త పక్కన ఉన్న ఆసుపత్రికి మందుకోసం వచ్చాడు, తను వస్తానంటే సినిమాకు వచ్చాను. తను రాలేదు. నేను ఇంటికి వెళ్తున్నాను" అని బదులు చెప్తుంది. "మా ఇల్లు కూడా అటే..." అని చెప్పి నాగభూషణం ఆమెతో పాటు నడక సాగిస్తాడు. వారి మాటల్లో డిసెంబర్ నెల చలి, చంద్రుడు కురిపిస్తున్న మత్తు కనిపిస్తుంది.
        కొంతదూరం వెళ్లాక నాగభూషణం ఓ పూరిగుడిసె ముందు ఆగి "మా ఇంట్లోకి వచ్చిపోండి" అని ఆహ్వానిస్తాడు. ఆమె కూడా వెళ్తుంది. లోపల చిరిచాప, కొన్ని పత్రికలు, ల్యాంప్ మాత్రమే ఉంటాయి. ఆమె "ఇదా మీఇల్లు" అని అడిగితే... "ఆ పక్కనున్న బిల్డింగ్ కూడా మాదె" అని చెప్తాడు. చలి వస్తుందని తడికె వేస్తాడు నాగభూషణం. ఆమె చాపమీద పడుకొని శరీరాన్ని మత్తుగా విరుస్తుంది. నాగభూషణం జేబులోంచి బీడి తీసి వెలిగించి, వెలుగుతున్న ల్యాంపును ఆపేస్తాడు. ఆమె భయపడినట్లు నటిస్తే- "ఫర్వాలేదు, వెన్నెల పడుతుందిగా" అని తడికె సందుల్లోంచి పడుతున్న తెల్లటి చారికలను చూపిస్తాడు. ఆమె తన పేరు "చంద్రమతి" అని చెప్తుంది. పడుకున్న తీరును బట్టి ఆమె వయసును లెక్కకట్టడం నాగభూషణం వల్ల కాదు. కానీ ఆ వెన్నెల వెలుగులో తమకంగా ఆమె మీదకు వరిగుతాడు. ఆమె మాత్రం మెల్లిగా అతని జేబును వెతుకుతుంది. బీడీలు తగులుతాయి. ఇంకేమీ ఉండవు... అంతే.. "ఛీ .. దూరంగా జరుగు" అని పడుకున్న చంద్రమతి అతని పట్టును విడిపించుకొని పైకి లేస్తుంది. 
      నాగభూషణం "ఎందుకు నా జేబు వెతికావు" అంటే... "నీకు తెలీదా.. డబ్బులకోసం" అని చెప్తుంది. ఆ మాట విని నాగభూషణం పెద్దగా నవ్వుతాడు. చంద్రమతి అమాయకంగా "ఎందుకు నవ్వుతున్నావ" ని అడుగుతుంది. "డబ్బులకోసం ఆరు రోజుల నుంచి తిరిగి తిరిగి, అందరిని అడిగి.. విసిగి ఉన్నాను. నువ్వు డబ్బులు అంటే నవ్వు వచ్చింది" అని ఉద్వేగంతో, హృదయాంతరాళంలోంచి చెప్పాడు. "అంటే ఈ తెల్లని బట్టలు, ఉంగరం అంతా... నువ్వూ నా కన్నా దరిద్రుడివి అన్నమాట.. బిల్డింగ్ నీదే అన్నావు..." అని అడుగుతుంది. "నువ్వు సంసార స్త్రీవి అన్నావు" కదా అని అడుగుతాడు నాగభూషణం. ఇద్దరి మధ్య వాదన జరిగుతుంది. దొందూదొందే అని తేల్చుకుంటారు. "నేను జమిందారు అని నువ్వు అనుకున్నావు. నువ్వు సంసారస్త్రీ అని నేను అనుకున్నాను.." అని నిర్ణయానికి వస్తారు. తడిక తీసుకొని చంద్రమతి బయటకు వెళ్తూ "నీ పేరంటి" అని నాగభూషణాన్ని అడుగుతుంది. "హరిశ్చంద్రుడు" అని చెప్తాడు. "మళ్లీ అబద్ధమా.. నీ బతుకు చెడ" అని శాపం పెడుతూ వెళ్తుంది ఆమె. "నీ పేరు చంద్రమతి అయితే, నా పేరు హరిచంద్రుడు" అని నాగభూషణం నవ్వుకుంటాడు.
          చీకట్లో ఆమె ఎటో పోతే, నాగభూషణం మరో బజారుకు వెళ్తాడు... దాంతో కథ ముగుస్తుంది.
         కథను హృద్యంగా చెప్పడం శారదకే తెలుసు అని చెప్పడానికి ఈ కథ అక్షరాలా నిదర్శనం. ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా పాఠకుడి మనసు పక్కకు మల్లదు. కేవలం ఒక్క సన్నివేశాన్ని కథగా మలచిన తీరు అద్భుతం. ఒకరు పేదరికాన్ని బరించే వ్యక్తి, మరొకరు ఆ పేదరికాన్ని బరించలేక శరీరాన్ని అమ్ముకునే స్త్రీ. పైగా కథ ప్రారంభం నుంచి వారివారి అవసరాలకోసం ఇద్దరి మధ్య నడుస్తున్న మాటల తీరులో నటన. ఒకరి గురించి ఒకరు నిజమని నమ్మేలా నటన. నమ్మించడానికి నట. అవసరాలకోసం నటన. నిజ జీవితాలను నగ్నంగా చిత్రించారు రచయిత. మనిషి మనసుల్ని, వాటి లోతుల్ని పురిచుట్టి మెలిబెట్టే చిన్న సంఘటనను, మనిషి దారిద్ర్యాన్ని అద్భుతంగా చెప్పారు. ఇలాంటి కథను రచించడం కత్తిమీద సాము. కానీ శారదగారు ఎక్కడా పాఠకునికి ఇబ్బంది కలగకుండా అరటిపండు వలిచి ఇచ్చినట్లు చెప్పారు. ఇదే కథలోని శిల్పం రహస్యం. దీనిని పట్టుకొని చెప్పడం కష్టసాధ్యమే.
      ఇలాంటి కథలను ఆరుద్ర చెప్పినట్లు ఎవరికి వారే చదివాలి. బాధపడాలి. ఆ బాధలోంచి కోలుకొని తేరుకోవాలి. తేరుకొని నిజాన్ని దర్శించాలి. ఆ నిజంలోంచి జీవితాలను మార్చుకోవాలి. సమాజ మార్పుకోసం ఏదైనా చెయ్యాలి. అప్పుడే ఇలాంటి కథలకు న్యాయం చేకురుతుంది.

- డా. ఎ.రవీంద్రబాబు