Facebook Twitter
మళ్ళీ పసి పాపనై - శారదా అశోకవర్ధన్

మళ్ళీ పసి పాపనై


- శారదా అశోకవర్ధన్

 

నా పాదం మోపగానే ఈనేల

నన్ను గుండెలకి హత్తుకుంది అమృతంలా

ఆప్యాయతని పంచుతూ!

స్వాగతం పలికింది ఎన్నో సంవత్సరాల తరువాత

పుట్టింది కొస్తూన్న ఆడపడుచును

ఆర్ర్ధంగా ఆదరించినట్టు!

ఈ గాలి నా బుగ్గలను ముద్దెట్టుకుంటూ

పిల్లన గ్రోవి పలికించే కొత్తరాగాల్లా

పల్లవులు పాడింది

పరవశింపజేస్తూ!

ఈ ఉదయం నా హృదయం ఉప్పొంగిపోయింది

సుప్రభాత గీతాల్లాంటి నా వాళ్

పలుకుల తియ్యదనంతో

అమృత వర్షిణి రాగం ఆలాపనలా

అనిపించింది ఆనందంతో

మృదంగ విన్యాస దరువుల్లా

బరువుగా సాగాయి నా అడుగులు!

హరిహరాదులు తాండవ కేళీసభలోని

సంగీత సమ్మేళనంలా మురిపించి

మైమరిపించాయి నా వాళ్ళు నా పై కురిపించిన అక్షరాల జల్లులు

అమ్మ చెప్పిన మాటలు

ఆకాశవాణి వార్తల్లా గుర్తొచ్చాయి.

అక్కడ మొలిచిన గడ్డిపోచ సయితం

సంగీతం సాహిత్య రసఝరిలో స్నానమాడి

పచ్చగా పలుకరిస్తుందని

దివి నుండి దిగొచ్చిన వాగ్దేవి

ముద్దుగా గురజాడను ఒళ్లో కూర్చోబెట్టుకుని

పసిడి పలకమీద వెండి అక్షరాలతో

'పుత్తడి పూర్ణమ్మ' గేయ ప్రతిష్ట చేసి

'కన్యాశుల్కానికి' అన్యప్రాంతాల వారందరూ మెచ్చేలా

కీర్తి కిరీటాన్ని సొంపుగా తగిలించి

శోభాయమానంగా వర్దిల్లజేసింది

చా.సో. చేత చిక్కని భావాల

చక్కని కథలు రాయించింది

కృష్ణశాస్ర్తిని బుజ్జగించి కమ్మని

కవితలల్లించింది

హరికథలు గిరికథలు

కళ్లకద్దినట్టు దర్శింపజేసింది

సరిగమల పూలదండలకు

సంపెంగ అత్తరులు పూసి

ఘంటసాల మెడలో వేయించింది

సప్తస్వరాన్ని తేనెలో రంగరించి

ప్రేమతో తాగించింది

మాటేపాటై నిలిపింది

కోకిలమ్మ గొంతుని సుశీల కమర్చింది

వసంతంలోనే కాదు

ప్రతినిత్యం వసంతంగా వెలిగిపలకాలని!

ద్వారం మునివేళ్లతో ముచ్చటగా

ఫిడేలు మీద ఆడుకుంది

అక్షరాల పల్లకీ చేయించి

ముత్యాల సరాలతో అలంకరించి

సాహితి సౌరభాల కంబళీపరచి

గజారోహణం గావించింది

తెలుగుజాతి ఔన్నత్యాన్ని

తరతరాలకూ పంచిపెట్టింది

అమ్మకెప్పుడూ ఇవే మాటలు

గతం జ్ఞాపకాల తీపిగుర్తులు

'అమ్మ పుట్టగానే నాచేతిని ముడ్డాదిందేమో

నాకలం కమ్మని కవితలు రాస్తోందన్నాడు' శ్రీశ్రీ

మా అమ్మకూడా నా చేతిని

తన గుండెలకి అదుముకుని

మురిసిపోయిందేమో

కవితాత్మ నాలోనూ తొంగిచూస్తోంది!

గజపతుల గవాక్షంలోంచి రాలిపడిన

వీణారవాల తీగెలు

నా గొంతులోనూ పూచాయేమో

నాకూ అంటింది కొంత మాధుర్యం

కోనేరు గట్టున అమ్మ ఆడుకున్న

చెమ్మ చెక్కల చప్పట్లనూ

కిలకిల రాగంతో గొంతు కలిపి

అమ్మ పాడుకున్న పాటలనూ

నీలిమేఘాలు రికార్డ్ చేసుంచాయేమో

ఆకాశం అంచునుంచి

నక్షత్రాలు జలతారు ముసుగులు తీసి

మెరుపుతెరల చాటునుంచి

నా చెవిలో వినిపిస్తున్నాయ్

నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ

గంట స్తంభం కాలాన్ని కాటుకగా చేసి

కళ్లల్లో దాచుకుందేమో

ఎప్పటికయినా నేనొచ్చినప్పుడు

ఆ కథలన్నీ నాకు వినిపించాలని

గుండెలో గుసగుసలు పెట్టింది

కలకండలా తియ్యగా

ఊహలకి ఊసిరిపోస్తూ!

నగరం ఆహ్వానించింది నన్ను

అభిమానాన్ని మల్లెలుగా కట్టి

అనురాగాన్ని మామిడి రసాల కడవలోముంచి

మమతను రంగవల్లికగా తీర్చి

బౌద్దారామాల భరణిల్లోని ధూళిని

నా నుదట సింధూరంలో అద్ది

నా సిరుల కురులు దువ్వి

ముచ్చట ముడిలో అమర్చింది

సంస్కారాన్ని నాగరంగా!

దాసన్న పేటలోని పెంకులు

ఎక్కడ దాక్కున్నాయో ఇన్నేళ్లూ

పురిటివాసనల మూటవిప్పినట్టున్నాయి

నేనెప్పుడొస్తే అప్పుడే సాంబ్రాణితో కలిపి

ధూపమై నిలవాలని!

నేను బోర్లా పడుతూ పారాడిన నేల

ఉంగా ఉంగాల కేరింతల బొబ్బట్లను

నాకు తినిపించాలని ఉర్వళ్ళూరుతూ

ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసింది

నా తల్లి పసుపుపారాణి పాదాలకు నమస్కరించి

ఆ చల్లని ఒడిలో

ఆ మమకారపు తడిలో

తడిసి ముద్దనై

ముగ్ధనైపోవాలని ఒచ్చాను!

నేను నడిచిన తప్పటడుగుల జాడలు

మచ్చుకైనా ఎక్కడైనా ఆగుపిస్తాయేమోనని

ఆశతో ఒచ్చాను

నాన్నగారూ మామగారూ కలిసి

'ఆఆ' లు దిద్దుకున్న ఆవరణ

మున్సిపల్ హైస్కూలు ప్రాంగణం

నన్ను పలకరిస్తుందని

వారి మాటలు నిశ్శబ్దతరంగాలై

నా ఎదలో మోగితే

వినాలని ఒచ్చాను -

అమ్మమ్మ పాడిన జోలపాటల్లోని పగడాలను

పదిలంగా ఏరుకోవాలని వచ్చాను

మళ్ళి పసిపాపనై

బంగారు బాల్యపు తూగుటుయ్యాలలో

ఒక్కసారి ఊగిపోవాలని వచ్చాను.

ఈ బహుధాన్య ఉగాది వేళ

నా వాళ్ళందరితో సంతోషంగా

సంబరాలు జరుపుకోవాలని వచ్చాను.