అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు. యునెస్కో ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా 17 నవంబర్ 1999న తొలిసారి ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ కూడా ప్రకటనను ధ్రువీకరించింది. అమ్మను ఎంత ప్రేమిస్తామో.. అమ్మ భాషనూ అందరూ అంతగా ప్రేమించాలి. అమ్మను మరచిపోవడం ఎంత తప్పో అమ్మ భాషను మరచిపోవడం కూడా అంతే తప్పు. తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు.. మరే భాష అయినా కావచ్చు.. ప్రపంచాన్ని శాసిస్తున్న ఇంగ్లీషు భాష మోజులో పడి మాతృభాషకు దూరం కావడం అనేది పెద్ద పొరపాటు. ఇంగ్లీషును నేర్చుకోవాలి.. కానీ అదే సమయంలో మన మాతృభాష మీద కూడా మనకు పట్టు వుండాలి. ఇంగ్లీషు మాత్రమే బాగా వచ్చిన వారికంటే, మాతృభాష మీద పట్టు వుండి ఇంగ్లీషును చదువుకున్నవారే విద్యార్థులుగా ఎక్కువ రాణిస్తున్నారన్న సత్యం గ్రహించాలి. ప్రపంచంలో భాషలన్నిటినీ రక్షించుకోవాలనీ, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో అనేకసార్లు స్పష్టంగా చెప్పింది. ’‘మనం మన వ్యక్తిగతంగా ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో స్కూల్లో తోటి విద్యార్థులతో మాట్లాడతామో, ఆ భాష మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. ప్రతి భాషా సమానమే. ప్రతి భాషా మానవ ప్రతిస్పందనల విశిష్టతలను కలిగి ఉంటుంది. ప్రతి భాషకు సంబంధించిన సజీవ వారసత్వాన్ని మనం అనుభవించాలి’’ అని యునెస్కో డైరెక్టర్ జనరల్ తన సందేశంలో చెప్పారు.



