
వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో సాహితీ పోషకులకు చోటు లేదా! తెలుగు చరిత్రలో ఒక పేజీ సాహితీ పోషకులకు కేటాయించలేరా! కష్టపడి సంపాదించిన ధనాన్నీ సమయాన్నీ సాహిత్యం కోసం, సాహితీ కార్యక్రమాల కోసం ఖర్చుపెట్టే సాహితీ పోషకులు, కళా పోషకులకు విలువ లేదా? అంటే లేదనే చెప్పాలి! ప్రోలయ వేమారెడ్డి, మనుమసిద్ధి వంటి ప్రభువులు లేకుంటే కవిత్రయం ఆంధ్ర సాహిత్యానికి తెలిసేవారా? సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు లేకుంటే అష్టదిగ్గజాలు తెలుగు ప్రజలకు లభించేవారా? ఇంతటి ఘన చరిత్రను పెట్టుకుని కూడా సాహితీ పోషకులను ఎందుకు గుర్తించడం లేదు?
“సాహితీ ప్రియులు, సాహితీ పోషకులు లేకుంటే ప్రతి రోజూ ఇన్ని సాహితీ కార్యక్రమాలు జరిగేవా? కవులు తాము రాసిన అక్షరాలకు శాశ్వతత్వం కల్పించడానికి సాహితీ ప్రియుల అండనే కోరతారు. అలాగే రచయితలు రాసిన కావ్యాలకు పురస్కారాలనే గుర్తింపు సైతం కొంతమంది పెట్టిన దయా భిక్షే, నాలుగు ముక్కలు రాసిన రచయితలు సైతం తమను ఎవరో గుర్తించాలనీ, సన్మానాలు చేయాలని ఆశపడుతారు. వారికున్న ఇలాంటి ఆశల్ని తీర్చడానికి సాహితీ సంస్థలు ఏదో ఒక్క కార్యక్రమాన్ని డిజైన్ చేస్తాయి. ఈ కార్యక్రమం సజావుగా సాగాలంటే దానికి ధన సహాయం చేసే దాత కావాలి. దాతల దగ్గర తెచ్చిన సొమ్ముతోనే వ్యాఖ్యాతల అందమైన మాటలు గానీ రచయితల భావాత్మక అక్షరాల కూర్పులు గానీ శాశ్వతత్వాన్ని పొందుతాయి. ఆయా దాతలకు దయా స్వభావమే లేకుంటే రచయితల భావాలు మనసులోనే ఉండిపోతాయి. వ్యాఖ్యాతల వాగ్బాణాలు గొంతులోనే ఉండిపోతాయి.
సాహిత్యమంటే విపరీతమైన అభిమానం, దయ ఉండే దాతల వలనే వెయ్యేళ్ళ క్రిందటి సాహిత్యాన్ని ఈ రోజు కూడా చదువుకోగలుగుతున్నాం. ఏ సాహితీ, సభలోనైనా వారి గురించి మాట్లాడుతున్నారా? వేలు, లక్షలు ధారపోసి కొంతమంది తమ ఆస్తుల్నే తగలేసి సాహిత్యం కోసం రేయింబవళ్ళ కష్టపడి కాపాడుతుంటే ఒక్కరైనా వారి గురించి తలుస్తున్నారా?.
రెండు వాక్యాల్ని రాసినా కవిగా ముద్ర వేస్తున్నారు. పది కవితలు రాయగానే సన్మానాలు చేస్తున్నారు. సన్మానాలు, పురస్కారాలకు కవులు అమితానందం పొందడమే గానీ, తమకు ఇంత గౌరవాన్నీ, గుర్తింపునూ తెచ్చిన దాతల్ని ఎప్పుడైనా తలచుకున్నారా? రచయితల మొహంలో వెలుగు చూడటం కోసం దాతలు తమ ధనాన్ని ధారపోస్తుంటే అదేదో వాళ్ళ దగ్గర మిగిలిపోయిన బ్లాక్ మనీ అనుకుని ఉదాసీనంగా ఉంటారు. బ్లాక్ మనీ ఉండే గొప్ప వాళ్ళు పార్టీలు, ఫంక్షన్లు చేసుకుంటారు గానీ సాహితీ కార్యక్రమాలు, కళార్చనలూ చేయరు. కళలు, సాహిత్యం పట్ల విపరీతమైన ఇష్టం. అభిమానం ఉన్నవారే ఈ కార్యక్రమాలకు నడుంకడతారు. ఒకవేళ వారికి డబ్బు ఎక్కువైతే ఈ సాహితి కార్యక్రమాలు మాత్రమే చేయాలా? బయట అనాథలు, వికలాంగులు, వృద్ధులు ఎంతో మంది తినడానికి తిండి లేకుండా ఉన్నారు. వారందరికీ సహయం చేసి సంతోష పడేవారు కదా!
అదీ కాకుండా కవుల, రచయితల రచనల్ని వెలుగులోకి తెచ్చే మహానుభావులు మన తోటి సమానంగా ఉండే మామూలు వ్యక్తులే. ధనంలో పుట్టి పెరిగిన ధనవంతులు కాదు. సాహిత్యాన్ని జీర్ణించుకున్న మధ్య తరగతి జీవులే. వారి కళాదృష్టికీ సాహితీ ప్రియత్వానికి కనీసం ఒక్క మంచి మాట నోచుకోదా!.
కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సబ్జెక్టు పరంగా విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్స్ సైతం ఎవరో వ్యక్తులు ఇచ్చే ధన సహాయాలే. అక్కడ నామమాత్రంగా పేరు చెప్పి వదిలేస్తారు. బహుమతి గ్రహీతలు కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ హజరవుతారు. బహుమతి గ్రహీతలకు ముందు వరసలో సీట్లు కేటాయిస్తారు. అదే బహుమతి ప్రదాతల్ని కనీసం గుర్తు కూడా పట్టరు. సభాస్థతి మీదకు ఆహ్వానం కూడా ఉండదు ప్రభుత్వ సంస్థలలోనే ఇలా జరుగుతూంటే ప్రైవేటు సంస్థల్లో జరిగే వాటికి చెప్పేదేం ఉన్నది.
ప్రైవేటు సంస్థల్లో కార్య నిర్వహణ జరిగే దాకా, ధన సహాయం పొందేదాకా కనిపించిన వ్యక్తులు ఆ తరువాత పొరపాటున కూడా కనిపించరు. కనీసం సభకు ఆహ్వానం కూడా అందదు. ఒక వేళ ఆహ్వానం అందినా కూడా సభకు వెళ్ళకూడదు. ఎందుకంటే? అక్కడ అవమానం పాలయ్యే కంటే వెళ్ళకుండా ఉండటమే మంచిది. మనమిచ్చిన విరాళాలతోనే వేదిక మీద దర్జాగా తిరిగే కార్య 'నిర్వాహకులకు దాతలు' పొరపాటున కూడా గుర్తుకు రారు. కాదు కాదు గుర్తుకు తెచ్చుకోరు. నిర్వాహకులు ప్రకటించిన బహుమతులు స్వీకరించే మేధావులు కూడా నిర్వాహకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళను మెప్పించటానికే ప్రయత్నిస్తుంటారు. నిర్వాహకులు ఎక్కడి నుంచైనా, ఎవరి వద్ద నుంచైనా విరాళాలు తెచ్చి కార్యక్రమాలు చేసి తమ లాంటి కవులకు సన్మానాలు చేస్తారని ఆశ. పేరు నిర్వాహకులకు, సన్మానాలు రచయితలకు, అవమానాలు దాతలకు.
తమ అక్షరాలకు పుస్తక రూపం కల్పించుకునే సమయంలో కవులకు సాహితి పోషకులు కావాలి. తమ అభిరుచి మేరకు సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించి సుమాజంలో పేరు తెచ్చుకునేందుకు నిర్వాహకులకు సాహితీ పోషకులు కావాలి. కానీ సాహితీ పోషకులకు తిరిగి ఏమి ఇవ్వరా? వారి వద్ద నుండి తీసుకోవటమే గానీ తిరిగి కనీసం కృతజ్ఞతలైనా మనస్పూర్తిగా చెప్పరా? వారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వరా?
ఏదైనా పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటిస్తే గనుక ఆ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన దాతక్కూడా ఆ గౌరవం దక్కాలి. విశ్వ విద్యాలయాలు, సాహిత్య అకాడమీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సాహితీ పోషకులకు సముచిత గౌరవాన్ని ఇచ్చేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ పోషకులను, దాతలను గుర్తించాలని, ఈ విషయమై ఆలోచించాలని కోరుకుటున్నారు.



