Facebook Twitter
'భారతవర్ష'తో ప్ర‌పంచ రికార్డ్ సాధించిన పూల‌బాల‌


ఒక్క‌టంటే ఒక్క‌ట ఇంగ్లిష్ మాట లేకుండా, రెండు ల‌క్ష‌ల తెలుగు ప‌దాల‌తో 'భార‌త‌వ‌ర్ష' అనే అతి పెద్ద గ్రంథాన్ని అతి త‌క్కువ కాలంలో ర‌చించి ప్ర‌పంచ రికార్డు సృష్టించారు విజ‌య‌వాడ‌కు చెందిన సాహితీవేత్త పూల‌బాల వెంక‌ట ప్ర‌సాద్‌. ఆయ‌న బ‌హుభాషా కోవిదులు కూడా. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లిష్ లాంటి విదేశీ భాష‌ల‌ను చక్కగా మాట్లాడడమే కాక ర‌చ‌న‌లు కూడా చేశారు. నోత్ర ఏకోల్ అండ్ అవర్ స్కూల్ అనే ద్విభాషా నవల వ్రాసి, ఫ్రెంచ్ నవల రాసిన తొలి తెలుగు రచయితగా గుర్తింపు పొందారు.

పూలబాల అతితక్కువ సమయంలో అతిపెద్ద నవల రాసిన రచయితగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పేరు. వెయ్యి పేజీలు మించిన నవల రాయడానికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రచయితలు సంవత్సరాలు త‌ర‌బ‌డి స‌మ‌యం తీసుకోగా 1265 పేజీల 200 వృత్త పద్యాలతో కూడిన 'భార‌త‌వ‌ర్ష' అనే గ్రాంథిక‌ నవల రాయడానికి పూలబాల తీసుకున్న సమయం 8 నెలలు మాత్ర‌మే. ట్రాన్స్ లిటిరేషన్ టూల్  ఉపయోగించి గూగుల్ లో టైపు చేసుకుని మైక్రోసాఫ్ట్ వర్డ్ పై  రెండు లక్షల పదాలను వందల సార్లు సవరించి, అమర్చి ఈ నవలను తానే సొంతంగా ప్ర‌చురించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఆయ‌న ప్ర‌తిభ‌ను గుర్తించిన వ‌ర‌ల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భార‌త‌వ‌ర్ష గ్రంథానికి అతి త‌క్కువ కాలంలో రాసిన‌ అతి పెద్ద గ్రంథంగా వ‌ర‌ల్డ్ రికార్డ్‌ గుర్తింపునిస్తూ స‌ర్టిఫికెట్‌ను, మెడ‌ల్‌ను జారీ చేసింది. 2020 జూలై 9న ప్రారంభించి, 2021 మార్చి 9 నాటికి 1265 పేజీల‌తో 'భార‌త‌వ‌ర్ష' గ్రంథాన్ని ఆయ‌న పూర్తి చేశార‌ని ఆ స‌ర్టిఫికెట్‌లో తెలిపారు.