Facebook Twitter
సిగ్గుపడుతుంటాను

 

సిగ్గుపడుతుంటాను

 


 
లక్షలాది పసిమొగ్గలు దించిన తల ఎత్తుకోలేక
ఖాళీ వాటర్‌ ప్యాకెట్లకోసం తాగి విసిరేసిన బాటిళ్ళకోసం
నేలబారు పురుగుల్లా రోడ్డంతా పాకుతుంటే
తలెగరేసి రెపరెపలాడే జెండాకేసి చూస్తుంటాను!
పట్టపగలు నడిరోడ్లో విరిసీ విరియని పూలని
ప్రేమ పేరుతో పెళ్ళిపేరుతో కసాయి కత్తులు
రక్తస్నానం చేయించి రాజుల్లా వెళ్లిపోతుంటే
పేరేడ్‌గ్రౌండ్‌లో పోలీసు కవాతును వీక్షిస్తుంటాను!
ఎన్నికల పేరుతో ఎన్నెన్నో కలలు చూపి
ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులై కామస్వాములై
ప్రజల చెమటచుక్కల్ని దోచుకుంటుంటే
పత్రికలనిండా పేరుకున్న వార్తల్ని చదువుతుంటాను!
బందులు సమ్మెలు ధిక్కరణలు దిష్టిబొమ్మలతో
హక్కులకోసం గుప్పెడు నీళ్ళకోసం గూళ్ళకోసం
రాష్ట్రాలకు రాష్ట్రాలు రావణకాష్టమై రగులుతుంటే
ఇంతకింతలు చేసి చూపే మీడియాను తిలకిస్తుంటాను!
దుక్కిదున్ని చదునుచేసి నారుపోసి, నీరు పోసి
రాత్రింబవళ్ళు కాపలా కాసి కోత కోసిన పంటని
గుడ్డిగవ్వలకమ్మలేక కుప్పముందు రైతన్న కూలిపోతుంటే
రాజ్యాంగాన్ని తెరచి చదవలేక సిగ్గుపడుతుంటాను!

- గుర్రాల రమణయ్య
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో