Facebook Twitter
ఆత్మబంధువు

 

 

ఆత్మబంధువు

 

 


చేతికర్రేకదా అని చేవలేదనుకోకు
నిలువనీడనిచ్చి ఆసరానిస్తుంది
నిలువెల్లా.. రాగాలు, అనురాగాలు పలికిస్తుంది
చట్టం చేతిలాఠీకర్ర అన్యాయాన్ని ఎదిరిస్తే...
బాపూజీ చేతికర్ర తెల్లవారిని తరిమింది.
అంధులకు కరదీపికై నడిపిస్తుంది
వికలాంగులకు చైతన్యహస్తం
మలిసంధ్యలో తన వారు దూరమైనవేళ
ఆత్మబంధువై స్పర్శిస్తుంది..
కష్టజీవికి వెన్నుదన్నుగా నిలిచి
కలిమిలేములు మోసే కావడి అవుతుంది
కృష్ణుని చేతి వేణువై బృందావనిలో రాగాలు పలికిస్తే...
రాముని చేతిధనువు కదనంలో శత్రుమూకను మట్టుపెట్టింది...
అపరాత్రి ఆయుధమవుతుంది
పూలతీగకు చల్లని పందిరివేస్తుంది
దేవక్రతుకు సమిధై, యాగఫలం అందిస్తుంది...
జాతీయ జెండాను మోసే వీరజవానవుతుంది
ఇంతితై వటవృక్షమై వన్యప్రాణులను సేద తీరుస్తుంది
సాయుధపోరాటంలో వీరునిచేతి కాగడాయై
దేవుని ముందు దివిటియై శాంతిగీతమాలపిస్తుంది
ఈకట్టెకు.. ఆ కట్టెకు విడదీయని బంధమై
అంత్యకాలంలో మోక్షమిస్తుంది
జీవంలేనికర్ర మనిషి జీవితానికి తోడునీడైతే
జీవమున్న మనం... నీడనిచ్చే పచ్చదనాన్ని
నాశనం చేయకుండా, ప్రకృతిని రక్షిద్దాం...



- ములుగు లక్ష్మీమైథిలి
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో