మీలో ప్రతిబింబిస్తా
మీలో ప్రతిబింబిస్తా

విరిగితే అతుకుపడకున్నా
హృదయంలేని ఎన్నో మనసులకన్నా నేనే మిన్న!
స్వచ్ఛతకు, సౌకుమార్యానికి నాదే అగ్రతాంబూలం
రూపలావణ్యానికి నకలునునేను
ఉన్నదున్నట్లు చూపడమే నాకు తెలుసు
పలకరించే ప్రతివాళ్ళూ నావాళ్ళే
కుడిఎడమల తేడాలే తెలియని నాకు
మసిపూయడాలు, మారేడు చేయడాలు అసలే తెలియదు
నేరమూలాన్ని పరావర్తనంతో వెలికితీస్తూ
చట్టాన్ని జీవింపజేసే
న్యాయమూర్తి గుండెగుడిలో కొలువుతీరిన నేను
ధర్మదేవతకు నిలువటద్దాన్ని!
ప్రేమ మందిరంలో వెలసిన నేను
నిత్యమైన, సత్యమైన అనురాగానికి దర్పణాన్ని!
తలకట్టుతో రూపురేఖల్ని తీర్చిదిద్దుకున్నట్లే
తలపుల సవరింపులతో మనిషి మనీషిగా మారాలనే నేను
మీ సౌందర్య నిలయాలలోని సొగసుటద్దాన్ని!
మౌనంగా పలకరించే మీ నేస్తాన్ని
మీ నవ్వుతో శ్రుతికలిపే స్నేహహస్తాన్ని
మిమ్ముల పీడించే కులమత భేదాలు
మిమ్ముల వేధించే వర్ణవర్గ భాషాప్రాంత వైషమ్యాలు
నన్నేమీ చేయలేవు
ఇవేవీ అంటని నాతో చేయి కలిపి
మీరూ స్వేచ్ఛా జీవనాన్ని ఆరంభించండి!
ఆ నవశకనానికి ఈరోజే తొలిరోజు కావాలని
కలలుకంటున్నా
నా ప్రతిబింబాన్ని మీలో చూచుకొని
మురిసిపోవాలని ఆరాటపడుతున్నా!
- మాచవోలు శ్రీధరరావు
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో



