ప్రశ్నించిన ప్రతిబింబం
ప్రశ్నించిన ప్రతిబింబం

వెలుతురునన్ను తాకినప్పుడల్లా
నేను రెండుగా మారుతాను
ఒకటినేను మరొకటి నా ప్రతిబింబం
నా ప్రతిబింబమంటే
నాకు భలే సరదా
ఎంతసేపు చూసినా తనవితీరని నా ప్రతిబింబం
ఇట్టే కట్టిపడేయాలనుకున్న సమయాన
నా బాల్యం నాముందు నాట్యమాడుతుంది
తెలియని ఆనందనపు ఊహాలోకాల్లో
విహరించినంత ఉత్సాహం
స్వర్గమును నా గుప్పిట పట్టుకున్నట్టుగా
కొండంత గర్వం
ఇలా నా అడుగులను
నడకతో జతకట్టే ప్రతీక్షణం
నా నీడను చూసి
నేను నివ్వెరపోతుంటే
నన్ను చూసి ఒకవెర్రి నవ్వు విసిరేసి
ఓసారి నన్నిలా ప్రశ్నించింది నాప్రతిబింబం
ఓ సహచరీ..
నన్నుచూసి ఆశ్చర్య సముద్రంలో మునిగిపోతే
ముందుగతి తెలుసుకోవడం నీతరం కాదు
అందుకే... సాగిపో...
అవధులులేని తీరాలకు
అనంతసన్మార్గ దూరాలకు
గతాన్ని తవ్వుతూపోతే
మిగిలేది క్షణికానందమే
ఇదుగో... నేనుకూడా
నీచరణాలకు మోకరిల్లుతున్నాను
నన్ను చూస్తూ కాలయాపనకు తావివ్వొద్దు
నీ పురోగమన పాదప్రయోగమే
నాకు పరమానందం అనగానే
నన్ను నేను
స్పర్శను కోల్పోయినంతపనయ్యింది ఆ క్షణమే
వెనుదిరిగిన నా చూపును
క్రమస్థితిలో వుంచి
నా చరణాలను
త్యాగధనులు నడిచిన
పోరుదారుల అడుగు జాడలవైపు మళ్ళించి
నామేధను
అలుపెరుగని లక్ష్యసాధనవైపు ఎక్కుపెట్టి
సాగిపోతున్నాను
- సుప్పని సత్యనారాయణ
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో



