ప్రేముంది చూశారూ...ప్రేమా...ఆ ప్రేమ...

ప్రేమ పూస్తూ ఉంది. ప్రపంచం ప్రేమ కోసం పరితపిస్తోంది. కన్నీటి కొలనులో చేపై ఈదుతూ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాయి కళ్ళు. మగాడిని ఇంకా మనిషిగా ఉంచడంలోనూ, అప్పుడప్పుడు అయోమయంలో పడేయడంలోను ఆమెకు చేతైనట్టు ఇంకెవరికి చేతనవును? ఆమె వల్ల ఏదైనా సాధ్యమని ఎక్కువగా నమ్మేది ఆ మగాడే. ఆమె ఏది చేసినా ఆ మనసుని కోరుకుంటూనే ఉంది శతాబ్దాలుగా మగ మనసు.... అందుకే ప్రేమలో "ఆది" శివుడిని అధిగమించి నిల్చోడానికి సాహసిస్తున్నారు "ఇప్పటి అర్ధనారీశ్వరులు" దేవుడు ఉన్నట్టు, లేనట్టు చెప్పాలా వద్దా అని తడబడుతున్న పెదవులు రెండూ ఎందుకొచ్చిన గొడవని మౌనంగా ఉండాలన్నా ఉండలేకపోవడం నిజం....ప్రేమ పర్వంలో మాత్రం... మనసులోని మాటను చెప్పడానికి ముందువెనుకలు ఆలోచించినా చూపులతోనైనా వెల్లడిస్తాడు అతను... అందుకే ప్రేమ పర్వంలో తనను మునిగిపోనివ్వడానికి సైతం మగ మనసు అన్ని విధాలా సిద్ధమైపోతుంది. అందుకే అంటోంది ఆ మనసు...ఒకవేళ రాసే మనసు మరచినా జీవితంలోని ఆని ఆశ్చర్యాలలోను ఆమె ఉండాలని చూపులు గుర్తు చేస్తూనే ఉంటాయి.... ప్రపంచ సాహిత్యాలన్నీ పీల్చి పిప్పిచేసిన మగ మనసు కిందా మీదా పడిప్రేమను టన్నుల కొద్దీ రాసేస్తోంది. మౌనాన్ని వీడి ఆమె చెప్పిన అనేక మాటల్ని సేకరించి దాచుకుంటున్న ఆ మగ మనసు అనుకుంది ఒకరోజు ఇలా...
"ఎక్కడో మొదలై ఎక్కడెక్కడో ప్రయాణించినా కోరిక ముగిసే చోటు తెలుసు....
ఎన్ని రకాలుగా కష్టపడినా యెట్లా బాధను అనుభవించినా ప్రేమ శ్రీకారం చుట్టే చోటు ఎవరికీ తెలియదు.
అందుకే ఆమెకు తెలియకుండా నేనూ, నాకు తెలియకుండా ఆమె ...ఇద్దరూ ఏదో క్షణాన ప్రేమలో పడిపోతే ఎంత బాగుంటుందని ..?
- యామిజాల జగదీశ్



