ఏదో చెప్పాలనిపించి
ఏదో చెప్పాలనిపించి

ఒక్కో రోజు
ఒక ప్రశ్నా పత్రాన్ని
మన చేతికి ఇస్తుంటాడు
సృష్టికర్త
దానిలో గట్టెక్కడం
మన నడకలో, నడతలో ఉంది
వెతికి
చూసుకున్న తర్వాతే
తెలిసింది
నా చిరునామాలో
నేను లేనన్న నిజం
ప్రేమను
నన్ను పెంచిపోషించే
ఓ ఎరువనుకున్నాను
కానీ
అదే
నా ప్రత్యర్ధి అయ్యింది
ఇది కవిత కాదు
రాస్తున్న
నా పెన్ను ద్వారా
కారుతున్న
నా కన్నీరని
ఎవరికి తెలిసినా
తెలియకున్నా
నీకు తెలిస్తే చాలు
నా ఒక్కో
కన్నీటి చుక్కా
తాజ్ మహలే
ఈ భూమ్మీద పడ్డాం
రా
మన వాటా కన్నీటిని
ఆఖరి బొట్టు వరకు
కార్చేద్దాం
అనాధగా
ఏడుస్తోంది
మన ఇద్దరికీ పుట్టిన
ప్రేమ
నా కవితలు
ఆరిన గాయాల
మచ్చలు
అనుభవమూ
ఒక ఆయుధమే
ఒకే సూర్యుడే
వేర్వేరు రోజుల్ని
మన ముందు ఉంచుతున్నాడు
- యామిజాల జగదీశ్



