Facebook Twitter
ముంగిస కథ

ముంగిస కథ

 


                              
                

- బలివాడ కాంతారావు


  

            తెలుగు కథా రచయితల్లో తనదైన ముద్రతో కథలు రాసిన రచయిత బలివాడ కాంతారావు. పాత్ర చిత్రణలో, కథా శిల్పంలో సొంతమార్గాన్ని అనుకరించి సుమారు మూడు వందలకు పైగా కథలు రాశాడు బలివాడ కాంతారావు. వీరి కథలు మధ్యతరగతి వాళ్ల జీవితాల్లోని కష్టాలు, అనుబంధాలు, అపోహలు, చీకటి రహస్యాలు, వైవిధ్యాల చుట్టూ తిరుగుతాయి. అయితే కాంతారావు మనసుల్లోని సున్నితమైన భావాల్ని, సుకుమారమైన ఆలోచనల్ని విశేషంగా చెప్పిన రచయిత. వీరి కథల్లో ముంగిస కథ ఇలాంటిదే.
         ఈ కథ, మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఇదే బలివాడ కాంతారావు గొప్పతనం. ఈ కథ వంశధార నది ఒడ్డున ఉన్న మడపాం గ్రామంలో జరిగినట్లు చెప్తారు రచయిత. వంశధార నది ఒడ్డున అమ్మాయామ్మ, అప్పారావు అనే భర్యాభర్తలు జీవిస్తూ ఉంటారు. అప్పారావు డాక్టరు. వారికి ఒక కూతురు కొడుకు. కొడుకు మిలటరీ ఆఫీసరు. కూతురు అత్తవారింట్లో ఎనిమిది మైళ్ల దూరంలో ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఏటి ఒడ్డున ఉన్న వారి ఇంట్లోకి చెట్లు, శవాలు, పాములు వచ్చేవి. అంతేకాదు అప్పారావు  వ్యవసాయం చేస్తూ భద్రంగా దాచుకున్న ధాన్యాలను ఎలుకలూ, పందికొక్కులూ తినేసేవి. బోను పెట్టినా, మందు పెట్టినా ఫలితం లేదు.
         ఒకరోజు డాక్టరు దగ్గర వైద్యం చేసుంచుకున్న ఎరకలవాడు అరణం కింద ముంగిస పిల్లని తెచ్చి ఇస్తాడు. పైగా ఇది మీరు దీన్ని పెంచిపెద్ద చేసుకుంటే ఎలుకలు, పందికొక్కులు, పాముల బాధ ఉండదని చెప్తాడు. దాన్ని పెంచుకోడానికి తగిన సూచనలు కూడా ఇస్తాడు. దాని కాలికి మువ్వలు కడ్తే ఆ శభ్దానికి ముంగిస జాతి దానిని దగ్గరకు రానివ్వదని చెప్పి వెళ్లి పోతాడు. ఆరోజు నుంచి అమ్మాయమ్మ, అప్పారావు దాన్ని ప్రేమగా పెంచుతారు. పంచదార వేసి, రొట్టెముక్కలు, ఇడ్లీలు పెట్టి సాకుతారు. దాని చుంచుమూతి, చివర లే తెలుపు, ఊదారంగు శరీరం, చీపురుకట్ట తోక, మువ్వల సవ్వడి చూసి అమ్మాయమ్మ బయ్యన్న అని పేరు కూడా పెడుతుంది. జంతువులా కాకుండా బిడ్డలా దాన్ని చూసుకుంటూ ఉంటారు.
           దాని దెబ్బకు ఎలుకలు, పందికొక్కుల జాడ కనపడదు. కానీ ఒకరోజు అప్పరావు అంటే గిట్టని ఎదురింటి భైరవయ్య వచ్చి మీ బయ్యన్న మా కోడి పిల్లలను చంపింది... అని గొడవ పెట్టుకుంటాడు. బయ్యన్న పీకలు కొరకడు అని అప్పారావు వాదిస్తాడు. గొడవ సద్దు మణిగినా భైరవయ్య మాత్రం ముంగిస బయ్యన్నను ఏదో ఒకటి చెయ్యాలని మనసులో పెట్టుకుంటాడు. ఒకరోజు అప్పారావు, అమ్మాయమ్మ కూతురు దగ్గరకు వెళ్తూ రొట్టె, పాలు బయ్యన్నకు ఆహారంగా పెట్టి, సాయంత్రం వస్తామని చెప్పి వెళ్లి పోతారు. బయ్యన్న కూడా వాళ్లని సాగనంపి వస్తుంది. అదే అదునుగా చూసుకున్న భైరవయ్య ఒడ్డున కలుగులో ఉన్న బయ్యన్నకు ఎండుచాపను ఆశచూపి, బైటకు పిలిచి కర్రతో కొట్టి చంపేస్తాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన అమ్మాయమ్మ ముంగిస బయ్యన్న కోసం చాలాచోట్ల వెతుకుతుంది. అప్పారావు కూడా కంగారుపడి అంతా గాలిస్తాడు. కానీ బయ్యన్న జాడ తెలియదు. ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న నమ్మకం పెట్టుకుంటుంది  అమాయకంగా అమ్మాయమ్మ.
        ఒకనాడు ఉదయం భైరవయ్య కోళ్లు చింతచెట్టు కింద తిరుగుతుంటే ఒక ముంగిస (బయ్యన్న కన్నా పెద్దది) వచ్చి ఒకదాన్ని పట్టుకొని పోతుంది. దాంతో భైరవయ్య మంచం పడతాడు. అమాయకమైన బయ్యన్నను చంపినందుకు, ఆ దృశ్యమే కళ్లముందు కదలాడుతుంటే చెరపలేక నడుం జార్చేసుకుంటాడు.
            ఇంత అద్భుతంగా కథ చెప్పడం, చదివిన పాఠకుడి మనసులో ఓ ఫీలింగ్ ను నింపడం బలివాడ కాంతారావు గొప్పతనం. ముంగిసపై ప్రేమ, ఆ దృశ్యాలు మన కళ్లముందు కదలాడుతాయి. కథాక్రమం వెంట మనల్ని పరుగులు పెట్టిస్తుంది. వర్ణనలు చేయడంలో కాంతారావు అందెవేసిన చెయ్యి... ఈ ఏటి ఒడ్డున వేసవిలో, నీలగిరిలా ఉంటుంది. చలికాలంలో చలి ఊళ్లో కంటే హెచ్చె. అంగట నిల్చొని  దక్షిణానికి పారే ఏరును చూస్తుంటే ఒళ్లు పులకరించే ప్రకృతి దృశ్యాలు అగుపిస్తాయి. దూరాన చరిత్ర ప్రసిద్ధికెక్కిన సాలిహుండా కొండ, ఎత్తయిన సరుగుడు చెట్లు, అరటి తోటలు, మబ్బులకు మనోహరమైన రంగులను ప్రసాదించే సూర్యాస్తమయం. ఫిబ్రవరి నెలలో చీకటి రాత్రి పడమటి ఆకాశంలో మెరిసిపోతున్న శుక్రగ్రహం పరుగు, మెల్లగా దిగువ జారుతున్న ఏటి గలగలల్లో చూస్తుంటే నాట్యానికి లయ కలిసినంత అందంగా ఉంటుంది.
           
వర్ణనలే కాదు- సన్నివేశాలు, సంఘటనలు కలిసి కథను రసవత్తరంగా నడిపారు బలివాడ కాంతారావు. ముంగిపు కొసమెరుపులో భైరవయ్య కోడిని ముంగిస పట్టుకెళ్లడం, భైరవయ్యను చేసిన పాపం వెంటాడటం... కథా శిల్పానికి గొప్ప ఉదాహరణలు. ప్రకృతికి, మనుషులకు, జంతువులకు మధ్య ఉండాల్సిన అవినాభావ సంబంధాన్ని తెలిపే ఈ కథ ఎప్పడు చదివినా మన మనస్సులో జాలి గుణాన్ని కల్పిస్తుంది.     

           
                              
                  
డా. ఎ.రవీంద్రబాబు