Facebook Twitter
త్రిసూత్రం - శారదా అశోకవర్ధన్

త్రిసూత్రం


- శారదా అశోకవర్ధన్

 

ఎన్ని బాధలు ఎన్ని గాధలు

తలుచుకుంటే గుండె గాయం

తలవకుంటే లేదు మార్గం

కాలచక్రం కదిపి చూస్తే

కలికి కధలను తరచి చూస్తే

కతలు ఎన్నో వెతలు ఎన్నో

కన్నీటి చారల పొరలు ఎన్నో!

పుట్టగానే ఆడపిల్లని

కన్నవారు ఉస్సురంటే

చూడవచ్చిన చుట్టపక్కాల్

జాలిచూసి ఊరడించి

హెచ్చవేతలు తీసివేతలు

లెక్కలన్నీ చేసి చూపి

గుండె మీది కుంపటంటూ

గుబులు పుట్టే కబుర్లు చెప్పి

హడాలగొట్టి వెళ్ళుతారు

ఆ రోజు మొదలు అన్నింటా

అబలవూ అరిటాకువంటూ

చదువు నీకు దండగంటూ

వంటపనికీ ఇంటి పనికీ

ఒంటెద్దులాగా తిరుగుపనికీ

అన్ని ఆమెకే అంటగట్టిరి

పనిచేసే యంత్రంలాగా

నోరులేని మూగలాగా

మొండిగా తయారు చేసిరి

పుట్టినింట్లో మెట్టినింట్లో

అన్నదమ్ములు మొగుడు మరుదులు

అయినవారు కానివారు

అందరూ బహుగొప్పవారే

ఆడదోక్కటే అలుసు ఎందుకో?

కన్యాశుల్కం మహాఘోరం

అది కాదట పెద్దల నేరం

మూడు ముళ్ళూ వేసినట్టి

మూడు కాళ్ళ ముసలివాడు

ఉన్న పాతునే ఊపిరొదిలితే

అది మాత్రం ఆమె ఖర్మం!

పాలు గారే పసిడి బుగ్గల

చిన్నారుల సింగారించి

పెళ్ళితంతూ జరిపించేసి

ఆయువు తీరి అతడు చస్తే

సమిధలల్లే పసిడి బొమ్మల

మంటవేసి తృప్తి చెందే

ఘోరమైన నీతి శాస్త్రం

ఆడపిల్లకే ఎందుకంట?

అడగలేదు ఆడవారు

కాలి నుసిగ మిగిలిపోయిరి

కాస్త కాస్త కళ్ళు తెరిచి

ప్పుడిప్పుడే మేల్కొనిరి

లోకరీతిని తెలుసుకొనిరి

మనిషిగా తలఎత్తుకొనిరి!

ఆమె చదవని చదువులేదు

చేయరాని ఉద్యోగం లేదు

సమానత్వం నిరూపిస్తే

సహించలేని పెద్ద మనుషులు

గుటకవేస్తూ గింజుకుంటూ

నోరు తెరిచి మిన్నకుంటిరి!

అయినా ఏదో ఆమెకి శాపం

వరకట్నం మరో ఘోరం

అన్నీ వుండీ ఆరడిపడుతూ

ఆత్మహత్యకూ ఘోరహత్యకూ

బలైపోతున్నారు మహిళలు

నడిబజారున పడుతున్నారు

తల్లి ఆమె చెల్లి ఆమె

ఇల్లు నడిపే ఇలవేల్పు ఆమె

ఆమె పైననే అత్యాచారమా?

ఆమె మీదనే అఘాయిత్యమా?

కలిసికట్టుగా ఇంతులందరు

కొద్దిసేపు కళ్ళు మూసుకు

సమస్యలను తిరగవేస్తే

అత్యాచారం అఘాయిత్యం

వీళ్ళు చేస్తే ఏమవుతుంది?

ఎదురుకట్నం సతీ సహగమనం

వీరు కోరితే ఏం జరుగుతుంది?

అందుకే యోచించి అందరు

సమానత్వం పెంచుకుంటూ

ఆడమగ తేడా లేక

ఒకే నీతి -ఒకే భీతి -ఒకే సూక్తిగా నడిచేలాగా

కొత్త చరిత్ర సృష్టించాలి

ఈ త్రిసూత్రం పాటించాలి