Facebook Twitter
దేవరకొండ బాలగంగాధర తిలక్

దేవరకొండ బాలగంగాధర తిలక్

- డా. ఎ. రవీంద్రబాబు

 

అతను ఆధునిక తెలుగు కవి, కథకుడు, నాటకకర్త. అమృతాన్ని తాగి, ఆ రుచిని తన కవిత్వం ద్వారా తెలుగు పాఠకులకు పంచిన ప్రభారవి. భావకవిత్వాన్ని, అభ్యుదయ పంథాను మానవీయతలో రంగరించి కవిత్వంగా అందించిన రసధుని. ఊహలకు, వాస్తవాలకు మధ్య తన కథలతో అంతుచిక్కని వారధి నిర్మించిన ప్రజాకవి.
         నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారవతాలు అని మానవీయను...,
         నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు అని అభ్యుదయాన్ని...,
          నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని భావుకతను..., తన కవిత్వ లక్షణాలుగా చెప్పుకున్నాడు బాలగంగాధర తిలక్.
          పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న మండపేటలో 1921 ఆగస్టు 1వ తేదీన జన్మించాడు తిలక్. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాలే కాదు, పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా చదువుకున్నాడు. అన్నీ అతనికి కరతలామలకమే. తెలుగులో వచనాన్ని, పద్యాన్ని అద్భుతంగా రాయగల ప్రతిభ ఆయనది. సుతి మెత్తనైన అభివ్యక్తితో పదునైన భావాన్ని వ్యక్తం చేయగల శైలి తిలక్ ది. కవిత్వం, కథ, నాటికలను సమర్థవంతంగా రాశాడు.
కవితా సంపుటాలు- ప్రభాతము సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి
కథా సంపుటాలు- సుందరి - సుబ్బారావు, ఊరిచివరి ఇల్లు, తిలక్ కథలు
నాటకాలు, నాటికలు- శుశీలపెళ్లి, సుప్తశిల, సాలెపురుగు, సుచిత్ర ప్రణయం. ఇవి కాక తిలక్ లేఖలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి.
           తిలక్ 11 ఏళ్లకే మొదటి కథ మాధురి రచించాడు. 16 సంవత్సరాలకు పద్యాలు, గేయాలతో తొలి కవితాసంపుటి ప్రభాతము - సంధ్యను వెలువరించాడు. వీరి రచనలపై ఎక్కువగా మొదట కృష్ణశాస్త్రి ప్రభావం, తర్వాత శ్రీశ్రీ ప్రభావం ఉన్నట్లు అర్థమవుతుంది.
తిలక్ కవిత్వం, కథల్లో- బిచ్చగాళ్లు, అనాధలు, అశాంతులు, దగాపడిన తమ్ముళ్లు, పడుపుగత్తెలు, చీకటి బజారు చక్రవర్తులు .... కనిపిస్తారు. మనుషుల్లోని కపటత్వాన్ని గురించి-
          దేవుడా
          రక్షించు నా దేశాన్ని
          పవిత్రుల నుండి, పతివ్రతల నుండి
          పెద్దమనషుల నుండి, పెద్ద పులుల నుండి
          నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే
          నిర్హేతుక కృపాసర్పాల నుండి
          లక్షలాది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి
అని వ్యంగ్యాన్ని వాచ్యంగా రాశాడు.
          తిలక్ కవిత్వంలో సుకుమారమైన హృదయ స్పందన ఉంది. మన హృదయాల్లో కూడా ఆయన తన వాక్యాలతో ఆ స్పందనను కలిగించగలడు. శబ్దశక్తి, ఆలంకారిక పుష్టి కలగలిపి రాయగల ద్రష్ట తిలక్.
           గగనమొక రేకు
           కన్నుగవ సోకు
           ఎరుపెరుపు చెక్కిళ్ల విరిసిన చెంగల్వ
           సంజె వన్నెల బాలరంగు పరికిణి చెంగు
           చీకటిని తాకినది అంచుగా
           చిరుచుక్క ప్రాకినది
అని సంద్యను అద్భుతంగా వర్ణించిన కవి తిలక్.
          ఆయన కవిత్వంలో మెటఫర్లు, ఆర్ద్రత, జౌచిత్యం ఉన్నాయి. అనుభూతికి మన గుండెల్లో ఆకారాన్ని కడతాయి. నిజానికి తిలక్ కవిత్వం ఏ ఇజానికి, ఏ భావానికి, ఏ వాదానికి లొంగదు. జీవితంలోని ఒక పార్శ్వాన్ని కాకుండా సమగ్ర స్వభావాన్ని దర్శిస్తుంది.
           చావుపుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం
           మంచిగంధంలా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక్క అలంకారం అంటూ కవికి, సగటు మనిషికు ఉండాల్సిన మానవత్వాన్ని చెప్పాడు తిలక్.
          కాలం సవాల్ లాంటిది
          సాహసవంతుడందుకొని ముందుకు సాగిపోతుంటాడు.
 
        తెరిచే కిటికీ బట్టి
          పరితపించే పుష్పరాగం వుంటుంది.
          మురికి కాల్వమీద, ముసలితనం మీద
          మృషా జగతిమీద, మహోదయం వికసించదు వసంతం హసించదు...
ఇలాంటి జీవిత సాఫల్యాన్ని, తత్వాన్ని తెలిపే వాక్యాలు తిలక్ కవిత్వంలో ఎన్నో దొరకుతాయి. వీరి తపాలా బంట్రోతు కవిత చాలాకాలం పాఠ్యపుస్తకాల్లో ఉన్నది. అతను ఉత్తరం ఇచ్చి వెళ్తున్నప్పుడు- సముద్రంలోకి వెళ్తున్న ఏకాకి నౌక చప్పుడు అన్న వాక్యం హృదయాలను ద్రవింపజేస్తుంది.
అందుకే తిలక్ కవిత్వం గురించి ప్రముఖ కవి కాలోజీ రాస్తూ- రచన కవిత పాదాల పారాణి, పాపిటబొట్టు, నుదుట తిలకం, రసికతకు రాణింపు, ధ్వనికి గుభాళింపు, ట్రాన్స్ పరెంట్ చీకటి, వానికి వాడే సాటి... అన్నాడు.
          తన కవిత్వంలో తాను దొరుకుతాను అన్న తిలక్ తన కథల్లో కూడా దొరుకుతాడు. వీరి గురించి దేవరకొండ బాలగంగాధర తిలక్ అనే పుస్తకం రాసిన ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీకాంతశర్మ కథల గుంరించి చెప్తూ- మానసిక విశ్లేషణ, తాత్వికత, విశ్వశాంతి, అభ్యుదయ భావాలు కనిపిస్తాయంటారు. వీరి కథల్లో నల్లజర్ల రోడ్డు, ఊరిచివరి ఇల్లు, అద్దంలో జిన్నా, కదలే నీడలు, దొంగ, సుందరీ-సుబ్బారావు, ఫలితకేశం, గడియారపు గుండెలు... లాంటివి ఎన్నో ఉత్తమ కథలు.
           నల్లజర్ల రోడ్డు కథ- ఇద్దరు స్వార్థపూరితమైన మనుషుల తీరును కళ్లకు కట్టినట్లు చెప్తుంది. చావునుంచి కాపాడిన వాళ్లు ఆపదలో ఉంటే పట్టించుకోని మనుషుల స్వార్థాన్ని తెలియజేస్తుంది. లిబియో యెడారిలో కథ చిన్నదైనా యుద్ధం తర్వాత చిందరవందరైన శరీరభాగాలు మాట్లుకున్నట్లు సాగుతుంది. నిజమైన ప్రేమను చావుకూడా చంపలేదేమో... అన్నట్లు సాగుతుంది. కదిలే నీడలు కథ కూడా యుద్ధం గురించే అయినా అందరికీ దూరంగా బిక్కుబిక్కు మంటూ ఉంటున్న వారి కథ ఇది. ఒకామెను భర్త వదిలేస్తే, మరో అతనికి పెళ్లిగాక ముందే భార్య మరణిస్తుంది. వారి మనసులు కలిస్తే... తోడైతే... అన్నదే ఈ కథలోని వస్తువు. అద్దంలో జిన్నా కథ శిల్పం దృష్ట్యా గొప్పది. జిన్నా భారతీయుల్ని రెండుగా చీల్చి, జాతిభేదం చేత చిచ్చురగిల్చాడు. ప్రతి మహ్మదీయుడు ఒక అద్దం లాంటివాడు. ఈ కథలో భయంకరమైన చారిత్రక సత్యాన్ని శిల్పంతో మలచాడు తిలక్. దీనిలో మొదట ఆత్మాశయం, అహంకారం, అజ్ఞానం... చివర ఆత్మావలోకం, పశ్చాత్తాపం, భాధ కనిపిస్తాయి. మనిషి మాటను సృష్టించాడు. మాట అతనిని బంధించింది. మనిషిలో ఉండే అహం, పతానికి, ఔన్నత్యానికి, పరిశ్రమకు, పరిణామానికి కారణభూతమైన మూలశక్తి. అని ఈ కథలో చెప్తాడు తిలక్.
        ఊరిచివరి ఇల్లు కథే ఇటీవల కమలతో నాప్రయాణం సినిమాగా వచ్చింది. కథలో రమ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న దుర్బరజీవి. గాలివాన కారణంగా మూర్తి ఆమెను కలుస్తాడు. మనసులు, శరీరాలు కలుస్తాయి. పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ రమ పోషిస్తువ్న అవ్వ రమ వేశ్య, ఆమెది నటన అని చెప్తుంది. మూర్తి ఆమె మాటలు నమ్మి రమకు పర్సు ఇచ్చేసి రైలుకు వెళ్లిపోతాడు. కానీ రమ మూర్తి కోసం రైల్వేస్టేషనుకు వెళ్తుంది. పర్సును విసిరేస్తుంది. మూర్తి ఫొటోను మాత్రం గుండెలకు హత్తుకొంటుంది. చివరకు మూర్తి రైల్లోంచి చూస్తుండగానే ప్లాటుఫారమ్ మీద రక్తం మడుగులో పడి చనిపోతుంది.          

         తిలక్ కథలు తేలిక భాషలో, హాయిగొలిపే విధంగా సాగుతాయి. మనుసును రొమాంటిక్ ఫీల్ కు తీసుకెళ్తాయి. ఊహకు వాస్తవానికి మధ్య భేధాన్ని చూపెడతాయి. మసుగులు తొడుక్కున్న అసలు మొహల్ని వెలికితీస్తాయి. పాత్రల స్వభావం, విశ్లేషణ, విడదీసి చూపే మంచి చెడు అభ్భుతంగా ఉంటుంది. సీతాపతి కథలో పద్మ, ఊరిచివరి ఇల్లు కథలో రమ, దొంగ కథలో ఇల్లాలు... లాంటి స్త్రీ పాత్రలు ఉన్నతంగా, మృదువుగా, మంచి స్వభావంతో ప్రవర్తిస్తాయి. కొన్ని కథల్లో స్త్రీలు వెర్రివెర్రి ఆలోచనలతో, చేష్టలతో కూడా కనిపిస్తారు.
        తిలక్ మంచి కథకుడుగా, కవిగా రాణిస్తున్న రోజుల్లోనే అనారోగ్యంతో జూలై 1, 1966లో మరణించాడు. తర్వాత వీరి కవితా సంపుటి 1968లో కుందిర్తి ఆంజనేయులు ముందుమాటతో అమృతం కురిసన రాత్రి ముద్రితమైంది. దీనికి 1971లో కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. తిలక్ మరణించినప్పుడు ప్రముఖ కవి ఆవంత్స సోమసుందర్ తిలక్ జ్ఞాపకాలు - వాడని జాజిపూలు అన్నాడు. శ్రీశ్రీ అమృతం కురిసిన రాత్రికి కవిత్వంగా ముందుమాట (ఎలిజీ)  రాస్తూ-
         గాలిమూగదయి పోయింది
         పాట బూడిదయింది
 
         వయస్సు సగం తీరక ముందే
         అంతరించిన ప్రజాకవి
         నభీస్సు సగం చేరక ముందే
         అస్తమించిన ప్రభారవి అని అక్షర నీరాజనాలు సమర్పించాడు.