Facebook Twitter
నెత్తురుకన్నా చిక్కనిది

నెత్తురుకన్నా చిక్కనిది

                                                                      - మునిపల్లె రాజు


        
సమకాలీన సమాజాన్ని తనదైన తాత్విక కోణంలో దర్శించి కథలుగా మలచిన కథకుడు మునిపల్లె రాజు. మనుషుల్లోని స్వార్థాన్ని, అసూయని, ధనకాంక్షని, మారుతన్న ప్రపంచీకరణ వింత పోకడల్ని తన రచనల్లో చిత్రించాడు. అయితే వీరి కథలు ఎక్కువగా మ్యాజిక్ రియలిజం ధోరణిలో సాగుతాయి. పాత్రలు, నేపథ్యాలు ఆయా సందర్భాలను బట్టి ఎక్కడైనా సంచారం చేస్తాయి. అయితే కథడుకు చెప్పాల్సిన విషయం మాత్రం పాఠకుడికి చేరుతుంది. మనుషుల్లో డబ్బుపై ఆశ పెరిగితే, అదే లోకం అనుకుంటే...! హోదాకు విలువ ఇస్తే...! మానవీయ విలువలు ఎలా నాశనం అవుతాయో... ! వివరించాడు నెత్తురుకన్నా చిక్కనిది కథలో మునిపల్లె రాజు.
          కథ ఎక్కువ భాగం క్లబ్ వాతావరణంలో సాగుతుంది. రచయిత మునిపల్లె రాజు పాత్ర మానసిక స్థితిని తెలియజేసేందుకు కథను- 'తుప్పర తుప్పర వానజల్లులతో క్లబ్బు ఆవరణమంతా బావురుమంటూన్నది' అని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ప్రధాన పాత్ర జగన్నాథాన్ని కథలోకి ప్రవేశపెడతాడు. జగన్నాథం క్లబ్బులో కొత్తమెంబరైనా పెద్దపెద్ద పార్టీలు ఇవ్వడం చేత నగరంలో బడా బడా అధికారులకు, పెద్దపెద్ద కంపెనీల డైరెక్టర్లకు దగ్గరై ఉంటాడు. క్లబ్బులోని బంట్రోతు కాసిమ్ కు కూడా జగన్నాథం అంటే గౌరవం. అందుకే అతను రాగానే తగిన మర్యాదలు చేస్తాడు. బార్ రూమ్ లో కూర్చోబెట్టి బ్రాందీ సోడా అందిస్తాడు. కానీ జగన్నాథం మనసు, శరీరం వణుకుతూనే ఉంటాయి. ఆ వణుకుకు కారణం మాత్రం బైట కురిసే వాన కాదు. అతను ఆడే పందెపు జూదం. ఆ జూదం గెలిస్తే పెద్దల స్నేహం, హోదా, సలాములు. ఓడిపోతే దిగులు, బీదతనం.
          ఓ పెద్ద కాంట్రాక్టు కోసం టెండరు వేసి, ఫిక్స్ చేసి క్లబ్బుకు వచ్చాడు. అది అతని తాహతకు మించిన పని. దానికోసం ఇన్ కంటాక్స్ సర్టిపికేట్ దిద్దాడు, తమ్ముడి సంతకంతో పవర్ ఆఫ్ అటార్ని కూడా పుట్టించాడు. దాంతో తమ్ముడి ఆస్తి అంతా అమ్మేశాడు. అప్పటికీ భార్య రుక్మిణి చెప్పింది. 'తమ్ముడి ఆస్తి అమ్మొద్దు. నలుగురు ఆడిపోసుకుంటారు' అన్నది. కానీ జగన్నాథం దృష్టిలో భార్య ఓ సత్తెకాలం మనిషి. అందుకే వెంకటేశ్వరస్వామి పటం వెండిది తెచ్చిస్తానని ఆమె నోరు నొక్కేశాడు. చివరకు క్లబ్బు ఫోన్ నంబరు ఇచ్చి టెండరు విషయం తెలుసుకోడానికి ఇప్పుడు ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. పైగా వస్తూ వస్తూ తన రివాల్వర్ కూడా తెచ్చుకున్నాడు. మాటిమాటికి దాన్ని తమిడి చూసుకుంటున్నాడు పిరికివాడిలా.
          ఇంతలో ఫోన్ వస్తే కాసిమ్ వచ్చి చెప్పాడు. జగన్నాథం కంగారుగా, ముచ్చెమటలు పోస్తూ వెళ్లి 'కాయా... పండా...'అని అడిగాడు. కానీ ఫోన్ అతనికి కాదు. దాంతో భయంతో, వణుకుతూ చల్లగాలికి వరండాలో నిలబడ్డాడు. 'మనిషికి మిగిలేది... ప్రేమా కదా... బీదవాళ్లందరూ నిజాయితీ పరులు కారే...' లాంటి ఆలోచనలు చేస్తాడు. లోకంలోని మనుషుల గురించి పరిపరి విధాలా...తనను తాను సమర్థించుకునేలా... తనలో తాను మాట్లాడుకుంటాడు.
            మళ్లీ ఫోన్ రావడంతో వెళ్తాడు. అతనికే టెండర్ అని తెలిసి ఆనందంతో సంబరపడతాడు. క్లబ్బునంతా కొత్తశోభతో చూస్తాడు. బాఁయ్ కాసిమ్ కు అయిదు రూపాయలు బహుమానంగా విసిరేస్తాడు. ఆ సంతోషంతో ఇంటికి వస్తాడు. కానీ రాగానే నెత్తిమీద పిడుగు పడ్డట్టు భార్య రుక్మిణి అతని తమ్ముడు రంగడు వచ్చాడని చెప్తుంది. జగన్నాథానికి ఏమి చేయాలో అంతుపట్టదు. తమ్ముడిని చూడునుకూడా చూడడు. 'రంగడిని మళ్లీ పంపెయ్... రెండు దోవతలూ, చొక్కాలూ కొనిపెట్టి, ఇరవై రూపాయలు చేతికిచ్చి పంపెయ్' అని భార్యకు గట్టిగా చెప్తాడు.
       మానవత్వాన్ని, మానవీయ విలువలను మరచిన జగన్నాథం ధనం అనే పిశాచికి, హోదాకు ఎలా దాసోహమయ్యోడో తెలిజేస్తుంది ఈ కథ. ఇక మునిపల్లె రాజు కథను నడిపిన తీరు చదివేవాళ్లలో ఉత్కంఠను కలిగిస్తుంది. ముగింపు ఊహకందని విధంగా ఆసక్తిగా అనిపిస్తుంది. జగన్నాథం పాత్రను విశ్లేషించిన తీరు నిజంగా అద్భుతం. ఆయనలోని చెడు గుణాల పరిణామం కనపడుతుంది. విలువలు పతనమయిన మనిషి ఎలా ఉంటాడో, అనుబంధాలను, ఆత్మీయతలను ఎలా డబ్బుతో కొలుస్తాడో చక్కగా చెప్పాడు ఈ కథలో మునిపల్లెరాజు.
          పాత్రోచిత భాషకు కాసిమ్ మాటలు... 'మాఫ్ కర్నా సాబ్... సాబ్ కు తబీయత్ ఠీక్ నైక్యా సాబ్...' మంచి ఉదాహరణలు. 'కాయా.. పండా..' అనే నానుడిని సరైన సందర్భంలో టెండర్ వచ్చిందా లేదా తెలుసుకోనే కోడ్ భాషగా ఉపయోగించాడు రచయిత. జగన్నాథం కంగారులో లోకం పోకడ గురించి చేసిన ఆలోచనలు కథకు హైలెట్ గా నిలుస్తాయి... 'పిచ్చి సన్నాసి రంగడు కూలీలందర్నీ పేరు పేరునా పిలిచేవాడు- పనుల మీదికి పంపిస్తే. వాళ్ల కెందరు పిల్లలు? ఇల్లెక్కడ?. కూలితో గడుస్తున్నదా? అని యోగక్షేమాలు అడుగుతుంటాడు. ఏమి శాశ్వతం? చివరికి మిగిలేది మనిషి మీద మనిషికి  ప్రేమే గదా? ఈ గొప్ప దర్జాల్లో ఏది నిజం?
          అట్లా అని ఈ బీదవాళ్లందరూ నిజాయితీపరులా తన పెద్ద మేస్త్రీ దొంగ రాస్కెల్- కూలి వాళ్లకు బేడ వడ్డీకి అప్పులిస్తుంటాడు.'        ముగింపు కొసమెరుపులా ఉండాలన్నా కథానికా లక్షణాన్ని ఈ కథలో మునిపల్లె రాజు తప్పక పాటించాడు. జగన్నాథం తమ్ముడు రంగడు ఇంటికి రావడం ఒక ఎత్తైతే, 'నెత్తురుకన్నా చిక్కని వేరే విలువల వలయంలో తన భర్త చిక్కుకొని వున్నాడని ఆమె ఎప్పటికీ తెలుసుకోలేదు. సత్తెెకాలం మనిషి' అని భార్య రుక్మిణి స్వభావంతో కథను ముగించడం. అందుకే ఈ కథ మృగ్యమైపోతున్న మానవీయ విలువలపై గొడ్డలి పెట్టు లాంటిది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సినది.
                                                   

- డా. ఎ. రవీంద్రబాబు