Facebook Twitter
మహిళా! ఓ మహిళా! - శారదా అశోకవర్దన్

మహిళా! ఓ మహిళా!


- శారదా అశోకవర్దన్

 

మహిళా! ఓ మహిళా!

నువ్వు లేనిదే మహి ఎక్కడుంది?

భూమి లేని చోట ఆకాశం వుంటుందా?

ఆకాశమే లేకపోతే చుక్కలు రెక్కలు విప్పుకుని మొలుస్తాయా?

సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పి మహిళ

విశ్వ వీణలు శృతిపెట్టి జీవనరాగం పాడే గాయని మహిళ

ఓర్పుకి మారుపేరు

నేర్పుకి మరోపేరు

మనసుకి మమతల పందిళ్ళు వేసి

సమత చమురు పోసి ఆశాదీపాలు వెలిగించేది మహి

తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా అందాల భరిణగా

అపురూప లావణ్య సుందరాంగిగా

మనువాడిన మనస్వినిగా

బాధ్యతల నెరిగిన బందీగా

బాధని గొంతు దాటనివ్వని గరలకంఠుడికి ప్రతీకగా

సహనానికి సవాలుగా నిలిచేది మహిళ

పరిస్థితి పామై కాటేస్తే,ఓపికకు పాతరపడితే

రుధిర జ్వాలల్ని రగిలిస్తుంది మహిళ

రుద్రవీణ భద్రకాళిలా మ్రోగిస్తుంది

కదను తొక్కుతుంది కత్తి దూస్తుంది

దీక్షాకంకణ కవచంతో లక్ష్యం సాధిస్తుంది

ఉద్యోగాలు చేస్తుంది ఊళ్ళేలుతుంది

గట్టి చేతులతో చట్ట సభలలో పెద్ద పీట వేసుకుంటుంది

అయినా ఓడిపోతోంది పురుషాహంకార సమాజంలో

వరకట్న యాగంలో సమిధగా కాలిపోతోంది నా మహిళ

చాతకానితనము కాదు అది చచ్చుతనమూ

కాదు అంతులేని ప్రేమామృత భాండం ఆమె హృదయం

క్షమాగుణం, త్యాగం సర్దుకుపోయే స్వభావం ఆమె నైజం

వాటిని బద్దలు కొట్టడం ఇష్టం లేని నా మహిళ

మౌనిగా రగిలిపోతోంది

బలిపశువుగా ప్రాణాలు కోల్పోతోంది

ఆత్మహత్య త్యాగం కాదు

హత్య గావింపబడడం పరిష్కారమూ కాదు

మనస్సు చంపుకోకు మసిగా మారిపోకు

కసిగా మిగలబోకు

నీ పసిడి హృదయంలో విసాన్నీ విషాదాన్నీ నిండనీయకు

నీ శక్తిని వినియోగించు మహిళా

నువ్వూ ఈ విశాల ప్రపంచంలో ఒక మనిషి

నీకూ స్వేచ్చగా బ్రతికే హక్కుందని చాటుకో

నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో!