Facebook Twitter
కాగితం ముక్కలు - గాజు పెంకులు

కాగితం ముక్కలు - గాజు పెంకులు

  - బుచ్చిబాబు 

   'చివరకు మిగిలేది' అనే ఒకేఒక్క నవలతో తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు బుచ్చిబాబు. బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వేంకట సుబ్బారావు. ఇతను సుమారు 80కి పైగా కథలు రాశారు. అయితే వీరి రచనలు ఎక్కువ భాగం మనషి, మానసిక జగత్తును చిత్రీకరించేవే... పాత్రలు కూడా మానసిక సంఘర్షణలతో సతమతమయ్యేవే... వీరు రాసిన 'కాగితం ముక్కలు - గాజుపెంకులు' కథ కూడా ఇలాంటిదే... బార్యపై అనుమానంతో ప్రవర్తించే భర్తను, ప్రేమన, పెళ్లి తర్వాత భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పును వివరించేదే ఈ కథ. బుచ్చిబాబు ప్రతేకమైన శైలి దీనికి మరో ఆకర్షణీయమైన ఆభరణం.
       కథ రైలు వర్ణనతో ప్రారంభమవుతుంది. చంద్రం తన స్నేహితుడు నరసింహాన్ని రైలు ఎక్కించడానికి స్టేషనుకు వస్తాడు. నరసింహం కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రానికి, అతని భార్య అరుణకు స్నేహితుడు. అయితే చదువుకునే రోజుల్లో నరసింహం ప్రవర్తన వల్ల అతనికి పోకిరి, సింహం అనే పేర్లు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్మీలో ఉన్నతమైన ఉద్యోగం. ఆ ఉద్యోగం తాలూకూ వచ్చిన పొట్టి క్రాపు, మర్యాద, నమ్రత అతనిలో చంద్రానికి కనిపిస్తాయి. ఉన్న నాలుగు రోజులు చంద్రం భార్య అరుణతో మర్యాద పూర్వకంగా, నాజూకుగా ప్రవర్తిస్తాడు నరసింహం.
     కానీ, రైలు ఎక్కేటప్పుడు మాత్రం తన దగ్గరున్న హంటర్ ను చంద్రానికి బహుమతిగా ఇస్తాడు. తన జ్ఞాపకార్థం ఉంచుకోమంటాడు. పైగా... 'ఈ నాలుగు రోజులు హాయిగా గడిచాయి. అరుణకు థాంక్స్ చెప్పు' అంటాడు. దాంతో చంద్రానికి అరుణపై, నరసింహంపై అనుమానం మొదలవుతోంది. 'ఒకర్నొకరు గారు అని సంబోధించే అవసరం వున్నంత వరకూ వారిని నిజమైన స్నేహితులుగా పరిగణించడం సాధ్యం కాదేమో...' అనుకుంటాడు.
    నరసింహం ఇచ్చిన హంటర్ తో ఇంటికి వెళ్తాడు. భార్యను పిలుస్తాడు. పలకదు. మూసిఉన్న అరుణ గది తలుపులను తోసుకుంటూ లోపలికి వెళ్తాడు. 'తలంటు పోసుకొన్న జుట్టు తడిని తువ్వాలుతో బిగించి ఆర్పుకొంటూ పచ్చటి తెల్లచీర పూర్తిగా కట్టుకోకుండా జాకెట్టు కూడా లేని....' అరుణను చూస్తాడు. వెంటనే చంద్రంలో కోర్కెలు పురివిప్పుతాయి. ఆమె చేతిలో ఏదో కాగితం కనిపిస్తుంది.
'ఏమిటది?' అని అడుగుతాడు.
ఆమె చూయించకుండా చీరమడతలో దాచుకుంటూ 'బైటకెళ్లండి' అంటుంది.
'ఏం మాట్లాడుతున్నావో?, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?' అని గద్దిస్తాడు.
ఇద్దరి మధ్యా పెనుగులాట జరుగుతుంది. అరుణ వ్యక్తిత్వం క్రమంగా దెబ్బతింటుంది. చంద్రంలోని బలహీనతలు బయటపడతాయి. 'డేగ పాదం కప్పపిల్ల మీద పడ్డట్టు' ఆమె భుజాన్ని పట్టుకుంటాడు చంద్రం. ఆమె పక్కకు తప్పుకుంటుంది. చంద్రం కిందపడతాడు. దెబ్బ తగులుతుంది. చివరకు హంటర్ తో అరుణను కొట్టి చేతిలో కాగితాన్ని తీసుకుంటాడు.
       తన గదిలోకి వెళ్లి దాన్ని చదువుతాడు. అది పెళ్లైన ఏడాదికి భార్యపై ప్రేమతో చంద్రం రాసిన లేఖ అది...
    'అన్ని నదులూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట సముద్రంలో పడాల్సిందే అన్నాడు ఒక కవి. ఇప్పుడా సమయం వచ్చింది. ఉద్యోగం దొరికింది. నీకు ఉయ్యాలంటే ఇష్టం కదూ... మనుషులు లేని ఏకాంత లోయలలో రెండు శిఖరాలకు మధ్య తగిలిద్దాం ఆనందం అనే ఉయ్యాలని... దూరంగా వెళ్లిన పిల్ల వాయువు ఆ ఉయ్యాలని ఊపుతుంది..... ..... అరుణా... కొండ వెనక ప్రభాత కిరణం. నీ స్నానం కోసం వేచివున్న అడవి కొలను... మనకోసం ఎదురు చూస్తూ  ఉన్నాయి.'
        ఉత్తరాన్ని కొంత చదివిన చంద్రానికి అరుణ ఆ ఉత్తరం తను చూడకుండా ఎందుకు దాచుకుందో అర్థం కాదు. ఆలోచిస్తాడు. ఎన్నేళ్ల క్రితమో తను పొందిన ఆనందాన్ని ఇప్పుడు చదువుకొని  గుర్తు తెచ్చుకుంటున్న పనికి తను అడ్డు వచ్చినందుకా...?! అని చంద్రం అర్థం చేసుకుంటాడు. 'హంటర్ స్వరూపంతో తను తన ముందు ప్రత్యేక్షమై ఆ ఊహా జగత్తును ధ్వసం చేశాడు. అందుకే విరోధిగా, పరాయి వాడిగా తూలనాడి ఎదురు తిరిగి, స్వప్న జగత్తులో తన నిజ స్వరూపాన్ని వొక్కసారి చూపెట్టింది'. అని నిజం తెలుసుకుంటాడు. హంటర్ తో తనూ ఓ దెబ్బ కొట్టుకుంటాడు. దాన్ని అక్కడే పడేసి అరుణ గదికి బయల్దేరుతాడు. కాని అప్పుడే అతడి కళ్ల నుండి ఒక కన్నీటి బిందువు రాలుతుంది. 'అది పగిలిన వాటిని అతుకు పెట్టే జిగురులాంటిది. అదికాస్త ఇప్పడు పడిపోయింది' అని కథను భారంగా ముగిస్తాడు బుచ్చిబాబు.
          సున్నితమైన ఉద్వేగాలను ఆపుకోలేక మానవ సంబంధాల్లో కల్లోలాన్ని సృష్టించుకున్న చంద్రం. గతాన్ని తల్చుకొని వర్తమానంలో దొరకని ఆనందాన్ని స్వప్నలోకాల్లో పొందే అరుణ. కాలంతోపాటు వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్న నరసింహం... ఇలా మూడు భిన్న మైన మనుషుల మధ్య సాగుతుంది ఈ కథ. ఎక్కడా బుచ్చిబాబు వర్ణనలు పాఠకుడ్ని వదలకుండా వెంటాడుతాయి.
      మొదట రైలు గురించి- 'బ్రతుకంతా భ్రమ అనుకొని మడి గట్టుకొని మూల కూర్చుని పెదవి చప్పరించే వారికి ఈ రైలింజన్ ఒక సవాల్... ... ధ్వనుల్ని తనలో జీర్ణించుకుని గతంలోంచి ప్రాణాన్ని తెచ్చుకున్న ఒక చారిత్రక కళేబరం' అంటాడు  
     అరుణ, చంద్రం పెనుగులాటలో అరుణ వ్యక్తిత్వాన్ని చెప్తూ-
 1. ఇప్పుడామే కళ్లు ఎర్రగా వున్నాయి.
 2. పరాయి స్త్రీగా కనపడుతుంది అరుణ.
 3. అరుణ సంసార బంధాన్ని విస్మరించింది. తన భార్యకాదు-   వ్యక్తిత్వంతో ప్రజ్వరిల్లుతున్న వొక ప్రాణి అంటాడు  
      కథ చివర చంద్రం జీవితంలో వచ్చిన మార్పును, అరుణ లేఖ చదవడంలో పొందిన ఆనందాన్ని కలిపి వర్ణిస్తూ-
'ఆ ఉత్తరం రాసిన చంద్రం వేరు. ఆ చంద్రం ప్రియుడు- యవ్వనంలో స్వప్నాలల్లే మాంత్రికుడు. ఇప్పటి చంద్రం భర్త, ఉద్యోగం, హోదా, డబ్బు, నౌకర్లూ, స్నేహితులూ, మర్యాదలూ- ఆమె భార్య- వంటొండి పెడుతుంది....' అంటాడు.
     అందుకే ఈ కథ ప్రేమికులలో, ప్రేమించి పెళ్ళిచేసుకోవాలనుకునే వారిలో, చేసుకున్న వారిలో, వచ్చిన, వస్తున్న మార్పులకు అద్దం లాంటిది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన చీకటి లాంటి వెన్నల సౌధం.
                          
                                                       

- డా.ఎ. రవీంద్రబాబు