Facebook Twitter
దిద్దుబాటు

 దిద్దుబాటు

   - గురజాడ అప్పారావు
   

సంఘాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో గురజాడ అప్పారావు రాసిన కథ 'దిద్దుబాటు'. ఆధునిక లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న తొలి కథానిక ఇదేనని కొందరి అభిప్రాయం. 'దిద్దుబాటు' 1910 ఫిబ్రవరిలో 'ఆంధ్ర భారతి' పత్రికలో ప్రచురింపబడింది. అప్పటి సమాజంలో వ్యభిచారం ఒక వృత్తిగా ఉండేది.  విద్యావంతులు, పై స్థాయిలో ఉన్నవారిలో వేశ్యలపట్ల వ్యామోహం ఎక్కువ ఉండేది. ఇప్పటికీ ఈ సమస్య సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. వేశ్యాలోలుడైన భర్తకు భార్య బుద్ది చెప్పడమే ఈ కథలోని ఇతివృత్తం. అందుకే గురజాడ దీనికి 'దిద్దుబాటు' అని పేరు పెట్టారు.
      ఇక కథలోకి ప్రవేశిస్తే- కమలిని భర్త గోపాల్రావు. వేశ్యలపై మోజుతో, వారి ఆటపాటల్లో మునిగి రోజూ రాత్రి బాగా ఆలశ్యంగా ఇంటికి వస్తుంటాడు. భార్యకు మాత్రం లోకానికి ఉపాకారం చేస్తున్నానని అబద్దాలు చెప్తుంటాడు. కమలినికి అసలు విషయం తెలుస్తుంది. భర్తకు బుద్ధిచెప్పి మార్చుకోవాలను కుంటుంది. అందుకు ఓ నాటకమాడుతుంది.
       రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన గోపాల్రావుకు భార్య కమలిని కనిపించదు. ఇల్లు, పడకగది అంతా వెదుకుతాడు. దీపం వెలిగించి మరీ వెదుకుతాడు. కానీ భార్య కనిపించదు. బుద్ది తక్కువ పనిచేశానని బాధపడతాడు. భార్య ఏమైందోనని పరిపరి విధాలా ఆలోచిస్తాడు. భార్య కనపడలేదన్న కోపంతో నౌకరి రావుడుపై చేయిచేసుకుంటాడు. వెంటనే తప్పుతెలుసుకుంటాడు.
      బల్లపై భార్యరాసిన ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో-
'..... నా వల్లే కదా మీరు అసత్యాలు పలుకవలసి వచ్చింది. మీ త్రోవకు నేను అడ్డుగా ఉండను. ఈ రేయి కన్న వారింటికి వెళ్తున్నాను.' అని రాసి ఉంటుంది.
    దాంతో గోపాలరావుకు గొంతులో వెలక్కాయపడ్డట్టు అవుతుంది. విద్యావతి, గుణవతి అయిన భార్య తనకు తగిన శాస్తి చేసింది అని వ్యాకులత చెందుతాడు. నౌకరికి పది రూపాయలిచ్చి కమిలినిని బతిమిలాడి తీసుక రమ్మంటాడు. 'తప్పు తెలుసుకున్నాను, ఇక ఎప్పటికీ సానుల ఇంటికి వెళ్లను, రాత్రిళ్ళ యిల్లు కదలను, తను లేకపోతే వెఱ్ఱి ఎత్తినట్లు ఉంది' అని భార్యకు చెప్పమంటాడు.
    ఇదంతా మంచం కిందనుంచి వింటున్న కమలిని తన భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించి నవ్వుతూ బైటకు వస్తుంది. ఇలా కథ ముగుస్తుంది.
    ఈ కథలో గురజాడ అప్పారావు మూడు విషయాలు చెప్పాడు. వేశ్యావృత్తిని నిరాకరించడం. 'శివుడు పార్వతికి సగం దేహం పంచి యిచ్చాడు కాదా, ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అంటాడు. అనగా పెళ్ళాం మొగుడి కన్నా దొడ్డది అన్నమాట.' అని రాస్తాడు. అంటే కుటుంబంలో భార్యాభర్తలు సమానం అని ఈ కథ ద్వారా ఆనాడే గురజాడ అప్పరావు చెప్పాడు . ఇక మూడో విషయం స్త్రీ విద్య- 'భగవంతుడి సృష్టిలో కల్లా ఉత్కృష్టమయిన వస్తువ విద్యనేర్చిన స్త్రీ రత్నమే....  నీ కూతుర్ని బడికి పంపుతున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతోంది.' అని స్త్రీ చైతన్యానికి విద్యే మూలమని రచయిత గుర్తించాడన్నామాట.
    ఈ కధలో రావుడి పాత్రద్వారా సున్నితమైన హాస్యాన్ని సృష్టించాడు గురజాడ. పాత్రలకు తగిన భాషను వాడినా, కథారచనలో వ్యావహారిక భాషకు పట్టం కట్టాడు. ప్రారంభం, ముగింపు, నిర్వహణ లాంటి అన్నిటిలో నేటీ కథలకు ఏ మాత్రం తీసిపోదు ఈ కథ. 'ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరిగ రచిస్తారు ' అన్న ఆయన ఆశాభావం ఈ కథ నిండా కనిపిస్తుంది. కానీ అది ఇప్పటికీ నరవేరలేదు అన్నది నిజం.
                                      

    - డా. ఎ. రవీంద్రబాబు