Facebook Twitter
విశ్వప్రేమికుడు

విశ్వప్రేమికుడు

డా. రాధాశ్రీ

ఎవరి తరము ఎవరి తరము
విశ్వఖ్యాతి నార్జించిన
భవ్యప్రేమ విశారదుని
కీర్తించగ నెవరి తరము

ప్రేమ మయము భువి సకలము
ప్రభుని మయము ప్రతి శకలము
అని నమ్మిన కవివరేన్యు
ప్రతిభనెంచ నెవరి తరము

హృదయమనెడి దర్పణంపు
నైర్మల్యము వైశ్యాలము
ననుసరించి ప్రతిఫలించు
విశ్వవ్యాప్త రవి తేజము

విశ్వ మనుజు భ్రాతృత్వము
కరుణారసమూర్తిత్వము
భగవత్ప్రేమ కవిత్వము
అదియె రవీంద్రుని తత్వము

అతడు దృష్టి సారించగ
కాలయముని భ్రుకుటియైన
శతదళముల పద్మమ్ముగ
తృటిలోనే వికసించును

అతడు సృశియించినంత
అతి భీకర తమశీలలు
కరిగి వెలుగు వెల్లువలై
ప్రవహించును విశ్వమంత

ప్రేమయనెడి పెన్నిధికై
అభవుని పద సన్నిధికై
వెదకి వెదకి అణువణువున
దర్శించెను భావనుని

చీకటి లోయల తేజ
శిఖర శేఖరమును గాంచె
ఆ శిఖరము నధిష్టించె
రసపతాక ప్రతిష్టించె

ఎండి బీడు వారి నట్టి
ఎదలను పండించునట్టి
రసవహిని గీతాంజలి
అతడొసగిన భక్త్యంజలి !

విశ్వశాంతి కేతనమ్ము
అతని శాంతి నికేతనమ్ము
అతడు విమల భావుకుడు !
అతడు విశ్వ ప్రేమికుడు!!