Facebook Twitter
గోపురం

గోపురం

- భవానీదేవి


   
    కాశీ విశ్వనాథుని గుడిగంటలు సుప్రభాత కీర్తనలను ఆలపిస్తున్నాయి. ఆ గుడి గోపురం చూస్తూనే పరమేశ్వరశాస్త్రి మనసు పులకించిపోయింది. జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శించాలనీ, విశ్వనాథుని చూసి తరించాలన్న కోరిక ఇన్నాళ్ళకు తీరిందన్న ఆనందంతో కళ్ళు చెమర్చుతున్నై. శాస్త్రి వెనక కిట్టప్ప వడివడిగా అనుసరిస్తున్నాడు. ఇద్దరూ విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించారు.

    "ప్రభో ప్రాణనాథం విభో విశ్వనాథం" స్వరంలో శివధ్యానాన్ని ప్రతిష్టిస్తూ.... స్తోత్రం చేస్తూ ముందుకు కదిలారిద్దరూ.

    ఎందరో దేవతలు కొలువైన విశ్వనాథుని సమక్షంలో శాస్త్రి మనసు ఈశ్వర దర్శనం కోసం ఉబలాటపడింది. శివుడు అభిషేక ప్రియుడు. కాశీ లింగాన్ని సుప్రభాతవేళ 'హరహర మహాదేవ' అంటూ జలాభిషేకం చేస్తున్నారు భక్తులతో. కైలాసం కదిలి వచ్చినట్లుంది. శాస్త్రి విశ్వనాథునికి అభిషేకం చేసి పూలహారం సమర్పించాడు. కిట్టప్ప కూడా అలాగే చేశాడు. భక్తిగా ఇద్దరు బయటికి కదుల్తున్నారు.

    కిట్టప్ప చూపులు నాలుగడుగుల దూరంలో ముందు నడుస్తున్న శాస్త్రి మీదే నిలిచాయి.

    నిండయిన ఆజానుబాహు విగ్రహం, పచ్చని దేహఛాయ, నుదుట విభూతి రేఖలు, సాంప్రదాయికమైన గోష్పదం, చురుకైన చూపులు ఆకట్టుకుంటాయి. మెడలో రుద్రాక్షలు, మెరుపుతీగలాంటి జందెం శివదీక్షతో తదేకంగా కాశీ విశ్వనాథునికేసి చూస్తూ కదిలి వెళ్తున్న పరమేశ్వరశాస్త్రిని చూస్తుంటే పరమశివుని ప్రమథగణాల్లో ఒకరు కైలాసం నుంచి కదిలివచ్చాడు అన్పిస్తోంది. మనసులోనే నమస్కరించాడు కిట్టప్ప. "ఈ మహానుభావుడి వల్లనే కాశీ విశ్వేశ్వరుని సందర్శన భాగ్యం కలిగింది" అనుకున్నాడు.

    విశ్వనాథుడ్ని తనివితీరా దర్శించి ఇద్దరూ బయటికి వచ్చారు. వెనుదిరిగి ఒకసారి గుడికి నమస్కరించాడు పరమేశ్వరశాస్త్రి. ఆయన కళ్ళల్లో చిప్పిల్లిన నీటి బిందువుల్ని కిట్టప్ప కంటపడకుండా పై కండువాతో అద్దుకున్నాడు.

    మరో గంటకి వాళ్ళు గంగాతీరంలో ఉన్నారు. "చూశావురా కిట్టప్పా! ఇందాక గంగమ్మని దూరంగా చూశాం. ఇప్పుడు చూడు. ఎంత కరుణ నింపుకుని కన్పిస్తోందో! పాపాతుల్ని కూడా ఒడిలో చేర్చుకుని ఆదరిస్తోంది!" అన్నాడు శాస్త్రి భక్తిగా.

    "అవునండీ! సినిమాల్లో చూసినప్పుడు నిజంగా గంగను చూడగలనా? అనుకున్నా... మీవల్లే..." కిట్టప్ప భక్తిగా నమస్కరించాడు.

    "ఇవాల్టి ప్రపంచంలో అంతా తన కోసమే ఏ పనైనా చేసుకుంటారు. అలాంటిది... భగీరధుడు తన తాత తండ్రుల కోసం ఘోరతపస్సు చేసి వారి ముక్తి కోసం ఈ దేవ నదిని రప్పించాడు... ప్చ్. తండ్రుల కోసం తాతల కోసం ఇంతటి మహత్తర కార్యం చేయటం... ఇవ్వాళ మనం ఊహించే విషయమేనా! తల్లిదండ్రుల కోసం ఒక్క గంట కూడా కేటాయించలేని ఐశ్వర్య సంపాదనలో పిల్లలు ఎటు కొట్టుకు పోతున్నారో!" నిట్టూర్చి నది వైపు అడుగులేశాడు శాస్త్రి.

    కిట్టప్ప శాస్త్రి సంచిని ఎడంచేత్తో హృదయానికి భద్రంగా అదిమి పెట్టుకొని ఆయన్ని అనుసరించాడు.

    శాస్త్రి ఆగాడు. వెనుదిరిగి కిట్టప్పని ఆగమని చేత్తో వారించాడు.

    "నువ్వుండరా! అలా ఒడ్డున కూచో! నేను జపతపాలు ముగించి స్నానం చేసి వస్తా. తర్వాత నువ్వు చేద్దువు. సంచీ జాగ్రత్త..." ముందుకు కదిలిన శాస్త్రికేసి చూస్తూ ఒకచోట కూర్చున్నాడు కిట్టప్ప.

    కంటి చూపు అందినంత మేరా పరమపావని గంగానదిని భక్తిగా ప్రేమగా చూశాడు శాస్త్రి. అమ్మలా చేతులు చాపుతూ తనని ఒడిలోకి ఆహ్వానిస్తున్నట్లు అన్పించింది. చిన్నప్పుడే చనిపోయిన అమ్మ మళ్ళీ స్పర్శించినట్లనిపించింది.

    ఇంకో అడుగేశాడు. పాదాలు దాటి నీళ్ళు పైకి వచ్చాయి. మనసు సముద్రంలా ఉప్పొంగింది. ఎన్నాళ్ళనించి ఈ శుభ ఘడియ కోసం ఎదురుచూశాడు. పూలదండని తాకినట్లు నీళ్ళని తాకి కుడిచేత్తో నెత్తిమీద చల్లుకున్నాడు. కొన్ని నీటి చుక్కలు భుజం మీదికి జారి వీపు మీదికీ పొట్ట మీదికీ పడ్డాయి .శరీరమంతా పులకరించింది.

    చిన్నప్పుడు లాల పోసేటప్పుడు అమ్మ చేతులకి అందకుండా అటూ ఇటూ పరిగెత్తేవాడు. అమ్మ వెంటబడి బతిమిలాడి బుజ్జగించి స్నానం చేయించేది. అమ్మ.. ఆ మాటే మనసునంతా వెన్నలా కరిగిస్తుంది. అమ్మ ఎలా ఉండేది.. ఆ కళ్ళలో ఎంత ప్రేమ.. కరుణ... రానురాను "అమ్మబొమ్మ" మసకేసినట్లుగా అన్పిస్తోంది.

    నలుగురు అక్క చెల్లెళ్ళ మధ్య ఎంత గారాబం. అంతా తన కాళ్ళకింద అరచేతులు పరిచి పెంచారు. కాళ్ళకు మువ్వల పట్టీలు తలకి కొండీ చుట్టి నెమలి పించం పెట్టి పట్టు ధోవతి చుట్టి 'కన్నయ్యా' అనేది అమ్మ. 'నా దిష్టే తగుల్తుంది' అని దిష్టి చుక్క దిద్దేది. తనను విడిచి ఒక్క క్షణమైనా ఉండగలిగేదా! మరి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిందేంటి? అసలు అమ్మ లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలిగాడు. మరో అడుగు ముందుకేశాడు. నీళ్ళు పిక్కలు దాటుతున్నాయి.

    అమ్మ లేకపోతేనేం! అలివేలుని చూపించి వెళ్ళిందిగా! అలివేలు తనపాటల్ చూపించిన ప్రేమవల్లే అమ్మ లేకపోయినా బతికున్నాడు. అవును.. అలివేలు అమ్మని మరిపించింది. యాభై ఏళ్ళపాటు కంటికి దీపంలా చూసుకుంది. తనకేం కావాలో తనకి తెలీకపోయినా అలివేలుకు తెలిసేది. తన కాల్లో ముల్లు డిగితే ఆమె కంట నీరు తిరిగేది. అమ్మే మరో రూపంలో అలివేలులా వచ్చిందని అన్పించేది.

    ఇద్దరు కొడుకులు పెరిగి అమెరికా వెళ్ళి ప్రయోజకులు కాగానే తన కర్తవ్యం తీసిపోయినట్లు నిద్రలోనే నిష్క్రమించింది అలివేలు. అప్పటినుంచి తన జీవితం దీపం లేని గుడిలా మారిపోయింది.

    భార్య ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ళలా శాస్త్రికి కూడా ఆమె విలువ తెలియలేదు.ఆమె పోయాక అంతవరకు అర్ధంకాని సత్యం వెలుగులోకి వచ్చి జ్ఞానోదయమయింది. అలివేలు ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెని అగౌరపరచలేదు. గానీ ఆమెలేని జీవితం స్మశానంలో ఒంటరి నడకలా ఇంత నిస్సహాయంగా ఉంటుందని మాత్రం ఊహించనే లేదు. పరమేశ్వరశాస్త్రి ఆలోచిస్తూ నీళ్ళలోంచి దోవచేసుకుని వెళ్తున్నాడు.

    అలివేలు పోయినప్పుడు ఇద్దరు పిల్లలకు అమెరికా నించి రావటానికి కుదర్లేదు. నట్టింట్లో శవాన్ని పెట్టుకొని వాళ్ళకోసం ఎంతగానో ఎదురుచూశాడు. ఏదో ఆశ! అలివేలు పిచ్చిది! వాళ్ళకి జ్వరం వస్తే ఎన్ని రాత్రిళ్ళు నిద్రమానేసింది. ఎన్ని రాత్రిళ్ళు నిద్ర మానేసింది. ఎన్ని రోజులు అన్నం మానేసి సపర్యలు చేసింది... వాళ్ళకి మాత్రం అమ్మని కడసారి చూడటానికి తీరికేలేదు. పైగా అంతిమ సంస్కార దృశ్యాలు వీడియో తీసి పంపమని పెద్దాడు అంటే.

    "ఎందుకన్నయ్యా! వేస్ట్ ఆఫ్ మనీ! చూసి ఏం చేస్తాం చెప్పు. బాధపడటం తప్ప" అంటూ వారించాడు చిన్నవాడు.

    తన మనసు పాతాళంలోకి కుంగిపోయినా ఏమీ అన్లేకపోయాడు. "ఇల్లు అద్దెకిచ్చో అమ్మేసో మాతో వచ్చేయండి" పెద్దాడి సలహా.

    పెద్దకోడలు పక్కకి వెళ్ళి ఏదో సైగ చేసింది. వాడే మళ్ళీ అన్నాడు.

    "పోనీ ఇక్కడే ఏదైనా వృద్ధాశ్రమంలో... అక్కడికొస్తే ఎటూ మీకు తోచదు" నసిగాడు. చిన్నవాడు వంటపాడాడు. ఏదో చెప్పబోతున్న స్నేహితుడు నాగభూషణం చేయిపట్టుకుని సున్నితంగా ఆపాడు తనే.

    ఈ పిల్లల కోసమేనా ఆటో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయనీ మైళ్ళ దూరం నడవటం, అన్నంలోకి రెండు ఐటమ్స్ చేసుకోకుండా ఒకటే చేసుకొని తినటం, పండక్కి బట్టలు మానేసి వాళ్ళకి పుస్తకాలు కొనటం...

    "పోనీలేరా! కొన్నాళ్ళు చూద్దాం. అంతగా ఉండలేకపోతే ఏదో ఒకటి చేస్తాను" ఆ సంభాషణను తనే తుంచేశాడు. చాలా రిలీఫ్ గా ఫీలయిన కొడుకులు విషాదాన్ని నటిస్తూ ఆనందంగా అమెరికా ప్లయిట్ ఎక్కేశారు.

    ఆలోచనల అలల మధ్య మరో అడుగు వేశాడు శాస్త్రి.

    నీళ్ళ అలలు మోచిప్పల్ని చేప పిల్లల్లా చుట్టుకుంటూ చుట్టాల్లా పలకరిస్తున్నాయి. అలివేలు అస్థికల్ని ఇలా కృష్ణనీటిలో పెన్నిధిని జారవిడిచినట్లు కలిపేశాడు. ఇవ్వాళ మాత్రం మనసంతా ప్రశాంతంగా ఉంది.

    "ఇంకెన్నాళ్ళండీ! ఈ రెండేళ్ళు కష్టపడితే నా బిడ్డలు రెండుచేతులా సంపాదించి మనల్ని నేలమీద నడవనివ్వరు" అలివేలు మాటలు నిజం అవుతున్నాయి. నేలమీద నడవనివ్వటం లేదు...

    'స్వాతి'లో మాలతీచందూర్ గారు పరిచయం చేసిన నవల 'అమ్మకేమయింది' చదివి ఏడ్చేశాడు తను. నిజంగా తల్లికోసం అంతగా తపించే పిల్లలుంటారా? తమకంటూ ఒక కుటుంబం, ఒక ప్రపంచం ఏర్పడిన తర్వాత అమ్మ గురించి... ఆవేదనతో రెపరెపలాడే ఆమె జీవితం కోసం చేతులు కాపుకాసే పిల్లలుంటారా! పిల్లల కోసం తల్లిదండ్రులు చూపించే ప్రేమ, తపనల్లో కనీసం పదోవంతయినా పిల్లలు వాళ్ళ పట్ల చూపించలేరా?

    భారంగా మరో అడుగేశాడు శాస్త్రి. నీళ్ళు తొడల దాకా వచ్చాయి. చిన్నప్పుడు నీళ్ళల్లో ఆడుతుంటే జలుబు చేస్తుందని గాభరాగా వళ్ళంతా తుడిచి బట్టలు మార్చేది అమ్మ. ఇవ్వాళ అమ్మ ఎందుకో మరీమరీ గుర్తొస్తున్నది.

    దూరంగా కిట్టప్ప శాస్త్రికేసి ఆదుర్దాగా చూస్తున్నాడు. వాడి మోహంలో క్రమక్రమంగా ఆందోళన చోటు చేసుకుంటోంది. ఏదో అర్ధమయినట్లుగా శాస్త్రికేసి కుడిచెయ్యి ఊపుతూ గట్టిగా అరిచాడు.

    "పంతులుగారూ! ఇంక లోతెళ్ళకండి. తొరగా బయటికి వచ్చేయండి" అని మళ్ళీ మళ్ళీ కేకలు పెడుతున్నాడు.

    ఈ కేకలేవీ శాస్త్రి చెవులకి సోకినట్లు లేవు. సోకినా ఆయన పట్టించుకోదల్చుకోలేదేమో! అడుగులు పడుతూనే వున్నాయి. నీళ్ళు భుజాలదాకా వచ్చాయి.

    కిట్టప్ప తీరం దగ్గర అటూ ఇటూ పరిగెడుతూ అరుస్తున్నాడు. వాడి గొంతులో దుఃఖపు జీర పంజరంలో పక్షిలా గిజగిజలాడుతోంది. నదిలోంచి శాస్త్రి కిట్టప్పకేసి చేతులూపాడు. ఇక వెళ్ళిపొమ్మన్నట్లు. కిట్టప్ప గుండె గుభేలుమంది .శాస్త్రి రెండుచేతులు పైకెత్తి పరమేశ్వరుడికీ, జన్మనిచ్చిన తల్లికీ నమస్కారం చేశాడు. ఆయన కళ్ళముందు చివరిగా జ్వర భారంతో దిక్కులేక తను మంచాన పడిన దృశ్యం, అలివేలు చావు మెదిలాయి.

    "భగవంతుడా! తల్లిదండ్రుల మీద దయా ప్రేమ లేని పిల్లల్ని ఇచ్చేకన్నా గొడ్రాలుగా మిగుల్చు. నాలాంటి వారికి ఇచ్ఛామరణం ప్రసాదించు" అని చేతులెత్తి ప్రార్ధించాడు.

    తర తరాల భారతీయ కుటుంబ సంస్కృతీ గోపురంలా ఆ నమస్కారం క్రమంగా గంగలో మునిగిపోయింది. 

    నేలమీద కూలబడి ఏడుస్తున్న కిట్టప్ప ఏవో గుర్తొచ్చినట్లు సంచీ తీశాడు. కొన్ని వందల కట్టలు... ఓ ఉత్తరం.. విప్పి చదివాడు.

    నాయనా కిట్టూ,

    నువ్వు జీర్ణించుకోలేని నిజం. ధర్మరాజు వెంట యమునిలా నువ్వు చివరిదాకా నా వెంట వచ్చావు. నా ఇల్లు నీ పేర రాశాను. ఈ డబ్బులో కొంత నా కర్మ కాండలకి వాడి మిగిలింది నువ్వు తీసుకో... నా శవసంస్కారం నువ్వే చేయి నా కొడుకులకి కబురు పంపక్కర్లేదు. నీకు చేతనైతే నీలాంటి అనాథని చేరదీయి. అలివేలమ్మ ఋణం ఇలా తీర్చుకో.. నీకు శుభం.. ఆశీస్సులతో.. శాస్త్రి.

    కిట్టప్ప గుండెలు పగిలేలా ఏడ్వలేదు .శాస్త్రి వాడికి నేర్పిన చదువు ఆయన కడసారి కోరిక తెలుసుకోవటానికి ఉపయోగపడింది. కిట్టప్ప రాల్చే అశ్రుధారలు మానవసంబంధాల మీది నమ్మకాన్ని మళ్ళీ చివురింపజేస్తున్నాయి.

            * * *