Facebook Twitter
నవరాగం

నవరాగం

- డా.భవానీదేవి

టక్.. టక్.. టకాటక్... టక్ టక్...

    టైపు రైటర్ మీద నాట్యం చేస్తున్న ప్రియాంక చేతివేళ్ళు ముచ్చటగా అన్పిస్తున్నాయి ప్రకాశరావుకు.

    ప్రియాంక మాత్రం తల తిప్పి ఎటూ చూడటం లేదు. పని మీదే పూర్తి ఏకాగ్రతంతా! ఆ అమ్మాయికి తనలాగా సమస్యలేవీ లేవు అనుకోటానికీ వీల్లేదు. అయినా ఆఫీసు పని విషయంలో మాత్రం శ్రద్ధ చూపించటం చూస్తే ఎవరికయినా ప్రియాంక అంటే పూర్తి గౌరవభావం కలుగుతుంది. ఆ అమ్మాయి కేసి చూస్తుండిపోయాడు ప్రకాశరావు.

    చామన ఛాయ, ఒక మాదిరి పొడవు, విశాలమైన అందమైన కళ్ళు, సన్నని పెదవులు. పెద్ద అందగత్తె అనిపించదు. కానీ ఆకర్షణ మాత్రం ఆ నవ్వులోనే ఉంది. స్వచ్చమైన పాలమీది మీగడలా పసిపిల్లలా ముగ్ధంగా నవ్వుతుంది.

    ఆ నవ్వుకు మాత్రం ప్రకాశరావు మనసు దూదిపింజలా తేలిపోతుంది. హృదయ భారమంతా కరిగిపోయి శరత్కాలంలో వెన్నెల నిండినట్లవుతుంది. ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా ఆమె నవ్వు చూడకపోతే ఎలా అనే దిగులు!

    ప్రియాంక దేనికోసమో ఓ క్షణం టైపు చేయటం ఆపి పక్కకి తిరిగింది. టేబుల్ మీది పేపర్ వెయిట్ ను సరిగ్గా జరుపుతూ అప్రయత్నంగా కళ్ళు తిప్పి చూసింది. తనవైపే తదేకంగా చూస్తున్న ప్రకాశరావును చూసి ఓ నవ్వు గులాబీ హాసంలా విసిరి మళ్ళీ పనిలో నిమగ్నమయింది.

    వెన్నెల కిరణం సూటిగా వచ్చి తాకినట్లయింది. ఇంక అతని మనసు పనిమీద లగ్నం కావటం లేదు .ప్రియాంక అంత హాయిగా ఎలా నవ్వగల్గుతుంది! చూచాయగా ఆఫీసు వాళ్ళు అనుకుంటుంటే విన్నాడు. ఆమె చుట్టూ ఎన్నో ముళ్ళ కుంచెలున్నాయని... ఆ కుటుంబానికి ఆమే ఆధారమని.. మళ్ళీ మనసునిండా దిగులు కమ్ముకుంది.

    "ప్రియాంక తండ్రి బాగా బతికిన వాడనీ, పూర్వీకుల ఆస్తి వందెకరాల దాకా ఉండేదనీ, మితిమీరిన వ్యసనాల వల్ల ఆస్తి హారతి కర్పూరంలా హరించుకు పోయిందనీ..."

    ఆఫీసు వాళ్ళు కష్టపడి సేకరించిన సమాచారం ఇంకా చాలా ఉంది.

    ప్రియాంకకు చాలా సినిమా కష్టాలున్నాయట. వాళ్ళమ్మ గుండెజబ్బు మనిషి. పెళ్ళికి ఎదిగి కళ్ళతోనే ప్రశ్నిస్తున్న చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు, ఇలా... ఇన్ని బాధ్యతల్నీ, భారాలనూ గుండెల్లో దాచుకుని చాలీచాలని జీతంతో చిరునవ్వులు చిందిస్తూ పనిలో కూడా అంత ఏకాగ్రత చూపటం ప్రియాంకకు ఎలా సాధ్యం! ప్రకాశరావుకు అస్సలు అర్ధంకాని ప్రశ్న ఇదే! టైపు చేయటం పూర్తయినట్లుంది.

    సన్నని వేళ్ళతో మిషన్ మీది కాయితాలన్నీ తీసి సీట్లో కూర్చొని సరిచూసుకుంటోంది ప్రియాంక. ఆమె పెదవుల మీద పారిజాతం మొగ్గ విరియబోతున్నట్లు అదే నవ్వు!

    "హలో...బ్రదర్... టీకి వస్తారా"

    ముత్యాలరావు చెయ్యి భుజం మీద పడటంతో ఉలిక్కిపడ్డాడు ప్రకాశరావు.

    'ఆ! పదండి' మొహమాటంగానే లేచాడు. ప్రియాంక తలెత్తటం లేదు. ఆమె నవ్వు మరోసారి చూద్దామనుకున్న ప్రకాశరావుకు నిరాశ మిగిలింది. ముత్యాలరావుతో కలసి అయిష్టంగానే క్యాంటిన్ వైపు నడిచాడు.

    ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికి బయల్దేరిన ప్రకాశరావుకు గుండె నిండా దిగులు గుబులు.

    రోజూ దాదాపు ఇలాగే ఉంటుంది. కానీ ఇవ్వాళ మరీ దిగులుగా ఉంది.

    గుమ్మంలో దుర్గ కాళికా రూపాన్ని ఊహించుకుంటేనే గుండెల్లో దడగా ఉంది.

    పదిహేను రోజులుగా భార్య కోరిన శ్రావణ మాసపు పట్టుచీర కొనాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంక రేపు వరలక్ష్మి వ్రతం. దుర్గ బతకనిస్తుందా! అప్పు కూడా ఎవరిస్తారు? పట్టుచీర అంటే మూడు వేలయినా కావాలి. 'మన కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఇదీ' అని దుర్గకు బుజ్జగించి చెప్పినా అర్ధమయి చావదు. మనసులోనే భార్యపై చిరాకుపడ్డాడు.

    ఇక తప్పదన్నట్లు జేబుల్ మీది కాయితాలన్నీ సర్దేశాడు. ఫైల్స్ మూసేసి, జేబులోంచి కర్చీఫ్ తీసి గట్టిగా ఓసారి మొహం తుడుచుకున్నాడు.

    ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకోక తప్పదు. అటూ ఇటూ చూశాడు. అంతా జారుకున్నారు. ప్రియాంక కూడా వర్క్ క్లోజ్ చేసి హ్యాండ్ బ్యాగ్ లో లంచ్ బాక్సు సరిచేసుకుంటోంది. మనసు కూడదీసుకుని ధైర్యం చేశాడు.

    'ప్రియాంక గారూ!'

    చురుగ్గా చూసిందామె. కళ్ళతోనే ఏమిటన్న ప్రశ్న!

    'మీతో కొంచెం మాట్లాడాలి.'

    'మాట్లాడండి.... ఏమిటి ప్రాబ్లం' సానుభూతిగా అడిగింది.

    ఆ సానుభూతినే అతను భరించలేకపోతున్నాడు.
ఫ    'ఇక్కడ కాదు. అలా ట్యాంక్ బండ్ మీదికెళ్దాం' అన్నాడేగానీ బిక్కుబిక్కు మంటున్నాడు. ప్రియాంక సమాధానం ఏమిటో తెలిసేదాకా ప్రతిక్షణం నరకమే! ఈడ్చి తన చెంపమీద కొడితేనో! భయం వేసింది.

    'పదండి' చల్లగా నవ్వింది.

    మనసులోకి కొత్త శక్తి ప్రవేశించినట్లయింది.

    ఇద్దరూ ట్యాంక్ బండ్ వైపు నడుస్తున్నారు మౌనంగా. ఒకరిద్దరు తెల్సిన వాళ్ళు కన్పించి విడివిడిగా విష్ చేశారు. ఇద్దరూ తిరిగి వాళ్ళకి విష్ చేశారు గానీ మాట్లాడుకోలేదు. మరికొందరు తెల్సినవాళ్ళు ఇద్దర్నీ విచిత్రంగా చూస్తూనే వెళ్ళిపోయారు.

    టాంక్ బండ్ మీద అంతగా జన సంచారం లేని చోటు చూసుకొని ఓ బెంచ్ మీద కూర్చున్నారు.

    గాలికి ఎగిరిపడే ముంగురుల్ని సరిచేసుకుంటూ హుస్సేన్ సాగర్ లోని అలలకేసి చూస్తుంది ప్రియాంక. గాలికి ఎగిరే కొంగును చుట్టూ తిప్పి భుజాల మీదుగా కప్పుకుంది.

    ఈమెలో ఎంతటి ప్రశాంతత! మరొకరైతే ఇలా రమ్మన్నందుకు ఎన్ని అపార్ధాలో! ఎవరో ఎందుకు. దుర్గకీ సంగతి తెలిస్తే!

    అమ్మో! గుండెలు గుబగుబలాడాయి.

    అలలమీంచి తేలివస్తూ అపర కాళిలా దుర్గే కన్పిస్తోంది.

    అసలు బుద్ధుడి విగ్రహం బదులు... తన భార్య విగ్రహం పెట్టేస్తే హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకునే ధైర్యం ఎవ్వరికీ ఉండదేమో!

    తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది ప్రకాశరావుకు. అతన్ని చూస్తే ఆమెకు చిత్రంగా అన్పిస్తోంది. తనతో మాట్లాడాలని. ఇంత దూరం పిలిచి ఈ మౌనం... గాంభీర్యం... అసభ్యంగానూ ప్రవర్తించడు... తనపట్ల గల గౌరవం, ఆరాధన... స్పష్టంగా ఆ కళ్ళే చెప్తాయి. నలిగిన బట్టలు, దైన్యమైన చూపులు ఏదో పోగొట్టుకున్నట్లు. తెలివైన వాడే! పనిలో మనసు పెట్టకుండా ఆఫీసర్ చేత తిట్లు తింటుంటే తనే అతనికి సాయం చేస్తుంది. చిన్నపిల్లాడిలా సంతోషపడతాడు.  

    ఇంకా ఎంత సేపిలా... కాలం హెచ్చరిస్తోంది.

    'చెప్పండి' సూటిగా ధ్వనించిన ఆమె స్వరానికి ఉలిక్కిపడ్డాడు.

    "మా ఆవిడ...అదే...దుర్గ..." నాన్చాడు నీళ్ళు నములుతూ.

    "విషయం ఏమిటి?" కొద్దిగా విసుక్కున్నట్లుగా అంది.

    "రేపు వరలక్ష్మీ వ్రతానికి పట్టుచీర కొనాలి. మూడు వేలు అప్పిస్తే మెల్లగా తీర్చేస్తాను. మీరు జి.పి.యఫ్ లోను తీసుకున్నారని అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతేనే" గబగబా చెప్పేసి చివర్లో నసిగాడు.

    "అప్పు చేసి కొనాలా! మీ దగ్గర డబ్బుల్లేవని మీ భార్యకు చెప్పారా!"

    దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడాడతను.

    "చెప్పలేదు. చెప్పినా అర్ధం చేసుకోదు. గొడవ చేస్తుంది" నిట్టూర్చాడు.

    జాలిగా చూసింది.

    ఈ మాట కోసం ఇంతదూరం రావాలా! అన్న భావన మెదిలింది ఆమెలో. కాని పెదవి దాటి పదం కాలేకపోయింది.

    "లోన్స్ ఏవీ రావా?" అడిగింది ఆలోచిస్తూ.

    తల అడ్డంగా ఊపాడు.

    "నేనివ్వగలను కానీ ఇలా అప్పులు చేసి ఆమె కోరికలు తీర్చటం వల్ల మీ చుట్టూ ముళ్ళు ఇంకా బిగుసుకుంటాయి. మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించి మీ భార్యతో చర్చించండి. నచ్చజెప్పండి. మీ సమస్యల్లో ఆమెనూ భాగస్వామిని చేయండి."

    బ్యాగ్ లోంచి మూడు వేలు తీసి లెక్కపెట్టి ఇచ్చింది.

    రెండు నెలలలోపు తిరిగి ఇవ్వాలి! ఖచ్చితంగా అంది.

    అతను డబ్బు చేతిలో పట్టుకొని కృతజ్ఞతగా చూసి మహాద్భాగ్యంగా 'సరే' అన్నట్లు తలూపాడు. బస్సేదో ఆగింది. ఆమె సెలవు తీసుకొని వడివడిగా బస్సెక్కి కదిలిపోయింది.

    ఆనాటి సంఘటన అతని జీవితాన్ని మరింతగా ప్రభావితం చేసింది.

    మగవాడి జీతం గురించి భార్యకి తెలియకూడదనీ, ఆమెకి కావలసిన సౌకర్యాలు సంపాదించి పెట్టటమే అతని పని అనే భావజాలంలో పడికొట్టుకుంటూ, కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించిన అవగాహన లేకుండా, అసలు పట్టించుకోకుండా కోరికల పర్వతాలెక్కలేక, తనతోపాటు భర్త జీవితాన్ని నరకప్రాయం చేసే భార్యలూ, వారినలా అజ్ఞానంలోనే మగ్గబెట్టే భర్తలూ ఉన్నారు. భార్యతో తన జీతం గురించి చెప్పటం, కుటుంబ ఖర్చుల గురించి చర్చించటం చిన్నతనంగా భావించే భర్తలున్న ఈ వ్యవస్థలో భార్యకి ఆమె బాధ్యతను విడమర్చి చెప్పేదెవరు?

    ప్రకాశరావు ఆలోచనా లోచనాలు విప్పార్చుకుని చూస్తున్నాయి. దుర్గకి తన జీతం, ఇంటి ఖర్చుల గురించి అర్ధమయేలా మెల్లమెల్లగా చెప్పసాగాడు.

    ఆడవాళ్ళ వయసు. మగవాళ్ళ జీతాన్ని ప్రశ్నించరాదన్న నిర్ణయం దుర్గలో సడలిపోతున్నది.

    "నాక్కావల్సింది. కొనటం మీ బాధ్యత" అనే దుర్గ ఆలోచనలు మారిపోతున్నాయి. భర్త ఆదాయం గురించి అతని కష్టసుఖాల గురించి పట్టించుకొని ఇంటి ఖర్చులో పొదుపు చేయటాన్ని అలవాటు చేసుకుంటున్నది.

    "ఆ వస్తువు ఇప్పుడొద్దు లెండి. వచ్చేనెల చూద్దాం" అనటం మొదలుపెట్టిన దుర్గకేసి ఆశ్చర్యంగా అభిమానంగా చూస్తున్నాడు ప్రకాశరావు.

    ప్రియాంక సలహా తమ కుటుంబంలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఆమెతో స్నేహం తన జీవితంలో సరికొత్త ద్వారాలను తెరిచింది.

    "అన్నీ నీకు చెప్పాలా! ప్రతి పైసా ఖర్చు గురించి ఆడవాళ్ళకు చెప్పటం, మా ఇంటా వంటా లేదు. ఆడపెత్తనం చేయటానికి నేనొప్పుకోను..." లాంటి మాటలకి దూరంగా, ఆ ఇంట్లో ఆరోగ్యకరమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి.

    "ఆడవాళ్ళకేం తెలుసు. వాళ్ళకి ఉద్యోగాలిస్తే ధ్యాసంతా ఇంటి మీదే! పని సరిగ్గా చేయరు అనేవాళ్ళు, తేలిగ్గా మాట్లాడేవాళ్ళు ప్రియాంకను చూస్తే ఎన్నటికీ అనుకోలేరు" అనుకున్నాడు ప్రకాశరావు.

    "మీరు చిన్న చిన్న చేబదుళ్లు తగ్గించాలి" ప్రియాంక సలహా ఇచ్చిందతనికి ఒకరోజు.

    ఆమె పెదవులపై విసిరిన హాసం చూస్తూ 'నిజమే' నిజాయితీగా అంగీకరించాడు.

    "నన్నడిగారని కాదు. అలా అడగటం వల్ల ఆఫీసులో చీప్ అయిపోతారు." ప్రియాంక ఎనలైజ్ చేసింది. క్రమంగా ప్రకాశరావులో చాలా మార్పు కన్పిస్తోంది. చిన్నచిన్న అప్పులు తీర్చేశాడు. అతికష్టం మీద సిగరెట్లు తాగటం మానేశాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూతురికి చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ పాప గుండెల్లో పొంగే ఆనందం ముందు సిగరెట్ తాగే ఆనందం ఏపాటిది అన్పిస్తోంది. ఇస్త్రీ బట్టలతో సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు... పని తీరు కూడా మెరుగ్గా ఉంది.

    ఆఫీసు స్టాఫ్ కి ప్రకాశరావులో వచ్చిన మార్పు నచ్చటంలేదు. ప్రియాంకతో అతని స్నేహానికి కొత్త రంగులు అద్దారు. భాష్యాలు చెప్తున్నారు. ఇంకా ప్రకాశరావు చెవిదాకా సోకలేదవి.

    "సాయంత్రం ఓసారి మా యింటికి వస్తావా" ఎన్నడూ లేనిది ప్రియాంక హఠాత్తుగా అతన్ని ఆహ్వానించింది. ముందే ఆవిడ గుర్తులు చెప్పేసింది గాబట్టి ఇంటి అడ్రస్ కనుక్కోవటం పెద్ద కష్టమేం కాలేదు.
     
    రామ్ నగర్ లో మెయిన్ రోడ్డుకు కొంచెం లోపలిగా పొందికగా... చిన్న ఇల్లు ఆధునికంగా ఉండే సౌకర్యాలేమీ లేకపోయినా హాయిగా అన్పిస్తోంది. ముందున్న కొద్ది జాగాలోనే గులాబీ మొక్కలు పూలతో... ఆకర్షణీయంగా.

    "రండి కూర్చోండి...!! ఆహ్వానించింది ప్రియాంక నవ్వుతూ. ఆఫీసులో అంత పనిచేసినా ఫ్రెష్ గా కన్పిస్తోంది.

    ప్రకాశరావును చెల్లెలికీ, తల్లికీ, తమ్ముడికీ పరిచయం చేసింది. తండ్రి మరణం వల్ల ఇంటి బాధ్యత ఆమె తీసుకుంది. ఒక గంటసేపు ఆ ఇంట్లో గడిపితే అతనికి అర్ధమయింది. అమృతం తాగినంత శక్తి వచ్చింది ప్రకాశరావుకు.

    అసంతృప్తి, నిరాశలు మనిషిని ఇంకా కుంగదీస్తాయి. జీవితం పట్ల అవగాహనతో ఎన్ని సమస్యలున్నా అన్ని పరిష్కారాలూ ఉంటాయన్న నమ్మకంతో కృషి చేస్తే ఇక వేదనకి చోటేముంటుంది.

    ప్రియాంక పట్ల ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ చూపించే ప్రేమ, అనుబంధం ఆమెకు జీవన సమరానికి కావలసిన శక్తినిస్తున్నాయి. ఆత్మస్థైర్యంతో ఆమె ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తోంది.

    ప్రకాశరావుకు చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్లుంది. నా అనుకున్నవారి అనురాగం, ఆప్యాయతలు, అండదండలుంటే ఎన్ని కష్టాలైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. రంగులు పులిమే కుసంస్కారులను పట్టించుకోనక్కర్లేదు. ఇంటిదారి పట్టిన ప్రకాశరావు మనసు పచ్చని పంట చేనులా నాట్యమాడుతూ నవరాగాన్ని ఆలపిస్తోంది.