Facebook Twitter
ఇంగలంతో - శారదా అశోకవర్ధన్

ఇంగలంతో


- శారదాఅశోకవర్ధన్

 

'జెన్నత్ 'నుంచి అల్లా దిగొచ్చినా

'వైకుంఠం'నుంచి విష్ణువు నడిచోచ్చినా

'పరలోకం'నుండి జీసెస్ తిరిగొచ్చినా

వారి పేరిట మనుషులు చేసే

 

కరాళనృత్యాలను చూసి కన్నీరు పెట్టక మానరు

మతాల పేరిట మారణహొమాల

మంటలు చూసి

గతుక్కుమంటూ విచారించకపోరు!

హితం కానీ మతం కోసం

బతుకు కట్టే సమాధులు చూసి

వికృత చేష్టల వినోదాలు చూసి

శోకించక మానరు!

మనిషి! ఎందుకు ఏరంత పారే

నీ ఆలోచనా తరంగాలను

అవని అంత విసృతం చేసుకుని

హాయిగా జీవించక

తెల్లని కాగితంలాంటి మనసుమీద

విషాన్ని చిలికించుకొంటావ్

నీకు నువ్వే గిరిగీసుకుని కుంచించుకుపోతూ

చిన్న గూటిలో వుంటానంటావ్?

కాలం ఆగదు నీకోసం

గాలం వేసి పట్టలన్నా

అరచేత్తో బంధించి అపాలన్నా

కనపడకుండానే జారిపోయి పారిపోతుంది

కాలాన్ని కదలనివ్వకుండా కాపలా కాసినా

కరిగిపోతుంది

నీ మార్గం మార్చుకో మనిషి

నీ మేధకు పదును పెట్టి మనీషిగా మారు

కలాతితుడై కాలంతో చెయ్యి కలుపు

మబ్బుల కడలిలో మెరుపుల వెలుగును

ముతగట్టుకో

మానవతను పెంచుకుని ఈ ప్రపంచాన్ని

స్వర్గంగా మార్చుకో

స్వర్గమంటే ఇరుకు బతుకుల

నేతల కదలే

దాన్ని ఇంగలంతో తుడిచిపారెయ్