Facebook Twitter
అక్షరం - నేను

అక్షరం - నేను

- డా. ఎ. రవీంద్రబాబు

 

  
అక్షరం ముందు నేనెప్పుడూ
          ఓడిపోతూనే ఉంటాను.
అక్షరం వెలుగులో
          కాలిపోతూనే ఉంటాను.
అక్షరమే నేనై మరణానికి
          దగ్గరవుతూ ఉంటాను.
             
అయినా...
అక్షరాన్ని ప్రేమగా లాలిస్తాను.
ఆలోచనల అన్నం పెట్టి భావాలతో బుజ్జగిస్తాను.
స్నేహంగా నడిపించి ప్రవాహంలా పరిగెత్తిస్తాను.
ఒడిలో పడుకోబెట్టుకుని లాలనగా స్పరిస్తాను.
ఊహల దుస్తులు తొడిగి భ్రమల లోకాల్లో విహరింపజేస్తాను.
వాస్తవంగా నేలపై ఆటలాడిస్తాను.
చివరకు అక్షరాన్ని ఆప్యాయంగా అక్కున జేర్చుకుంటాను.
              
అయినా అక్షరం....
నాపై దాడిచేస్తుంది.
నిస్సహాయుడిని చేసి నవ్వేస్తుంది.
స్వైర విహారం చేస్తూ తెగ సంబరపడిపోతుంది
దహించేస్తూ... దగాచేస్తూ...
దాదాగిరి చేస్తూ... దర్జాగా బతికేస్తుంది.
ఏ అర్థరాత్రో తటిల్లతా కౌగిలించుకుంటుంది.

నగ్నంగా... నిర్భయంగా... భయంకరంగా...
ఉక్కిరి బిక్కిర చేసి ఊపిరి తీయాలనుకుంటుంది.
అప్పుడు నేను నిట్టూర్పులు విడుస్తూ...
అర్థ నిమీలిత నేత్రాల కాంతులతో
కాలి బూడిదై పోతాను.
చివరకు నేనే అక్షరాన్నై... ఆవిష్కృతమవుతాను.
అక్షరమే నేనై... ఆనంద తత్త్వాన్ని పొందుతాను.
అలా... అలా... అలా...
సంతోషంలో... నేను.
నా... అక్షరం.
              
అందుకే...
అక్షరం ముందు
మళ్లీ మళ్లీ ఓడిపోవాలనుకుంటాను
ఆ ఆకృతిలో లీనమై కరిపోవాలనుకుంటాను.
ఆ రస రమ్య లోకాల్లో రాలిపోవాలనుకుంటాను.
అసలు... అక్షరమంటే...!
అక్షరమంటే...!!
క్షరమంటే...!!!
రమంటే...!!!
మంటే...!!!!
టే...!!!! ?