నీడలు
నీడలు
- డా.సి. భవానీదేవి

నీడలు నీడలు
చుట్టూ రంగు రంగుల నీడలు
అస్పష్ట రూప భ్రమణాలు
లోతుగా ఆ కళ్ళలోకి చూడు
అసూయను పుత్కరిస్తుంది
పెదాలు సాగదీసి ఎలా నవ్వుతుందో !
ఆ వెక్కిరింత
విశాల మైదానమంత
ఈ చూపుల పరిధిలో
చిరంతనాశ్రువుల జల్లులు
నడకలోని నైరాశ్యం
పరివ్యాప్త దుఃఖ సముద్రాన్ని
నిశబ్దంగా మింగేస్తుంది
నన్ను రాసుకుంటూ వెళ్ళే మరోనీడ
ఇంకా వ్యక్తిత్వం విచ్చుకోని మొగ్గ
తడవని ప్రేమ చినుకులా
ఉరికే సెలయేటి ప్రవాహంలాగా
నాకే అర్ధం కాని నా నీడ మాత్రం
మెల్ల మెల్లగా నా నుంచి
దూరంగా జరిగిపోతుంది
ఇప్పుడు నేనొక నీడ లేని మనిషిని
నడిచే ఓ నీడని !



