Facebook Twitter
పుడమి తల్లి పదాలు -2 - పి. నీరజ

పుడమి తల్లి పదాలు -2


- పి. నీరజ

 

వార కాంతల చెలిమి

తాగు బోతుల చెలిమి

మండు నిప్పుల కొలిమి

ఓ పుడమితల్లి

 

పెరిగె డీసిల్ విలువ

పెరిగె పెట్రోల్ విలువ

తరిగె రూపీ విలువ

ఓ పుడమితల్లి

 

కాంతులందరి నోట

వాసుదేవుని మాట

ప్రేమకదియే బాట

ఓ పుడమితల్లి

 

లేని గొప్పలు పోయి

ఆస్తి చేసెను గోయి

అయ్యె అప్పులు వేయి

ఓ పుడమితల్లి

 

ఆత్మవంచన తగదు

ఆత్మనుతియా వలదు

మనకు పరువే నగదు

ఓ పుడమితల్లి

 

వయసు ఉన్నను కాని

మాట మన్నన లేని

నరుని కలిసిన హాని

ఓ పుడమితల్లి

 

చిన్ని పాపల నవ్వు

పరిమళంబుల పువ్వు

మనకు అదియే లవ్వు

ఓ పుడమితల్లి

 

ఒంటరితనము తోడి

బతుకు గడుపుట వీడి

మెలగు సంఘము తోడి

ఓ పుడమితల్లి

 

అంధకారపు పొరలు

తొలగినపుడే మేలు

ముక్తికదియే మొదలు

ఓ పుడమితల్లి

 

మనసు కలిసిన చెలిమి

కాదు ఎన్నడు కొలిమి

అదియె మనకును కలిమి

ఓ పుడమితల్లి

 

రెండు నాల్కల వాని

అతిగ పోగిడెడి వాని

నమ్మి యుండుట హాని

ఓ పుడమితల్లి

 

కష్ట కాలము లోను

కాచె కౌంతేయులను

కేశవుడు ఇలలోను

ఓ పుడమితల్లి

 

నిండి వున్నయి రేయి

మనసు కెంతో ఎంతో హాయి

వెతలు తీరుచు నోయి

ఓ పుడమితల్లి

 

ముసలి తనయున హజము

ముప్పు తెచ్చుట నిజము

మార్పు కొనుమభితము

ఓ పుడమితల్లి

 

ఆంగ్లేయులానాడు

దేశీయులీనాడు

స్వేచ్చ లేదేనాడు

ఓ పుడమితల్లి

 

ఆలి వైనను కాలు

విసరు చండెడి పూలు

విషయము చిందేడి తేలు

ఓ పుడమితల్లి

 

ఇంటి యందలి పనులు

చక్కదిద్దెడి ఘనులు

ఇంటిలోని స్త్రీలు

ఓ పుడమితల్లి

 

భీతితోడను మనము

బతుకు గడిపిన విధము

మరచి పోయిన సుఖము

ఓ పుడమితల్లి

 

అధిక సంతతి తగదు

ఇద్దరుండిన నగదు

అంత కంటే వలదు

ఓ పుడమితల్లి

 

జీవనదులకు నెలవు

పాడిపంటల తరువు

అయినా వున్నది కరువు

ఓ పుడమితల్లి