Facebook Twitter
అంకితం - పి. నీరజ

అంకితం


- పి. నీరజ

 

ఎల్లరను నీ కరుణతో

చల్లగ చూచేటి విశ్వసాక్షిణి, కూర్చిన్

అల్లీ ఈ శతకంబున

తల్లీ గైకొను పదాలు దయతోనమ్మా.

 

పుడమి తల్లి పదాలు

 

కడలి దాటిన ఘనుడు

కాల్చె లంకను అప్తుడు

అతడు అంజని సుతుడు

ఓ పుడమి తల్లి

 

ళను నమ్మినవాడు

ఇలను నమ్మినవాడు

ఎన్నడూ చెడిపోడు

ఓ పుడమి తల్లి

 

రుణతోడను మనము

మెలగినపుడే సుఖము

మంచి జరుగును నిజమే

ఓ పుడమి తల్లి

 

మనసు తెలియని మగడు

కష్టపెట్టెడి ఘనుడు

ఆలి పాలిట యముడు

ఓ పుడమి తల్లి

 

రాజకీయ హవాల

దేశమునకు దివాల

జనులు అది మరువాల

ఓ పుడమి తల్లి

 

ఆడి తప్పిన వాని

అప్పు తీర్చని వాని

నమ్మియుండుట హాని

ఓ పుడమి తల్లి

 

కష్ట కాలము నందు

కలిసి యుండెడి పొందు

ధరణిలో కను విందు

ఓ పుడమి తల్లి

 

ఎరుపు సొమ్ములు బరువు

చేయకెన్నడు అరువు

అదియే నీకును పరువు

ఓ పుడమి తల్లి

 

ధరణి పుత్రిక సీత

గీత దాటుట చేత

అట్లు అయ్యెను రాత

ఓ పుడమి తల్లి

 

ఆలు బిడ్డలు విడచి

అన్యకాంతను వలచి

తిరుగు వానితో పేచి

ఓ పుడమి తల్లి