Facebook Twitter
తాతయ్య పెళ్ళిరోజు

      తాతయ్య పెళ్ళిరోజు

- శ్రీమతి శారదఅశోకవర్ధన్

మామ్మకి తాతయ్యంటే ఎంతో ఇష్టం!
    తాతయ్యకి మామ్మంటే పంచదార
    చలకలకన్నా ప్రాణం! పండు మిరప పచ్చడికన్నా పరమఇష్టం!
    గతాన్ని రోజుకు ఒకసారైనా నెమరు వేసుకుంటారు
    సర్వాన్నీ మరచి నా గొడవల గురించి దెబ్బ లాడుకుంటారు
    మరి మొహాలు చూసుకోనంతగా  వాదులాడుకుంటారు
    కళ్లూ ముక్కూ కాలువ కట్టి మున్సిపాలిటీ తొంగిచూడని
    మురికి బస్తీల్లా అవుతుంది మామ్మ మొహం!
    బస్తీనంతా హడలగొట్టి బలాదూర్ తిరిగే రౌడిలా వుంటుంది తాతయ్య వైనం
    మామ్మ ముక్కెర మీద విరుచుకు పడతాడు తాతయ్య
    'పశువు ముక్కుకు తాడేసి లాగినట్టుంది నీ ముక్కెర' అంటాడు
    మామ్మ వాళ్లూ మండి ఏవగించుకుంటుంది తాతయ్య బొద్దు మీసాల్ని!

    వయస్సు మళ్లీనా రంగు పూసిన ఆ మీసాలు
    బొద్దెంకల్లా వున్నాయంటుంది.
    మామ్మకి బొద్దెంకంటే భయమైనా
    మీసాలని బొద్దెంకలవగానే
    మెల్లగా కఱ్ఱపట్టుకుని లేచి మామ్మమీదికొస్తాడు
    కొట్టడానికి కాదు. ముద్దు పెట్టుకోవడానికి తాతయ్య
    'బొద్దెంక మీసాలు నా దగ్గరికి రావొద్దు'
    భయపడి పోతుంది మామ్మ నిజంగానే
    వాటిని బొద్దెంకల్లా ఊహించుకుని!
    'ముక్కెర పట్టి లాగి మరీ' ముద్దెట్టుకుంటాను
    మూతి కడ్డంగా ముక్కెరెందుకో!
    తాతయ్య మామ్మకు దగ్గరగా వెళ్లబోతాడు
    మామ్మ భయపడిపోయి
    నా వెనకాలే దాక్కుంటుంది
    అడ్డు జరగొద్దని నన్ను బతిమాలుకుంటుంది
    తాతయ్య నన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు
    ముసి ముసిగా నవ్వుకుంటాడు
    మామ్మ ముసిముసిగా నవ్వుకుంటుంది.
    ఆరోజు తాతయ్య పెళ్ళిరోజట!!

    నాన్నా అమ్మా డబ్బిచ్చారు కొత్త బట్టలూ కొన్నారూ.
    'కాస్త మీసాలరంగు తెచ్చి పెట్టకూడదు బాబూ అంది మామ్మ
    నౌకరు రంగడితో__
    తాతయ్య వెళ్ళొచ్చాడు ఎటో ఆటోలో!
    మూడు ముత్యాల గుత్తి కొన్నాడు.
    ముక్కెరకి తగిలిస్తే ఇంకా అందంగా వుంటుందని
    ఇద్దరూ కలుసుకున్నారు భోజనాల దగ్గర.
    ఆశ్చర్యంతో నోరు తెరిచారు!!
    'బొద్దెంకల్లాంటి  మీసాలు నీకు ఇష్టంలేదని తీయించేశా!'
    మెల్లగా నవ్వుతూ అన్నాడు తాతయ్య
    'పశువుకు కట్టినట్టున్న  ముక్కెర మీకు
    నచ్చలేదని మార్పించేశా!'
    బోసినోటితో  పకపకా నవ్వింది మామ్మ.
    'హాయిగా ముద్దెట్టుకోవచ్చులే
    మీసం బాధా ముక్కెర గొడవా లేదు'
    అన్నాడు మామ్మ దగ్గరగా జరిగి తాతయ్య
    నా వెనకాలే దాక్కుంది మామ్మ
    అడ్డు జరగొద్దని బతిమాలుకుంది.
    మామ్మా తాతయ్యల దొంగాటలకి
    నేనే తల్లిని!
    వారి దెబ్బలాటలకి నేనే న్యాయవాదిని!
    వారి ప్రణయ లీలలకి నేనే సాక్షిని!
    'ఈసారి దెబ్బలాడితే తాతయ్యని ఏమంటుందో
    మామ్మ? చూడాలి!
    మరి తాతయ్యేమంటాడో మామ్మని? వినాలి!
    మీసాలూ, ముక్కెరా లేవుగా' అనుకున్నాను.
    ఆరోజూ వొచ్చింది!
    దెబ్బలాటా వొచ్చింది!
    'నిక్షేపంలాంటి ముక్కెర మార్చి పారేశావ్!
    నీ మొహం చూడబుద్ది కావడం లేదు'
    కసిరాడు తాతయ్య.
    'సంపెంగపూవుల్లాంటి  లక్షణమైన మీసాలు
    తీసి పారేశారు' విసుక్కుంది మామ్మ
    'పోనీలే మామ్మా నీ ముద్దికి అడ్డులేదుగా' అన్నాను.
    'ఓరి భడవా! అచ్చు తాతయ్య పోలికే'
    కౌగిలించుకుంది మామ్మ.
    'ఆరిపిడుగా! అన్నీ మామ్మ మాటలే'
    ముద్దెట్టుకున్నాడు తాతయ్య
    వారి కళ్ళలో కాంతి!
    వారి మనసుల్లో శాంతి!
    వారి పోట్లాటల్లో హాస్యం!
    వారి వాదులాటల్లో లాస్యం!
    అది చెరగని తరగని దరహాసం
    మనిషికి సగం బలం మందహాసం!

    బతుకంతా బాధే అయితే
    బతకడమెలా సాధ్యం?

    కష్ట సుఖాలు దైవాధీనం
    అరికట్టడం ఎవరి తరం?

    'ఆటలో అరిటి పండు'లా జీవితం
    గడిపెయ్యడమే ఒక వరం!

    అనుకుంటేనే వుంది సుఖం
    అందులోనే వుంది ఆనందం!