ఈ లోకం నాకోసం ఏం చేసింది
శ్రీమతి శారద అశోకవర్ధన్

ఈ లోకం నాకోసం ఏం చేసింది?
నా కోసం ఈ జగం ఏం చేస్తుంది?
కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తుంది!
పొల్లుమాటలు చెప్పి నన్ను మభ్యపెడుతుంది?
కడుపు నిండా తిని తిన్నదరుగక
'బ్రేవు' మని తేనుస్తూ
కాలే కడుపుల కిచ్చే పెద్దల కవితల్లాంటి
కన్నీటి ఉపన్యాసాలు
నా కడుపులో దేవుతూన్న
కల్లోలాన్ని ఆపగలవా?
పసిబిడ్డలు గుక్కెడు పాలకోసం
గుక్కపట్టి ఏడుస్తుంటే
కుర్రకుంకలు ఆకలిబాధ కోర్చుకోలేక
చెత్తకుండీలో గొప్పవాళ్ళు సగంతిని పారేసిన
ఎంగిలాకుల కోసం కుక్కలతో కుస్తీ పడుతూంటే
ఆ దృశ్యాన్ని పరదేశీయులు వినోదంగా
చిత్రాలు తీస్తుంటే
అది చూడలేక నా గుండెలు
ముక్కలు ముక్కలవుతూంటే
పాలకులు పాడే ప్రగతి జోలపాట
నా సంక్షోభాన్ని ఆపగలదా?
కట్ట బట్టలేక నిలువ నీడ లేక
తోటి ఆడపడుచులు కంట తడిపెడుతూంటే
సిగ్గుతో నా మనసు కుంచించుకు పోతూంటే
చలువ రాతి మేడల్లో వుంటూ
చక్కని కార్లలో తిరుగుతూ
మానభంగాల గురించి మహా ఇదైపోతూ
కమ్మని ఉపన్యాసాలు దంచే నాయకుల
తియ్యని మాటలు
నా బాధను బాపగలవా?
నా కళ్లల్లో కాంతి రేఖలు నింపలేని వెన్నెలలూ
నా గుండెలో మమత పండించలేని కోకిలలూ
నా కన్నీటికి కనికరించని తారకలూ
చలించని చలువ రేడూ
నా బాధలను గుర్తించని ఉదయ భానుడూ
నా ఉనికిని లక్ష్యపెట్టని అవనీ ఆకాశాలూ
మంచూ మబ్బూ కొండా కోనా పంచాభూతాలూ
ఏవైనా సరే నాకెందుకు?
వాటి గొప్పలు వినడమెందుకు?
నా గోడు ఈలోకంలో దేముడికీ ఒద్దేమో?
పలకకుండా రాయిగా నిలచిపోయాడు
భగవంతుడు సైతం
భజనలకు లొంగిపోయి భజన పరుల
కబంధ హస్తాలలో ఇరుక్కుపోయాడేమో?
చుట్టూ గుడి కట్టించుకుని కూర్చుండిపోయాడు.
ఇది కాదు ఈనాటి కధ!
ఏనాటి నుంచో జరుగుతున్న గాధ!
యుగ యుగాల చరిత్ర!
ధనికులు తీరిక వేళల్లో గానం చేసుకోవడానికి
ఉపకరించే గీతిక!
కలిమికీ లేమికీ మధ్యనున్న వైరం
నానాటికీ పెరుగుతోందేగాని
తరగడం లేదు ఈషణ్మాత్రం!
లేదు ఎన్నటికీ దీనికీ పరిష్కారం!
అందుకే అడుగుతున్నాను గొంతెత్తి
ఈలోకం నాకేమివ్వగలదని?
ఈ జగం నాకేమి చెయ్యగలదని?
ఎగసి పోతాను రెక్కలు కట్టుకుని
ఎగిరిపోతాను చైతన్యాన్ని వెతుక్కుని
ఆకలి నిద్రా క్షుద్బాధలేని లోకంలోకి!
ఈర్ష్యాసూయలు అగుపించని చోటికి
కలిమి లేములు కనిపించని వాడకి
నిత్యం వసంతం తాండవించే నీడకి!
ఆలోకం నా కోసం ఏమీ చెయ్యనక్కరలేదు
నా కోసం ఆ జగం కాస్తంత చోటుంచితే చాలు!
పారిపోవడం కాదు ఈ లోకం నుంచి నా ధ్యేయం
పిరికిగా కానిపించని చోటికి!
ఆ లోకం ఈ భూలోకం కావాలనేదే
నా లక్ష్యం!
అంతవరకూ ఈ ఆకలిపాట
ప్రతిచోటా పాడుతూనే ఉంటాను!
అపర శారదనై ప్రతి కవితలో
ఈ పలుకులు తెలుపుతూనే ఉంటాను!



