ఈ ఉదయం నా హృదయం ఆర్తితో అర్దిస్తోంది!
శ్రీమతి శారద అశోకవర్ధన్

ఏ పూర్వపుణ్యమో ఏ జన్మ సుకృతమో
ఈ ఉదయం నా హృదయం పరవశించి పాడుతోంది
ఈ దత్త కుటుంబపు తోటలో నేను సయితం
ఒక పుష్పాన్నై పూచినందుకు
ఈ సుందర సుగంధ సుమ గుచ్చాల నడుమ
విరిసి వికసించినందుకు!
ఈ ఉదయం నా హృదయం
పరవశించి పాడుతోంది!
రకరకాల పూవుల రంగురంగుల్లో పూచి
ఇంధ్ర ధనస్సులా ప్రజ్వరిల్లుతూంటే
కలకలలాడే ఈతోట కన్నుల పండుగచేస్తూ
మురిపించి మైమరపిస్తూ వుంటే
తోటంతా ఇంత అందంగా తీర్చిదిద్ది
నారు పోసి నీరుపోసి పెంచిన - ఆ
ఆనందమూర్తి పాదాల చెంత
రవ్వంత చోటు దొరికితేచాలని
తహతహలాడింది నా హృదయం
అట వెలసిన పరిమళ సుమ కదంబంలో
ఈ గడ్డిపూవుకు తావుంటుందో లేదోనని
గుబులు నిండిన మనస్సుని గుప్పెట్లో పట్టుకుని
దిక్కుతోచక దిగులు పడింది నా హృదయం!
తోటిపూవులు నడుమ కొలువు తీర్చిన
వారి అనుభవాలు వల్లిస్తూ వుంటే - ఆ
అమృతమూర్తి అద్భుత లీలలు వినిపిస్తూ వుంటే
తన్ను తాను మరచి పోయింది
తన్మయత్వంలో తేలిపోయింది నా హృదయం
ఆ కరుణామయని కనులారా తనివిదీర తిలకించాలనీ
ఆ తేజోమయని మనసారా ధ్యానించి జపించి
తపించి తరించి పోవాలనీ
ఉబలాట పడింది ఉవ్విళ్ళూరింది ఊపిరిని బిగబట్టి
ఆ పిలుపు కోసం చెవులు రిక్కపొడుచుకుని
కాచుకు కూర్చుంది నా హృదయం!
గడ్డి పూవుగ బుట్టినా గన్నేరై పూసినా
ఏముందీ గొప్ప తనం
వికసించి వాడి నేల రాలిపోవడమే తప్ప!
ఏ జవ్వని జడలోనో ఏ రసికుని ఒడిలోనో
నలిగి నశించడం తప్ప
విలువేముంది వాటికి
చెప్పుకోను కధ యేముంది?
గాలికెరిగి రాలినా ప్రత్యేకించి కోసినా
ఈ పవిత్రమూర్తి పాదాలపై వాలినప్పుడే
సంతరించుకుంటుంది ప్రత్యేకత
త్పప్తిగా తలెత్తుకు చూస్తుంది స్పష్టినంతా!
అందుకే అర్ధిస్తోంది చేతులు సాచి నా హృదయం
నిత్య నీరాజనాలందుకునే పాదాలపై
నిరంతరం నిలిచిపోవాలని
గగన పుష్పలా మెరుస్తూ!
గంభీరంగా వెలిగి పోవాలనీ
ఆర్తిలో అర్ధింస్తోంది నా హృదయం
ఆశలో నిరీక్షిస్తోంది నా హృదయం!



