Facebook Twitter
నా చరిత్ర

నా చరిత్ర

శ్రీమతి శారదా అశోకవర్ధన్

నా పుట్టుకే ఒక చరిత్ర
    ఈ ధరిత్రిపై సువర్ణ లిఖితమై
    నిలిచి వెలిగే పవిత్ర గాథ
    నా పుట్టుకే ఒక చరిత్ర.

    నేను పుట్టాలని తహ తహ లాడుతూ
    వేయికళ్ళతో  ఎదురు చూసే కొందరూ
    నన్ను అరికట్టాలని రుసరుస లాడుతూ
    కోటి ప్రయత్నాలు చేసిన మరికొందరూ
    అందరూ గిజగిజలాడుతూన్న  సమయంలో
    నేను పుట్టనే పుట్టేశాను
    నా చిరునవ్వుల ఊసులాటలతో
    అందరినీ మైమరపించాను.

    ఎవరిదారిన వారు నడిచే నా అన్న లిద్దరూ
    నేను పుట్టిన క్షణం నుంచి
    జతగా నడవడం నేర్చుకున్నారు
    పండగకీ పబ్బానికీ కలిసి
    నిండుగా నవ్వడం అలవాటు చేసుకున్నారు
    కలిమిలో కలలు పెంచుకుని
    లేమిలో కన్నీళ్ళు పంచుకుని
    ఏపుగా పెరిగారు
    చిరునవ్వుతో ఎదిగారు!
   
    ఏ ఖర్మ ఫలమో! ఏనోటి శాపమో !!
    ఆ మధ్యన వారి మధ్య ఏర్పడ్డ  పొరపొచ్చాలు
    నా గుండెను పిండేశాయి
    నా మనస్సును ముక్కలు  ముక్కలు చేశాయి.
    అయితే ఏం ?
    కుళ్ళుబోతుల కుతంత్రాలు ఫలించలేదు
    స్వార్ధపరుల  స్వప్నాలు నిజంకాలేదు.
    నా అన్నదమ్ముల అనుబంధాన్ని
    ఎవ్వరూ  తెంచలేకపోయారు
    వారి మధ్య అల్లుకుపోయిన
    అనురాగ లతలను తుంచలేకపోయారు.
    నా కళ్ళలో  విరిసింది కొత్తకాంతి
    నరనరాన ప్రవహించింది రక్తానికి బదులు శాంతి
    నలువైపుల నవరాగ చైతన్య మారుతం వీచింది
    మది మృదు మధుర మధుగీతి పాడింది.
    నా తెనుగువాడ, అందాలపూల మేడయై నిలిచింది
    నా ఎడదలో నావాకిటి ముంగిట్లో
    నవ్వినవి విద్యుద్దీప మాలికలు 

    నేడు ప్రతి ఊరున నిల్చినవి
    దీపావళిలా చీకట్లను పారద్రోలి
    దీపాల తోరణాలు.

    ప్రతి పౌరునికి విద్యామృతము
    త్రాపు చూన్నది సరస్వతి స్వయముగా
    ప్రతిశ్రామిక జీవికి, జీవితాశలు పండగా
    లక్ష్మియే దిగి వచ్చి పంచుతూన్నది
    ప్రజాస్వామ్య సంపద.

    ఊరూరా పాఠశాలలూ, ఉచిత విద్యా సౌకర్యాలూ
    ఆరోగ్యం, ఉద్యోగం, పొందగలిగే అవకాశాలు
    ఎన్నెన్నో వెలిశాయి, ఎల్లరినీ ఆహ్వానిస్తున్నాయి.
    భుజం భుజం తట్టి, చేయి చేయి కలిపి
    ప్రజాబలం సాగుతోంది
    సహకారం సమానత్వం మంగళగీతులు
    పాడుతోంది.

    కృష్ణవేణీ నదీ జలాల నిర్మించారు
    నాగార్జున సాగర మహాలయము
    కన్నుల విందుచేయు సౌందర్య నిలయమ్ము
    చీకటులు గూళ్ళు కట్టిన గుడిసెలలో
    ప్రగతి కాంతులు  వీచుచున్నవి
    లేమివొడిలో నిదురించిన పేదబతుకులలో
    కొత్త ఆశలు మొగ్గ తోడిగినవి.
    నేడు అడుగడుగున అగుపిస్తూన్నది
    జాతైక్యత, విశ్వప్రేమ కలిసి మెలిసి
    నవ్య జీవితాభ్యుదయ మహోత్సవము చేయుచూ
    గోదావరీ కృష్ణా కూడి నాట్యమాడుతూన్నవి
    మహాంధ్రోదయ సౌభాగ్య మహిమ పాడుతూ
   
    నా పుట్టుకకే ఒక అర్ధమేర్పడింది
    నా జీవితానికొక  ధ్యేయమగుపడింది
    అందరూ  అంటారు ఇప్పుడు
    ఫ్రౌఢత్వంతో పాటు  సకల అందాలను
    సంతరించుకున్న నన్ను చూసి,
    "ఆంధ్రలక్ష్మీ ! నువ్వెంతో అదృష్టవంతురాలివనీ,
    నీ కెంతో రమ్యమైన భవిష్యత్తు వుందనీ !!"
    అందుకే నా కనిపిస్తుంది
    నా పుట్టుక కాదు చరిత్ర !
    నేనే చరిత్రనై నిలవాలని !!