Facebook Twitter
అమెరికాలో ఆనందోత్సోహాలతో జరుపుకున్నఅమెరికా స్వాతంత్ర్యదినోత్సవం

 అమెరికాలో ఆనందోత్సోహాలతో జరుపుకున్నఅమెరికా స్వాతంత్ర్యదినోత్సవం

- కనకదుర్గ

        "హ్యాపీ జులై 4th," అని ఒకరికొకరు చెప్పుకుంటూ, " హ్యాపీ బర్త్ డే అమెరికా," అంటూ సంతోషంగా అందరూ సాయంత్రం పూట వారి వారి కమ్యూనిటీ ఏరియాలలో 'ఫైర్ వర్క్స్,"  చేసుకుంటూ చాలా సరదాగా గడుపుతారు.  ఈ రోజున అమెరికా కొత్త దేశంగా అవతరించిందని అందుకే దేశానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు.  ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి అన్నీ దేశాల వారు, జాతుల వారు కుటుంబాలతో, స్నేహితులతో కలిసి వస్తారు.  జులై 4న దేశమంతా సెలవు దినం, ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పెరేడ్లు, మ్యూజికల్ కాన్ సర్ట్స్, బార్బెక్యూలు, పిక్ నిక్ లు, కుటుంబ సభ్యులు, బంధువులు దేశంలో వివిధ ప్రదేశాల్లో వున్న వారంతా అనుకుని జులై 4, గురువారం అయితే, శుక్రవారం సెలవు తీసుకుని లాంగ్ వీకెండ్ లా చేసుకుని అందరూ కలిసి బీచ్ లకి వెళ్ళడమో, ఏదైనా చూడని కొత్త ప్రదేశానికి వెళ్ళడమో చేస్తారు.  బేస్ బాల్, క్రికెట్ లాగే ఇక్కడ ఈ ఆటకి బాగా క్రేజ్ వుంది, ఈ గేమ్స్ చాలా చోట్ల ఆడతారు.  సరదాగా ఈ గేమ్స్ చూడడానికి కూడా వెళతారు. 

అసలు ఈ జులై 4కి ఎందుకింత ప్రత్యేకత? అందరూ స్వాతంత్ర్యదినోత్సవాలు జరుపుకున్నట్టే వారు జరుపుకుంటారు గొప్పేంటి అనుకోవచ్చు. 


      అమెరికాలో వున్న బ్రిటిషర్స్, ఇతర దేశస్థులపై బ్రిటిషర్స్ పెత్తనం, బ్రిటిష్ రాజు ఆధిపత్యం వద్దని పోరాటం జరుగుతున్న సమయంలో జులై నాలుగున 'అమెరికా దేశం బ్రిటీష్ దేశాధిపత్యం నుండి విముక్తి చెందిందని, 1776, జులై 4న ప్రకటించిన రోజు.'  'డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్' అని అంటారు.  కాంగ్రెస్ స్వాతంత్ర్యం కోసం ఓటు చేసాక, ఆ స్వాతంత్ర్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకుని, థామస్ జెఫర్సన్ ఒక కమిటీ మెంబర్ గా అయిదుగురు వున్న కమిటీ ఆ నిర్ణయాన్ని అందరికీ వివరించడానికి ఒక స్టేట్మైంట్ తయారు చేసారు.  ఆ రోజు నుండి అమెరికన్లు జులై 4న స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  1777 సంవత్సరంలో 13 సార్లు గన్ షాట్స్, పొద్దున, సాయంత్రం సెల్యూట్ చేస్తూ కాల్చి, రోడ్ ఐలాండ్ లో స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకున్నారు.  ఫిలడెల్ఫియాలో ఏడాది వార్షికోత్సవాన్ని చాలా మాడరన్ గా జరుపుకున్నారు.  కాంటినెంటల్ కాంగ్రెస్ కి డిన్నర్, టోస్ట్స్,  13 సార్లు సెల్యూట్ గన్ షాట్స్, స్పీచ్ లిచ్చి, ప్రార్ధనలు చేసి, పరేడ్లు, మ్యూజిక్, చిట్ట చివరన సూర్యుడస్తమించాక పెద్ద మైదానంలో ఫైర్ వర్క్స్ తో పండగలాగా జరుపుకున్నారు, షిప్స్ కి బ్లూ, ఎరుపు, తెలుపు, జెండా రంగులతో డెకరేట్ చేసారు. అప్పటినుంచి చాలా వరకు అలాగే జరుపుకుంటూ వస్తున్నారు.

జులై 4 వస్తుందంటే ఇళ్ళ ముందర, షాప్స్, ఆఫీసులు, హాస్పిటల్స్, ఇలా ప్రతి చోట అమెరికా జెండాలు పెట్టుకుంటారు.  పిల్లలు, పెద్దవాళ్ళూ, అందరూ, జెండా రంగులతో వున్న బట్టలు వేసుకుంటారు.  జులై నాలుగు ఒక వేళ ఆదివారం వస్తే మర్నాడు సెలవు ఇస్తారు.  పొద్దున పూట పరేడ్లు చేసుకుంటారు, సాయంత్రం చిన్న చిన్న ప్రదేశాల్లో కమ్యూనిటీ మైదానాల్లో ఆ చుట్టు ప్రక్కల వారంతా చేరి ఫైర్ వర్క్స్ చేసుకుంటారు.  ఫైర్ వర్క్స్ చూడడానికి దుప్పట్లు, క్యారి ఆన్ కుర్చీలు తీసుకెళతారు.  దుప్పట్లు పరుచుకుని పాటలు పాడుకుంటూ, చిన్న పిల్లలు పరిగెత్తుకుంటూ ఆడుకుంటుంటారు.  పెద్దవాళ్ళు కూడా పిల్లలతోపాటూ కలిసి పిల్లల్లా ఆడుకుంటూ సూర్యాస్తమయం అయ్యేదాకా సరదాగా గడుపుతారు.   అక్కడే ఫైర్ వర్క్స్ కి ముందు ఆర్కెస్ట్రాలతో మ్యూజిక్ కాన్ సర్ట్స్ చేస్తారు.  పెద్ద పెద్ద సిటీలల్లో, పేరున్న బ్యాండ్స్ ని, గాయనీ గాయకులను పిలిపించి కాన్ సర్ట్స్ ముఖ్యమైన, చారిత్రాత్మకమైన ప్రదేశాల్లో పెట్టుకుంటారు.  లక్షలమంది వస్తారు ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్, ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసే ఫైర్ వర్క్స్ చూడడానికి.  పూర్తిగా చీకటి పడ్డాకే చేస్తారు.  అన్ని షాప్స్ లో, మాల్స్ లో, కార్ల పై ఇలా ప్రతి ఒక్క దాని పై జులై 4 సేల్స్, డిస్కౌంట్స్ వుంటాయి.  చాలా మంది కాకర పూవొత్తులు, చిన్న చిన్న టపాసులు కొని ఇంటి దగ్గర కాల్చుకునే వారు కాల్చుకుంటారు, లేకపోతే కొంతమంది ఫైర్ వర్క్స్ జరిగే దగ్గరకి తీసుకెళ్ళి పిల్లలతో కలిసి కాలుస్తారు, పిల్లలు కాలుస్తుంటే సంతోషిస్తారు.

       ఫిలడెల్ఫియాలో జులై 4న జరిగే సంబరాలు చూడడానికి ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల టూరిస్ట్స్ ఈ సమయానికే ఇక్కడ వుండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఫిలడెల్ఫియాలో జరిగే సంబరాలు ఆర్ట్ మ్యూజియమ్ దగ్గర జరుగుతాయి.  ఆర్ట్ మ్యూజియమ్ "రాకీ,"(Rocky)సినిమాలో సిల్వస్టర్ స్టాలోన్  ఆర్ట్ మ్యూజియమ్ మెట్ల పై పరిగెత్తుతూ ప్రాక్టీస్ చేసే సీన్ చాలా పాపులర్ అయ్యింది.  ఇప్పటికి చాలామంది అలాగే మెట్లపైన పోటీలు పెట్టుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఫైర్ వర్క్స్ ఆర్ట్ మ్యూజియమ్ దగ్గర చేస్తే చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది.  బెన్ ఫ్రాంక్లిన్ పార్క్ వే నుండి ఆర్ట్ మ్యూజియమ్ వరకు జనాలు ఇసక వేస్తే రాలనంత నిండి పోతారు. బెన్ ప్రాంక్లిన్ వేలో కాన్సర్ట్ జరుగుతుంది.  ఈ సారి కాన్సర్ట్ చేయడానికి ఇక్కడ బాగా పాపులర్ అయిన రూట్స్ బ్యాండ్, జాన్ మేయర్, గాయకుడు, నియో అనే ఈ మధ్యనే మరో కొత్త ఆల్బమ్ రిలీజ్ చేసి అది బాగా హిట్ అయిన కళాకారుడు, మరి కొంతమంది కళాకరులు వచ్చారు.  వారి కాన్సర్ట్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, జనాలని కూడా కలుపుకుంటూ, వారితో పాటలు పాడిస్తూ, డ్యాన్స్ చేయిస్తూ సరదాగా జరిగింది.  ఫైర్ వర్క్స్ మాత్రం ఆర్ట్ మ్యూజియమ్ వెనక భాగం పైన జరుగుతాయి.  ఎక్కడ నుండి చూసినా పైన జరుగుతాయి కాబట్టి చాలాదూరంవరకు స్ఫష్టంగా కనిపిస్తాయి.  ఫైర్ వర్క్స్ జరిగేపుడు పాపులర్ ఆల్బమ్స్ నుండి పాటలు, మ్యూజిక్ వేస్తూ చేస్తారు.  వినడానికి వీనులవిందుగా, చూడడానికి కనులపండువుగా వుంటుంది.

ఆ రోజంతా భారతీయులకి దీపావళి పండగ గుర్తొస్తుంది. కొంతమంది భారతీయులు ఇప్పుడు మాత్రమే దొరికే టపాసులు కొని పెట్టుకుని దీపావళి పండగకి ఇంటిదగ్గర దీపాలు పెట్టుకుని స్నేహితులు, బంధువులుంటే అందరూ కల్సి కాల్చుకుంటారు.   అమెరికా అంటే ఎన్నో దేశాల వారు కలిసిన దేశం.  అమెరికన్లు,భారతీయులు, జర్మన్లు, ప్రెంచ్ వారు, చైనీస్, జపానీస్, ఆఫ్రికన్ దేశాల వారు ఇలా ఎన్నో దేశాల వారు కలిసిన దేశం.  జులై 4న, స్వాతంత్ర్యదినాన ఏ తేడాలు లేకుండా జాతి, మత, దేశీయ తేడాలు లేకుండా అందరూ కలిసి సంతోషంగా, ఉల్లాసంగా, దేశభక్తిని తెలియజేసుకుంటూ స్వాతంత్ర్య సంబరాలు ఆనందంగా జరుపుకుంటారు.