Facebook Twitter
సంథింగ్ సంథింగ్

సంథింగ్ సంథింగ్

 

 

త్రినాద్

 

నేను ఈ మద్య హాల్లో చూసిన సినిమాలు చాలా తక్కువే అది కూడా ఎప్పుడైనా మా అత్తగారి వూరు వెళ్ళేటప్పుడు . బోర్ కొడితే సినిమాకు వెళ్ళాలి అనిపించినపుడు . ఆ మద్య ఒక ఆదివారం వెళ్ళాము అది ఒక చిన్న పట్టణం . సాయంత్రం అయ్యే వేళ మరీ బోర్ కొడుతుంటే వెంటనే సినిమాకి బయలుదేరాను . మావాడు వెంటనే నేను కూడా వస్తాను అన్నాడు వెంటనే ఇంకో తోక... మా అమ్మాయి కూడా నేను వస్తాను అంది నా శ్రీమతి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడే అవకాశం పోతుందని నేను రాను అంది ముగ్గురం జోరుగా హుషారుగా బయలుదేరాము.

   కొంత దూరం నడిచాకా ఒక హాల్ కనపడింది అందులో " ప్రేమ కథా చిత్రం " నడుస్తుంది . వెళదామా అంటే మా అమ్మాయి ససిమేరా ఒప్పుకోలేదు ఎందుకమ్మా అంటే హీరో సుదీర్ మహేష్ బాబు బావ కాబట్టి నేను రాను అంది. " మొగుడు కొట్టాడని కాదు తోటికోడలు నవ్విందని " అన్నట్లు మహేష్ బాబు సుదీర్ బావ అయినందుకు కాదు మహేష్ బాబు మావాడి అభిమాన హీరో అయినందుకు. అందులోను మా అమ్మాయి ప్రభాస్ అభిమాని . మా బుడ్డోడు వెళ్దామని మా అమ్మాయి వద్దని మద్యలో నేను నలిగిపోయాను , నడవగా నడవగా ఇంకో హాల్ వచ్చింది అందులో "ఇద్దరమ్మాయిలు " నడుస్తుంది. మా అమ్మాయి వెళ్దాము అంది, ఎటొచ్చి ప్రభాస్ సినిమా లేదు కాబట్టి వెళ్దాము అంది , నేను వద్దన్నాను ఎందుకంటే అప్పటికే ఆ సినిమా రివ్యు చదవటం జరిగింది .

       ఈ మద్య ప్రతి సినిమాను నెట్లో పెట్టిన రివ్యూ చదివి నిర్ణయించుకోని చూడటం అలవాటు అయ్యింది . ఎందుకో ఆ సినిమాకి రివ్యూ సరిగా లేకపోవటం వద్దులేమ్మా అన్నాను. కొద్ది దూరంలోనే " సంథింగ్ సంథింగ్ " నడుస్తుంది బావుందని అంటున్నారు (ఇది కూడా రివ్యూ ) వెళ్దాము అన్నాను " పళ్ళు ఊడ కొట్టుకోవటానికి ఏ రాయి అయితే ఏంటి" అన్నట్లు మావాళ్ళు ఇద్దరూ అయిష్టంగానే ఒప్పుకున్నారు , టికెట్లు తీసుకున్నాము . రిసర్వుడు 30 రూపాయిలు (అబ్బొయ్ డెడ్డు సీపు అన్నట్లు నా మనసులో ఒకటే సంబడం ) ఆ తరువాత మా అమ్మాయి చూసింది "నాన్న ఇది ఎసి థియేటర్ కాదు వద్దు" అంది. ఇక్కడ ఎసి హాల్ ఒకటే వుంది అందులో అది ముందుకు వెళ్ళిపోయింది కదా అయినా అన్నిటికీ అలవాటు పడాలి. అన్నట్లు చిన్న క్లాసు పీకబోతే "వద్దు నాన మీ చిన్ననాటి రోజులు ఫ్లాష్ బాక్ ఇప్పుడు చెప్పకు అంది . ఈలోగా హాల్లోకి ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రవేశించాము

          "మాకెందుకొచ్చిన ఈ జీవితం" అన్నట్లు పంకాలు నిస్తేజంగా తిరుగుతున్నాయి . కాశీ వెళ్ళినా కాసిన గుణం పోదు అన్నట్లు ప్రొజెక్టర్ కి దగ్గరగా వెళ్లి చివర వరసలో సోఫా లో కూలబడ్డాము ( చిన్నపుడు ప్రొజెక్టర్ దగ్గర కూర్చోవటం అదో సరదా ) . ఈలోగా సినిమా మొదలు అయ్యింది ముగ్గురం కూర్చున్నాము సోఫా ఇరుకుగా వుంది వేరే సోఫాలో ఇంకొకర్ని కూర్చోబెడదాము అంటే అక్కడ పంకా లేదు ఈలోగా ప్రక్క నుండి పెద్ద శబ్దం మా ప్రక్క సోఫాలో కూర్చోడానికి ప్రయిత్నించిన ఇద్దరు భార్య భర్తలు సోఫా విరిగి లోనికి కూరుకుపోయారు . బ్రతికాము దేవుడా ఆ సోఫాలో మనం కూర్చోలేదు అనుకున్నాము . పాపం వారు అవమానంతో లేచి లోలోపలే హాలు వాడిని తిట్లకు అంకితం చేసి మరో కుర్చీలో కూలబడ్డారు . ఈలోగా సినిమా పేర్లు పూర్తి అయ్యాయి . టాకీ వస్తుంది కాని మూకీ లేదు కెవ్వు కేక అంటూ కుర్రాళ్ళు ఒకటే కేక మళ్ళి బొమ్మ కనపడింది . కొద్దిసేపు అయ్యాక మళ్ళి మూకీ పోయింది మళ్ళి కెవ్వు కేక ఈసారి మా అమ్మాయి నన్ను అదోలా చూసింది ఏం పర్వాలేదమ్మా వస్తుందిలే అంటూ అభయం ఇచ్చాను . మళ్ళి టాకీ మూకీ రెండు వచ్చాయి కాసేపు హమ్మయ్య అనుకున్నాము .

      మళ్ళి కాసేపు అయ్యాక మూకీ మాయం అయ్యి టాకీ ఖాయం అయింది . ఒక్కసారిగా ఒకటే కెవ్వు కేకలు కొంతమంది కుర్రాళ్ళు ఆపరేటర్ని ఒకటే తిట్టుడు "ఒరేయ్ నీ .........". అంటూ ఈసారి పూర్తిగా ఆపేసాడు . "బయటికి వెళ్లి వస్తాను వుండండి" అనుకోని బయటికి వెళ్ళాను. బయట ఒకాయన ఈరోజు సినిమా లేదంట అన్నాడు ఓరిదేవుడా ఇదెక్కడి గోలరా బాబు అనుకున్నాను , మా పిల్లలతో చెప్పితే వాళ్ళ మోహంలో రంగులు మారిపోయాయి . "పదండి పదండి ముందుకు పదండి" అంటూ జనం వురికారు అప్పటికే ఆఫీస్ గది లోపల గడియ పెట్టారు . తలుపులు గట్టిగా కొడితే ఒకబ్బాయి బయటికీ వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అన్నాడు అంతే జనం తిట్ల పురాణం చదువుతూ ఒక్కసారిగా టిక్కెట్ కౌంటర్ మీద పడ్డారు .

         "అబ్బో ..........ఇచ్చేసిన డబ్బులకోసం కూడా ఇంత పోట్లాట" అనుకోని మా డబ్బులు మేము తీసుకొని రోడ్డు మీద పడ్డాము . "ఇదేంటి నాన" అని మా పిల్లలు అడిగారు అదేనమ్మా " సంథింగ్ సంథింగ్ " అన్నాను నాకు తెలిసి చిన్నపుడు చూసిన టూరింగ్ టాకీసులో కూడా ఇలా జరగలేదు అన్నాను . మావాడి మొహం కందగడ్డలా మారిపోయింది . ఇంక వాళ్ళని కూల్ చెయ్యటానికి కోలాలు హిమ క్రీములు అన్నీ ఇప్పించి శాంతిపజేసాను . "హతవిధీ ఈ అవమాన భారంతో మా మోహములు మావాళ్ళకు ఎలా చూపించవలే " అని ఈసురోమని ఇల్లు చేరాము . మమ్మల్ని చూసి అవాక్కయ్యారు మావాళ్ళు. విషయం చెప్పగానే వాళ్ళకి అయోమయం ఒక్కసారి నిశ్శబ్దం గోల్లుమంటూ మావాళ్ళందరూ ఒకటే నవ్వులు మా మొహాలు మాత్రం అయ్యాయి వాడిన పువ్వులు .