వెన్నెల రాత్రి
శ్రీమతి శారద అశోకవర్ధన్

అది వెన్నెల రాత్రి
కన్నెల హృదయాలను కదిలించే
కమ్మని రాత్రి
వధూవరుల యెదల్లోన
వలపులు చిందించే
పసిడి వెన్నెల రాత్రి.
మగువల మనసుల్లో
మల్లెలు వికసించే
మధురమైన వెన్నెల రాత్రి.
పడుచుదనం
పరవళ్ళు త్రొక్కే
యవ్వనుల కది
పండగ రాత్రి
తొట్టెలోని
చిట్టి పాపల్ని
జోలపాడి ఊరడించే
తల్లులకది
పాలవెన్నెల రాత్రి.
గతంలోని స్మృతులెన్నో
గళమెత్తి పాడుతూంటే
జారిపోయిన యవ్వనాన్ని
జాగృతం చేసే
వెండి వెన్నెల రాత్రి.
చల్లని రాత్రి అది
వెన్నెల రాత్రి కానీ
కట్నాల బరువుతో కృంగిపోతూన్న
కన్నవారి కష్టాలు చూడలేక
కన్నీరు కార్చే కన్నియ కది కాళరాత్రి.
ఆకాశాన్నంటే ధరలతో
చాలీచాలని జీతంతో
సాగుతూన్న జీవితాల కది
మహా శివరాత్రి.
పరిస్థితుల సంకెళ్ళలో చిక్కి
పవిత్రతను సయితం కాపాడుకోలేని
మానినుల కది, మచ్చతెచ్చే
మాయదారి రాత్రి.
పేదవాడి గుడిసెలో
పేలికల జోలెలో
నిదురించే పాపాయికి
వెలుగే చేరని కాటుక రాత్రి
తెలియరాని కలల రాత్రి.
కండరాల కరిగించి
కష్టాల కుంపట్లో కాలిపోతూన్న
జీవితాల కది
కసితో హసిస్తున్న కటిక అమావాస్య రాత్రి
అయినా,
అది వెన్నెల రాత్రి.



