బాల్యం

జ్ఞాపకాల దొంతరాలలో
వెతికి పట్టాను నా బంగారు బాల్యాన్ని
నన్ను నేనే మరచి
ఆనందించిన క్షణాలు ఎన్నో
స్నేహితులతో పంచుకున్న
నవ్వులు పువ్వులు ఎన్నో
పంట కాలువలు, కొంటె కేరింతలు
పచ్చని పొలాలలో విచ్చిన పూవులు
ఎక్కిన కొండలు, దిగిన బావులు
ఏరిన రేగులు, రాలిన నేరేళ్ళు
గొబ్బి పూవులు, దిబ్బ మేటలు
కట్టిన గుడులు , పెట్టిన బొమ్మలు
నడచిన బాటలు, ఆడిన తోటలు
వెంటబడిన తూనిగలు
వెంబడించిన తేనే టీగలు
పచ్చని చిలుకలు, పిచ్చుక గూళ్ళు
కోడి పెట్టలు , లేగ దూడలు
తాటి కాయల బళ్ళు , గోటీ కాయల జేబులు
పిచ్చి బంతులు , ఏడు పెంకులు
గోటీ బిళ్ళలు , గొరింటాకులు
గాలి పటాలు , గాలి పాటలు
వేసిన ఊయలలు , చేసిన ఆకు బొమ్మలు
స్వచ్చమైన నవ్వులు
విచ్చుకున్న బంధాలు
పెంచుకున్న అనుబంధాలు
మెచ్చుకున్న ప్రేమలు
మళ్ళీ తిరిగివస్తే బాల్యం
మురిపెంగా దాచుకోనా
బంగారు అక్షరాలతో
నా బతుకంతా తీపి జ్ఞాపకాలుగా !
రచన - శాగంటి శ్రీకృష్ణ



