నీలి మేఘమా

నీలి నీలి మేఘమా
నిండైన నీటి మేఘమా
ధరణిని కమ్మిన మేఘమా
దయదల్చి నీ గర్భముండు
నీటిని విడువుమా
ఉరుకులు పరుగులు తియ్యకు మేఘమా
నిట్ట నిలువున నింగిన నిలిచి
భువిపై నీటి పన్నీరు చిలుకరించవా
ఆ పన్నీటిలో పుడమి పులకరించెను కదా
అరుపుల మెరుపుల మేఘమా
అలరించెను నీవు కట్టిన నీలి నీటి చీర
మురిపించెను నీలో దాగి ఉన్న
వజ్ర కాంతుల ఇంద్రధనస్సు
పుష్పించెను పుడమి తల్లి పంట బిడ్డలు
సూర్య చంద్ర నక్షత్రాలను సైతం
దాగెను నీలోన.. పగటిని రేయి
చేయగల శక్తి నీదు గలదు గదా
ఓ కారు చీకట్ల కారు మబ్బు
పొగబడితే కరువును బహుకరిస్తావు
ప్రేమిస్తే జీవాలకు ప్రాణాలు పోస్తావు
నల్లని రూపు ఉన్ననూ
తెల్లని మనస్సుతో ధరణిని కనికరిస్తావు
కడలి నుండి కడుపు నింపుకొని
పుడమి పొట్ట నింపుతావు
సూర్య నిప్పులను సైతం
కారు మబ్బుల్లో చుట్టి పడేస్తావు
ఆకాశన నీలి పందిరివై
ధరణీపై సలీల కల్లపి చల్లి
వాగు, వంక, యేరు ,సెలయేరు
కుంట ,సరస్సు, నది ,
అంబోనిధిని నింపుతావు..!!
నీలి నింగికి శ్వేత వస్త్రం
చుట్టినట్లు ఉంటావు
కడలితో జతకట్టి నీలి గర్భం దాల్చి
పండంటి నీటి రత్నాల
బిందువులను పుడమికి పంచుతావు
కదా ఓ నీలి నీటి మేఘమా !!!!

మీ భవదీయుడు
జాని. తక్కెడశిల



