Facebook Twitter
సంక్రాతి కవిత!!!

సంక్రాతి కవిత!!!


సంక్రాంతి క్రాంతి
మంచుతెరల చేమంతుల దోబూచులు
బంతిపూల పూబంతుల విరబూతలు
హేమంతం చేసెనంత సీమంతం
పుడమితల్లి కడుపుపంట లోగిళ్ళను చేసెనంట శ్రీమంతం ..సిరివంతం!
సిరుల విరులతో అలరారే కాలం
ఆబాలగోపాలం ఆలపించు భూపాలం
శుభ సంక్రాంతి శోభకిదే సంకేతం!
దినకర మకర సంక్రమణా సరంభాని కిదే యిదే స్వాగతం!
ముంగిళ్ళ రంగవల్లి వేదికగా అదిగదిగో...
హరిలో రంగహరీ...కీర్తనల హరిదాసు నర్తనలు
ముద్దులొలుకు గుమ్మల గొబ్బెమ్మల పాటలూ..
ఇవిగివిగో...బొమ్మల కొలువులు...భోగిపళ్ల బోసి నవ్వులు
అందాల అనుబంధాలు...ఆనందాలు పెనవేసిన బంధాలు
ఇలా తెలిగింటి వెలుగులతో వెలిగెనంట భోగిమంట
మకర సంక్రాంతి కిదే యిదే స్వాగతమంటా..
డబడబ బుడబుక్కల సడులు...డోలు...సన్నాయి తోడ
డూడూ బసవన్నలాడు సందడులు..
కోడిపుంజుల రంజైన ఎడ్లపందాల గెలుపుల ఈలలు
గాలిపటాల అలలు అహహా..
అంబరాలు తాకినవి సంక్రాంతి సంబరాలు
సర్వాంగ సుందరమీ ధనుర్మాస సోయగాలు
పాడిపంటల వేడిమంటల  భోగి పండుగ
పిండివంటల పొంగలి పొంగుల పెద్దపండుగ
పశువుల మేనినునుపుల మా కనుమ పండుగ..కలల పండుగ
ఆ పర్వదిన మాధుర్యం...అపూర్వ సంప్రదాయ సౌరభం
మూడునాళ్ళూ ముచ్చటగా సంక్రాంతి...తెలుగునేల తియ్యదనాల స్రవంతి
జాలువారాలి నిరంతరం...తరలిరావాలి తరం తరం
తరం తరం... నిరంతరం....నిరంతరం ..తరంతరం.


విస్సా నాగమణి