Facebook Twitter
" ఏడు రోజులు " 29వ భాగం

 " ఏడు రోజులు " 29వ భాగం

 

 


    కానీ గౌసియా నడవలేకపోతోంది. ఆమె పరిస్థితిని గ్రహించిన అతడు ఆమెను రెండు చేతులమీదకు ఎత్తుకుని, గబాగబా వెలుపలకి నడిచి, తన స్కూటర్ పై కూర్చోబెట్టుకుని, పది నిముషాలలో వేరే హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు.

    అది గవర్నమెంట్ హాస్పిటల్. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూలేరు. కాంపౌండరే వెళ్ళి డాక్టరును తీసుకువచ్చాడు.

    డాక్టర్ వచ్చేసరికి హాస్పిటల్ మెట్లపై మెలికలు తిరుగుతూ పడివుంది గౌసియా.

    "అరెరే..." గాబరాగా గౌసియాను తిరిగి తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని, డాక్టర్ వెంట లోపలికి నడిచాడు కాంపౌండర్.

    "అసలు ఈ అమ్మాయికి ఏమయ్యింది?" షర్టు పైకి తొలగి నడుముకు కట్టివున్న బ్యాండేజీ కనబడుతుంటే కనుబొమలు ముడిచి చూస్తూ అడిగాడు డాక్టరు.

    "ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన మతకలహాల్లో ఈ అమ్మాయి గాయపడింది. ఎవరో పుణ్యాత్ముడు ఈ అమ్మాయిని తీసుకు వచ్చి మా హాస్పిటల్లో చేర్పించాడు. అప్పుడే అనుకున్నా ఎలాగూ ఖర్చు పెట్టుకుంటున్నావు. ఆ పుణ్యం దక్కాలీ అంతే వేరే ఆస్పత్రికి తీసుకు వెళ్లకూడదా నాయనా అని.

    "అయినా మా డాక్టర్ సంగతి కొత్తవాళ్లకు ఏం తెలుస్తుంది? తెల్సిన పాతవాళ్లు మాత్రం రావడం తగ్గించారు" చెప్పుకుపోయాడు కాంపౌండర్.

    డాక్టర్ ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. గౌసియాను అక్కడ టేబుల్ పై పడుకోబెట్టించి వెంటనే తన చికిత్సను ఆరంభించాడు.

    మొదట అపెండిసైటిస్ అని అనుమానపడ్డారు కాంపౌండర్, డాక్టరూ. కాని చికిత్స తర్వాత అది సాధారణ కడుపునొప్పిగా తేలింది.

    "అంటే ఇంక నాకేం కాదా?" ఏ విషయాన్ని డాక్టర్ కాంపౌండర్ తో చెప్పాక ఆతృతగా డాక్టర్ వైపు చూసింది గౌసియా.

    "ఏం కాదు" చిరునవ్వుగా చెప్పాడు డాక్టర్.

    "నాకు అప్పుడప్పుడూ సన్నగా కడుపునొప్పొస్తుంటుంది. ఆ నొప్పి కూడా రాకుండా మందులు ఇవ్వండి" అంది గౌసియా.

    "తప్పకుండా ఇస్తాను" చెప్పి మందుల కోసం తన గదివైపు నడిచాడు డాక్టరు. వెంటే వెళ్తూ "డాక్టర్! నాకు అవతల పని వుంది. నేను వెళ్లవచ్చా?" అడిగాడు కాంపౌండర్.

    "నువ్వెళ్లు. ఈ అమ్మాయితో ఆయాను ఉంచుతాను" చెప్పాడు డాక్టర్.

    కాంపౌండర్ తిరిగి వెనక్కివచ్చి "పాపా! నేను వెళ్తాను. మళ్లీ రేపు ఉదయాన్నే వస్తాను" గౌసియాతో చెప్పాడు.

    "మరి నా దగ్గర ఎవ్వరూ వుండరా?" అడిగింది గౌసియా.

    "ఆయా వస్తుంది" చెప్పి, నీకేం భయం లేదు. అక్కడ హాస్పిటల్లో ఎంత ధైర్యంగా వున్నావో, ఇక్కడ కూడా అంతే ధైర్యంగా వుండాలి" గౌసియా తల నిమురుతూ చెప్పి వెళ్లిపోయాడు కాంపౌండర్.

    "అమ్మాయీ" కాసేపటి తర్వాత పిలుస్తూ వచ్చాడు డాక్టరు. ఏంటన్నట్లుగా నెమ్మదిగా తల తిప్పి చూసింది గౌసియా.

    "నీకు అప్పుడప్పుడు కడుపునొప్పొస్తుంది అన్నావుకదా! ఏటైమ్ లో వస్తుంది?" ఆమె కడుపును మృదువుగా వత్తుతూ అడిగాడు.

    "టైం అనేది వుండదు. ఒక్కోసారి రాత్రి పూట... ఒక్కోసారి పగలుపూట... ఎప్పుడంటే అప్పుడే" చెప్పింది గౌసియా.

    "అదికాదు, పీరియడ్స్ టైమ్ లో నొప్పొస్తుందా అని అడుగు తున్నాను"

    "పీరియడ్ అంటే?"

    "బహిష్టు"

    "ఛీ..." ఇబ్బంది పడిపోయింది గౌసియా.

    "డాక్టర్ దగ్గర సిగ్గు పడకూడదు. ఫ్రీగా మాట్లాడాలి" అన్నాడు డాక్టర్.

    "అవును" ఇబ్బందిపడుతూనే చెప్పింది గౌసియా.

    "ఐసీ" అంటూ తన చేతుల్ని ఆమె రొమ్ముల మీదకు పోనిచ్చి "ఆ టైమ్ లో ఇక్కడ కూడా నొప్పిగా వుంటుంది కదూ?" అడిగాడు.

    "ఊహూ" తల అడ్డంగా వూపింది.

    "బాగా గుర్తు తెచ్చుకో" అంటూ ఆమె రొమ్ముల్ని మృదువుగా నొక్కాడు.

    "లేదు" అతడి చేతులు తన ఎదమీద తచ్చాడుతుంటే ఆమె శరీరం కుంచించుకు పోసాగింది.

    అతడు ఆ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్. ఆడపిల్లల పిచ్చి ఎక్కువ. సీనియర్ డాక్టర్ ప్రతి స్త్రీలోనూ తల్లినో చెల్లినో చూస్తాడు కాని అతడు ప్రస్తుతం సెలవు మీద వూరెళ్లాడు. లేదంటే ఇప్పుడు తనే వచ్చేవాడు. తను లేడు. పైగా ఒక అందమైన అమ్మాయి హాస్పిటల్ కి వచ్చింది. అందుకే ఆ డాక్టరు హృదయం ఆనందంతో ఎగసిపడుతోంది.

    "నీ పేరేంటి?" అడిగాడు.

    "గౌసియా" చెప్పింది.

    "అమ్మాయి గౌసియా! కమలాకర్ మీకు బంధువు అవుతాడా?" అతి తెలివిగా ప్రశ్నించాడు డాక్టర్.

    "కమలాకర్ ఎవరు?" అడిగింది గౌసియా.

    "అదే నిన్ను ఇప్పుడు తీసుకు వచ్చాడే"

    "ఏం కాదు"

    "అలాగా" అంటూ పొరపాటున ఆమె రొమ్ముల్ని గట్టిగా నొక్కాడు.

    "అమ్మా" ఆమె బాధగా అరిచింది.

    "ఎవరికి ఏం అయింది డాక్టర్?" అప్పుడే అడుగుతూ వచ్చాడు ఆ హాస్పిటల్ కాంపౌండర్ దినకర్.

    "కడుపునొప్పి పేషెంట్" అంటూనే తన చేతుల్ని గౌసియా కడుపు మీదకు చటుక్కున తీసుకువచ్చాడు డాక్టర్.

    "దవాఖానా తెరిచి వుంటేనూ, ఎవరికి ఏం జరిగిందా అని పరేషాన్ అయ్యాను నేను" అన్నాడు దినకర్.

    "ఈ అమ్మాయికి నో ప్రాబ్లమ్! కాకపోతే సెలైన్ అవసరం. వెళ్లి ఆయాను తీసుకురండి" చెప్పాడు డాక్టర్.

    "మీరు గమ్మత్తుగా మాట్లాడ్తుండరు. ఆయా ప్రొద్దుటే గదా వూరెళ్లింది" అన్నాడు దినకర్.

    "ఓ అవును కదూ? మరి ఈ అమ్మాయికి సెలైన్ ఎక్కిస్తే దగ్గరగా ఎవరు వుంటారు?" అన్నాడు డాక్టర్.

    "ముంతాజ్ గాడ్ని తీసుకువస్తాగానీ ఈ అమ్మాయి తాలూకు వాళ్లు ఎవ్వరూ లేరా?" అడిగాడు దినకర్.

    "ఎవ్వరూ లేరు"

    "అదేంటీ?"

    "అవన్నీ తర్వాత ముందు ముంతాజ్ ను పిల్చుకురండి"

    "వాడు రెండో ఆట సిన్మాకు వెళ్లాడు. రాగానే ఇక్కడికి పంపిస్తాను" అని "ఈ అమ్మాయిది ఏం నొప్పి?" అడిగాడు దినకర్.

    "బ్లడ్ ఎక్కువగా పోవడం, శరీరం కదలికలకు గురికావడంవల్ల కడుపులో నొప్పి వచ్చింది అంతే" చెప్పాడు డాక్టర్.

    అర్థం కానట్లుగా చూశాడు దినకర్. అతడి చూపులు గౌసియాకు అర్థమయ్యాయి. హైదరాబాద్ అల్లర్ల దగ్గర్నుండి, తనను హాస్పిటల్లో జాయిన్ చేసిన కథ వరకు వివరంగా చెప్పుకుంది.

    ఈలోగా ఇన్ పేషెంట్స్ కొందరు అక్కడికి వచ్చారు. దినకర్ తో పాటుగా అందరూ గౌసియాపట్ల జాలి కనబర్చారు. అందరూ రావడంతో డాక్టరు బుద్ధుమంతుడిగా మారాడు. ఆడపిల్లల పిచ్చి తప్పిస్తే అతడు నిజంగా బుద్ధిమంతుడే అని చెప్పాలి. అదే విషయాన్ని దినకర్ మనసులో అనుకున్నాడు.

    "వీడి బుద్ధికి బ్రేకులు పడ్డాయి. వెధవ సన్యాసి".