Facebook Twitter
" ఏడు రోజులు " 28వ భాగం

" ఏడు రోజులు " 28వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

    

 

 అతడి మాటలు పూర్తికాకముందే గౌసియా స్తంభించిన ప్రకృతిలా తయారయ్యింది.

    "అ...ది..." తండ్రి మరణం ఆమెను కలిచివేయసాగింది.

    "ఈరోజు గొడవలు ఈ విషయమై తలెత్తాయి. థూ... పొరపాటున మనుషులుగా పుట్టారీ మతపిచ్చి వెధవలు" పళ్ళ బిగువున అన్నాడు అతడు.

    ఆమె మామూలు మనిషి కాలేకపోతోంది. కళ్ళ వెంబడి నీళ్ళు ధారాపాతమౌతున్నాయి. ఏదో మాట్లాడాలనుకుంటూ మాట్లాడలేకపోతోంది.

    "భయపడవద్దమ్మా! ఇట్లాంటి గొడవలు సహజమే కదా?" అన్నాడు అతడు.

    "అ... అ... ఆ యువకుడికి ఏం కాలేదా?" వణుకుతున్న గొంతును బలవంతాన పెగల్చుకుని అడిగింది.

    అంతలోనే డాక్టర్ నుండి అతడికి పిలుపు వచ్చింది. "ఇప్పుడే వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు అతడు. కాసేపటి తర్వాత డాక్టర్ తో కలిసి వచ్చాడు మోహన్. ఇద్దరూ కల్సి గౌసియా వివరాల్ని అడిగారు.

    "నేను ఈ గొడవలమధ్య ఇంటికి వెళ్తే మరిన్ని గొడవలు జరుగుతాయి. వెళ్ళకపోవడమే మంచిది" మనసులో అనుకుని, "నన్ను మీ వెంట బొంబాయికి తీసుకెళ్ళండి. అక్కడ మరియా ఆశ్రమంలో ఫాదర్ వుంటాడు. మదర్లు వుంటారు" చెప్పింది గౌసియా.

    "ముందు నీ పేరేంటో చెప్పు?" డాక్టర్ అన్నాడు.

    "నా పేరు గౌసియా"

    "మీ నన్న పేరు?"

    "సాయిబు"

    "మీ నాన్న ఏం చేస్తాడు?"

    "పత్తర్ బజార్ లో చాయ్ బండి అమ్ముతుంటాడు" ఏడుస్తూ చెప్పింది.

    ఆమెను వలలు ఇంకేం అడగలేదు. ఆమె చెప్పిన ఆ మూడు వివరాలే ఆ ఇద్దరిలో అనుమానం తెప్పించాయి.

    "అంటే... నువ్వు ఆ అమ్ముడుపోయిన అమ్మాయిఅయా?" ఆరా తీసినట్టుగా అడిగాడు డాక్టర్.

    "అ... వు...ను..." ఏడుస్తూనే చెప్పింది.

    "ఐసీ..." అని కిందిపెదవి పైపంటితో బిగించి, "మిస్టర్, చాలామంచిపని చేశావు" అంటూ మోహన్ భుజం తట్టి, "అవునూ, బాంబేనుండి హైద్రాబాద్ కి ఎవరివెంట వచ్చావు?" కనుబొమ్మలు ముడిచాడు డాక్టర్.

    అక్కడ తన పరిస్థితిని వివరించుకుంది గౌసియా.

    "షిట్! ఈ నయవంచకులకు కామమే తప్ప మరేం తెలీనట్టుంది. కోరికలు ఎవ్వరికైనా వుంటాయి. అలాగని ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో తెలీదా ఈ రాక్షసులకి? అయినా రక్షకభటులైవుండి కూడా బాధ్యతా రహితంగా ప్రవర్తించారంటే ఆ వెధవల్ని నరికిపోగులు పెట్టాల్సిందే" పిడికిళ్ళు బిగించాడు మోహన్.

    "ఈ సమాజంలో అట్లాంటివాళ్ళు సహజమే. కాలమే వాళ్ళకు బుద్ధి చెప్తుంది" అని గౌసియాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చి, "ఆ మిస్టర్ మోహన్! ఈ అమ్మాయి కోలుకునే వరకు ఇక్కడే వుంటుంది. మీరు అర్జెంటు పనిమీద బాంబే వెళ్తున్నాను అన్నారుకదా. ఇక మీరు వెళ్ళొచ్చు! మంచి మనసుతో ఈ అమ్మాయిని కాపాడినందుకు, మీరు వెళ్ళే పని సక్సెస్ అవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్! మీకూ మీ మంచితనానికి హాట్సాఫ్..." డాక్టర్ మాటల్లోనే కాదు, ఆ కళ్ళల్లోనూ ప్రస్ఫుటమౌతున్న ఎంతో ఉన్నతమైన ప్రశంస.

    "అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చండి పోలీసుల సహాయం తీసుకొనైనాసరే, అవసరమైతే అమ్మాయి ఇంటికి చేరుకునేవరకు మీరు కూడా వెంటే వుండండి" చెప్పాడు మోహన్.

    "తప్పకుండా" అన్నాడు డాక్టర్.

    మరి కాసేపటి తర్వాత డాక్టర్ వద్ద, గౌసియావద్ద సెలవు తీసుకుంటూ ఇద్దరికీ తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు మోహన్.

    మోహన్ గురించే ఆలోచిస్తూ పడుకుంది గౌసియా. అతడు ఆమెకు దేవుడిలా తోస్తున్నాడు. వెళ్ళేముందు తనకు స్వంత చెల్లెలు అన్న భావనతో జాగ్రత్తలు చెప్పడమే కాకుండా, బాంబేనుండి తిరిగి వచ్చాక తప్పకుండా కలుస్తానని మరీమరీ చెప్పి వెళ్ళిపోయిన అతడి వాత్సల్యం... ఆమె మనసును ద్రవింపచేస్తోంది.

    "ఈ పాలు, బ్రెడ్ తీసుకో" కాసేపటి తర్వాత బన్నుముక్కలు, పాల గ్లాసుతో వచ్చింది నర్సు.

    "ఆకలిగా లేదు" చెప్పింది గౌసియా.

    "లేకపోయినా పాలు తాగి, కొద్దిగా బ్రెడ్డు తిను. ఎందుకంటే... ముందే నీరసంగా వున్నావు. తినకపోతే మరింత నీరసమైపోతావు" అంది నర్సు.

    గౌసియా ఇంకేం మాట్లాడలేదు. నర్సు సహాయంతో నెమ్మదిగా లేచి కూర్చుంది. పాలల్లో బ్రెడ్ కలిపి స్పూన్ తో మెల్లగా తినిపించసాగింది నర్సు. రెండు స్పూన్లు అలా తిందో లేదో భవానీశంకర్ గుర్తొచ్చాడు ఆమెకు.  

    "వద్దు" ముంచుకొస్తున్న దుఃఖంతో నర్సును దూరం జరిపింది.

    "ప్చ్! విసిగించొద్దు" అంది నర్సు.

    "నా భవానీ శంకర్ కి ఏంకాలేదు కదా. అతడు క్షేమంగా వున్నాడు కదా?" అడిగింది గౌసియా.

    "భవానీశంకర్ ఎవరు?" కనుబొమ్మలు ముడిచింది నర్సు.

    ఏం చెప్పలేకపోయింది గౌసియా. ధారాపాతమౌతున్న కన్నీళ్ళను తుడ్చుకుంటూనె, మరోవైపు నర్సు తినిపిస్తున్న బ్రెడ్ ను బలవంతంగా మింగసాగింది.

        *    *    *

    రాత్రి పదిగంటలు కావొస్తోంది. నెత్తుటి గాయాలు శరీరాన్ని బాధిస్తుంటే గౌసియాకు నిద్రపట్టడంలేదు. తోడుగా భవానీశంకర్ గూర్చిన ఆలోచనలు ఆమె హృదయాన్ని వేదనతో ఉడికిస్తున్నాయి. కాగా, తండ్రి మరణం మాత్రం ఆమెను పెద్దగా కృంగదీయడంలేదు.

    "కనికరం లేకుండా నన్ను అమ్ముకున్న అబ్బా గురించి నేనెందుకు బాధపడాలి? అబ్బా కారణంగానే నేను ఇప్పుడు ఇన్ని అవస్థల్ని ఎదుర్కొంటున్నాను. అట్లాంటి అబ్బా కోసం నేనెందుకు ఏడవాలి? కాకపోతే అమ్మా... చెల్లెళ్ళు... ఎలా వున్నారో?

    నా భవానీశంకర్ ఎక్కడున్నాడు? ఎలా వున్నాడు? పోలీసులు పట్టుకువెళ్ళి తనను హింసించడంలేదు కదా? పాపం నా కోసం తను ఎంత తెగించాడు" మనసులో మౌనంగా తలుస్తూ రూఫ్ కేసి చూస్తున్న గౌసియా, ఎవరో వస్తున్నట్టనిపించి డోర్ వైపు చూసింది.

    ఎవరో ఇద్దరు వ్యక్తులు డాక్టర్ తో కలిసి లోపలికి వచ్చారు. ఎటూ చూడకుండా నేరుగా లోపలికి నడిచారు. కాసేపటితర్వాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళు కూడా లోపలికి నడిచారు.

    గౌసియా ఎవ్వర్నీ పెద్దగా పట్టించుకోలేదు. ఎటూ నిలవడంలేని మనసు మెదడును గందరగోళం చేస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంది.

    కాసేపటి తర్వాత అనుకోకుండా కడుపులో నొప్పి ఆరంభమైందామెకు. తనకు అప్పుడప్పుడూ కడుపు నొప్పొస్తుంటుంది. కానీ ఇంత విపరీతంగా ఎప్పుడూ నొప్పి రాలేదు.

    బాధ చెప్పనలవి కానిదిగా వుంది. భరించడం చేతకావడంలేదు. "అమ్మా... అమ్మా..." తాళలేక అటూ ఇటూ కదులుతుంటే గాయాలపై ఒత్తిడి పెరుగుతూ ప్రత్యక్ష నరకం కనబడుతోంది.

    ఆమె ఇక ఎంతోసేపు బాధను ఓర్చుకోలేక అతి ప్రయాసగా బెడ్ దిగి డాక్టర్ కోసం ముందుకు నడిచింది. వెళ్ళేందుక్కూడా ఆమెకు శక్తి చాలనట్లుగా వుంది. గోడను ఆసరాగా పట్టుకుని, అటూ ఇటూ వున్న గదుల్లో డాక్టర్ ను వెదుక్కుంటూ... లోపలికి నడిచి వెళ్ళసాగింది.

    కొంతదూరం వెళ్ళాక విశాలంగా వున్న హాలు ఒకటి వచ్చింది. "డాక్టర్" పిలుస్తూ ఆ హాల్లోకి ప్రవేశించింది గౌసియా.

    అది ఔట్ పేషెంట్స్ కు ఉద్దేశించిన హాలు. అదేమీ ఆమెకు తెలీదు. హాలును దాటి ముందుకు నడిచింది. అక్కడ ఒక గదిలో వచ్చినవాళ్ళతో కూర్చుని హాయిగా పేకాడుతూ కన్పించాడు డాక్టర్. వాళ్ళు మందు కూడా సేవిస్తున్నారు.

    "డాక్టర్" ఆయాసపడుతూ ఆ గదిలోకి వెళ్ళింది గౌసియా. అందరూ ఒకేసారి గౌసియా వైపు చూశారు.

    "డాక్టర్... కడుపులో నొప్పి" అతి కష్టంగా చెప్పింది గౌసియా.

    "వెళ్ళి పడుకో వస్తాను" తాగిన మత్తులో వంకరగా చెప్పాడు డాక్టర్.

    "చాలా నొప్పిగా వుంది డాక్టర్" ఏడుస్తూ చెప్పింది గౌసియా.

    "మరేం కాదులే. వెళ్ళి పడుకో" డాక్టర్ లో మార్పులేదు. ఏడుస్తూనే తిరిగి బయటకు నడిచింది గౌసియా. మధ్యలో ఎదురయ్యాడు హాస్పిటల్ కాంపౌండరు.

    "ఏంటమ్మా?" గౌసియాను చూడగానే అతడిలో ఆతృత.

    "కడుపులో నొప్పి" చెప్పింది గౌసియా.

    "అయ్యో...! ఎంతసేపయ్యింది?"

    "ఇప్పుడే! డాక్టర్ దగ్గరకి వెళ్తే... వెళ్ళి పడుకో వస్తానని చెప్పాడు" కడుపును గట్టిగా పట్టుకుంటూ చెప్పింది గౌసియా.

    "ప్చ్...! వీడు ఇంతేనమ్మా! పగలు పూట మాత్రమే వీడు మనిషి. రాత్రి కాగానే వీడికి పేకాట, మందు వుంటేచాలు. ఇలాంటి సమయంలో వీడితో చికిత్స చేయించుకుంటే చచ్చిపోవాల్సిందే. ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా! నిన్ను వేరే హాస్పిటల్ కు తీసుకువెళ్తాను పదమ్మా" చెప్తూనే తను కూడా గౌసియా వెంబడే ముందుకు నడిచాడు కాంపౌండర్.