Facebook Twitter
" ఏడు రోజులు " 27వ భాగం

" ఏడు రోజులు " 27వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

   


    బయటకు వెళ్ళగానే తెల్సినవాళ్ళు ఎవ్వరైనా కనిపిస్తారేమోనన్న ఆతృత ఆమెలో రెట్టింపు అయ్యింది. ఎందుకంటే ఒకచోట జనాలు గుమిగూడి వున్నారు. వాళ్ళకు సమీపంగా వెళ్ళి అందర్నీ కలియచూసింది గౌసియా.

    వాళ్ళంతా ఒక షాపుముందు నిల్చుని టీవీలో క్రికెట్ చూస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కరు కూడా తెల్సినముఖం కనబడలేదు.

    "ప్చ్! ఎవరైనా కనిపిస్తే బాగుణ్ణు" అనుకుంటూ మెడికల్ షాపు దగ్గరికి అలా వెళ్ళిందోలేదో,దూరంనుండి అరుపులు వినబడ్డాయి.

    ఎవరన్నట్టుగా కంగారుపడిపోతూ అటు కేసి చూసింది గౌసియా.

    కొందరు యువకులు కత్తులు పట్టుకుని వికృతంగా అరుస్తూ పరుగెట్టుకొస్తున్నారు. అది చూసి భయంతో దుకాణాలు మూసుకుంటున్నారు అందరూ. మొదట కొందరు యువకులే కనిపించారు కానీ, చూస్తుండగానే గుంపులు గుంపులుగా పుట్టుకొచ్చారు అల్లరిమూకలు. క్షణాల్లో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారిపోయింది. అమాయక జనాలు చెల్లాచెదురవుతున్నారు. కొన్ని వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అల్లరిమూకలు కొందరు వాటి అద్దాల్ని విచక్షణారహితంగా పగలగొట్టడమే కాదు, వాహనదారుల్ని రాక్షసంగా కిందికి లాగి చితకబాదుతున్నారు.

    మరికొన్ని వాహనాలు పక్కనవున్న సందుల్లోకి వేగంగా జొరబడిపోతున్నాయి. ఇంకొందరు వాహనదారులైతే వాహనాల్ని వదిలేసి పారిపోతున్నారు.

    అంతా భీభత్సం... గందరగోళం... అయోమయం... రోడ్లమీద నిలిచిపోయిన వాహనాలు. పరుగెడుతున్న జనాలు, ప్రాణభయాన్ని వ్యక్తంచేస్తూ వినిపిస్తున్న హాహాకారాలు, వికృతాన్ని చాటిచెబుతున్న కేకలు, అంతా ఒక కురుక్షేత్రంలా తయారయ్యింది.

    గౌసియా చుట్టూ చూసింది. అప్పటికి అన్ని షాపులూ మూసివేయబడివున్నాయి.

    "యా... అల్లా" బిగ్గరగా అరుస్తూ అక్కడినుండి పారిపోయే ప్రయత్నం చేసింది. అంతలోనే నిలువు నామం దిద్దుకుని, కాషాయపు గుడ్డను తలకు చుట్టుకున్న ఒక యువకుడు, కత్తితో ఆమె వీపులో కసిగా పొడిచాడు.

    "అమ్మా..." తెలుగులో పెనుకేక వేస్తూ, కత్తిపోటును లక్ష్యపెట్టక అలాగే పరుగెట్టబోయింది గౌసియా.

    అంతలోనే ఒక ముస్లిం యువకుడు కత్తితో ఆమె భుజాన్ని పొడిచాడు. అయినప్పటికీ ఆమె ఆగలేదు. బాధను భరిస్తూ అలాగే ముందుకు పరుగెట్టింది.

    ఆమెకు దారి తెలియట్లేదు. దిక్కుతోచనట్టుగా పరుగెత్తసాగింది. ఒకవైపు రక్తం ఆమె గుడ్డల్ని తడిపేస్తూనే వుంది.

    కొంతదూరం పరుగెట్టాక రైల్వేస్టేషన్ కనబడింది. ప్లాట్ ఫామ్ పై ఒక రైలు చిన్న జర్క్ తో అప్పుడే కదులుతోంది. ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నంలో చాలామంది అభాగ్యజనాలు పరుగెట్టుకుని వెళ్ళి ఆ రైల్లోకి ఎక్కుతున్నారు. వాళ్ళతోపాటుగా పరుగెట్టుకువెళ్ళి రైలు ఎక్కబోయింది గౌసియా. కానీ ఆమెకు వెళ్తున్న రైలు ఎక్కడం చేతకాలేదు. అయినప్పటికీ పట్టువదలకుండా రైలు వెంటే కొంతదూరం పరుగెట్టి, ఒక యువకుడు చేయి అందించడంతో రైలు ఎక్కగలిగింది.

    రైల్లో అందరూ గౌసియా పరిస్థితిని చూసి "అయ్యయ్యో..." అంటూ గాభరాపడ్డారు.

    "మత కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ దరిద్రపు నా కొడుకులకు మతం ఏంపెట్టిందో తెలీదుగానీ, మానవతను మరిచి పోట్లాడుకుంటున్నారు" ఎవరో అన్నారు.

    అప్పటికి గౌసియా పరిస్థితి తీవ్రంగా తయారయ్యింది. దప్పికతో ఆమె నోరు పిడచకట్టుకుపోసాగింది. కళ్ళు మూతలు పడసాగాయి. మరోవైపు రక్తస్రావం ఎక్కువౌతూ ఒంట్లో శక్తి పూర్తిగా నశించసాగింది. ఇంకోవైపు కత్తిగాయాలు శరీరాన్ని బాధపెడుతూ కలిచివేయసాగాయి.

    "పాపం! పిల్ల పరిస్థితి అదోలావుంది. కనీసం ఒక్క స్టేషన్లో నైనా ఎవ్వరికైనా అప్పజెప్పుదాం"

    "పాపం... ఎవ్వరో ఉన్నోళ్ల పిల్లలా వుంది. ఎక్కడికీ ప్రయాణించినట్టులేదు, కలహాలకి భయపడి రైలుఎక్కినట్టుంది"

    "ఎవరి ఖర్మ ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది. ఆ పిల్లను అనవసరంగా పట్టించుకుని గాలికి పోయే కంపను తలకు తగిలించుకునే ప్రయత్నం చేయొద్దండి"

    కనికరం చూపేవాళ్ళు, కాఠిన్యం పంచేవాళ్ళు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆమె దగ్గరికి రాలేదు.

    రైలు వేగంగా ప్రయాణిస్తోంది. క్షణక్షణానికి గౌసియా పరిస్థితి కూడా విషమించసాగింది. ప్రాణాలు పోయేంతగా కత్తిపోట్లు ఆమెను గాయపర్చకపోయినా, పట్టించుకునే నాథుడు లేనందున ఆమెకు ప్రాణాపాయ స్థితే ఏర్పడింది.

    "హ... హమ్మా... అమ్మా... మా..." ఆయాసపడసాగింది గౌసియా. ఆమె రైలు ఎక్కేందుకు చేయిని ఆసరా ఇచ్చిన యువకుడు ఆమెను ఎంతోసేపు అలా చూస్తూ ఉండలేకపోయాడు. వచ్చి ఆమె గాగ్రా పైటతో ఆమె గాయాలకు కట్టు కట్టసాగాడు.

    "బాబూ... వూరుకోవయ్యా! ఇట్లాంటి కేసులు ప్రాణంమీదకి వస్తాయి" అన్నారు ఎవరో.

    "ఛ... నోర్మూసుకోండి. మీకు మానవత్వం ఏ కోశాన వున్నా ఈ విధంగా మాట్లాడరు" గదమాయింపుగా అన్నాడు అతడు.

    "ఎవరి ఖర్మ వాళ్ళది. మనకెందుకు?" ఎవరో గొణిగారు.

    ఆ యువకుడు ఎవ్వర్నీ పట్టించుకోలేదు. గౌసియా గాయాలకు కట్టుకట్టి వాటర్ బాటిల్ కోసం అటూ ఇటూ చూశాడు. ఎవరో చిన్నపిల్లాడు కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు.

    ఆ యువకుడు పరుగున ఆ పిల్లాడి దగ్గరకి వెళ్ళి, కూల్ డ్రింక్ సీసా లాక్కుని, గౌసియా దగ్గరకి అదే పరుగుతో వచ్చి ఆమె ముఖంమీద కొంత చిలకరించి, మిగతాది ఆమెతో తాగించసాగాడు.

    అవతల ఆ పిల్లాడు కూల్ డ్రింక్ సీసా కోసం గుక్కపెట్టి ఏడవసాగాడు.

    "బావున్నావు కదయ్యా! పిల్లాడి కూల్ డ్రింక్ లాక్కుని తాగిస్తున్నావు" ఆ పిల్లాడి తాలూకు వాళ్ళు అన్నారు.

    "అవతల ఆ మనిషి చస్తుంటే, కూల్ డ్రింక్ కోసం చూసుకుంటావేంటమ్మా? నువ్వు ఎలాంటి మనిషివి?" మరెవరో ఆవిడమీద కొద్దిగా కోప్పడ్డారు.

    పక్క స్టేషన్ లో రైలు ఆగింది. ఆ యువకుడు ఆలస్యం చేయలేదు. గౌసియాను చేతులమీదకు ఎత్తుకుని రైలుదిగి ఆటోలో చేతులమీదకు ఎత్తుకుని రైలుదిగి ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. అప్పటికే గౌసియాకు స్పృహ తప్పింది.

    వెనువెంటనే చికిత్స అందించారు. గంట తర్వాత స్పృహలోకి వచ్చి చూసుకుంటే, వదులైన తెల్లని దుస్తులు వున్నాయి తన శరీరంమీద.

    "పాపా" పిలిచాడు డాక్టర్.

    "మా..." నీరసంగా పలుకుతూ చూసింది గౌసియా.

    "ఎలా వుంది?"

    "బాగుంది" అన్నట్టుగా తలాడించింది గౌసియా.

    "డాక్టర్" అంతలో పిలుస్తూ వచ్చాడు యువకుడు.

    "యస్" అంటూ అటు తిరిగాడు డాక్టర్.

    "అమ్మాయికి ఎలా వుంది?" అడిగాడు యువకుడు.

    "బాగుంది. చెప్పిన మందులు అన్నీ తీసుకొచ్చావా?" అంటూనే అతడి చేతిలోని మందుల ప్యాకెట్స్ ని తన చేతిలోకి తీసుకున్నాడు డాక్టర్.

    యువకుడు ఆమ్మాయి దగ్గరకి నడిచాడు. డాక్టర్ తన గదిలోకి వెళ్తూ, "మిస్టర్... ఈ మెడిసిన్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేస్తాను" చెప్పాడు.

    "ఒకే డాక్టర్..." అని "అమ్మాయీ" గౌసియా ముఖంలోకి చూశాడు యువకుడు.

    గౌసియాకు అతడు ఎవరో అర్థంకాలేదు.

    "నా పేరు మోహన్... నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నేనే" చెప్పుకున్నాడు అతడు.

    గౌసియా కళ్ళల్లో కృతజ్ఞతాభావం పొంగి పొర్లింది.

    "ఇప్పుడు నీకేంకాదు. నీవు అన్నివిధాలా క్షేమంగా వున్నావు. కాకపోతే ఒక నెలరోజులు రెస్ట్ తీసుకోవాలి" అంటూ గౌసియా పక్కన కూర్చుని, "నీ చిరునామా చెప్పు. మీ అమ్మావాళ్లకు కబురుచేస్తాను" అన్నాడు అతడు.

    "మాది హైదరాబాద్" చెప్పింది గౌసియా.

    "హైద్రాబాదులో ఎక్కడ వుంటారు?"

    "పత్తర్ బజార్"

    "నీపేరు, మీ నాన్నగారి పేరు, మీ చిరునామా మొత్తంగా చెప్పు?"

    "నా పేరు..." అంటూ ఆగిపోయి, "నువ్వెవరు?" అడిగింది గౌసియా.

    "చెప్పాను కదా... నా పేరు మోహన్. నాదీ హైద్రాబాదే. బాంబే వెళ్తున్నాను. కాకపోతే నీకోసం ఇక్కడ దిగాల్సి వచ్చింది"

    "శుక్రియా..." గౌసియా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

    "ఫర్వాలేదులేమ్మా! నువ్వు నా చెల్లెల్లాంటి దానివి" చిన్నగా నవ్వాడు అతడు.

    "మా పత్తర్ బజార్ లో కూడా గొడవలు జరిగాయా?" అడిగింది గౌసియా.

    "ఎక్కడ జరిగితేనేమి? ఈ గొడవలు ఎక్కడ జరిగినా అవి మానవతకి కడుతున్న సమాధులు" ఆవేశంగా మాట్లాడాడు మోహన్.

    ఆమె మౌనంగా చూసింది.

    "మనసుల్లేని ఈ మనుషులు రాన్రానూ రాక్షసులౌతున్నారు. లేకపోతే ఇన్ని అన్యాయాలు, మోసాలు, దారుణాలు ఎందుకు జరుగుతాయి? ఛ" అని కాసేపాగి, "మన హైద్రాబాదుకు చెందిన ఒక ముస్లిం అమ్మాయిని, అరబ్బు షేక్ కు అమ్మివేశాడుట ఒక పాపిష్టి తండ్రి. ఆ తండ్రిలాంటి తండ్రులు ఇంకా ఎందరో ఉన్నారు. కానీ ఆ అమ్మాయిలాంటి అమ్మాయిలు మాత్రం ఎవ్వరూ లేరనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా అరబ్బుషేక్ ని ఎదురుతిరిగి చంపేసింది. రియల్లీ అయామ్ ప్రౌడ్ ఆఫ్ హెర్!

    "ఇంతేకాదు, ఆ అమ్మాయి... ఒక హిందూ యువకుడు ప్రేమించుకున్నారట. అయితే ఆ యువకుడు అదేరోజు రాత్రి ఆ తండ్రిని నిలువునా నరికిపడేసాడట. మంచి పని చేశాడు" అదే ఆవేశంతో మాట్లాడ్తూ పోయాడు అతడు.