Facebook Twitter
" ఏడు రోజులు " 26వ భాగం

" ఏడు రోజులు " 26వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

  
    అప్పుడు సమయం పదకొండు దాటింది. అయినప్పటికీ బంధువులు హడావిడిగా తిరుగుతుండటం ఆమెకు ఒక అవకాశంగా తోచింది. ఆలస్యం చేయకుండా వెళ్లి బంధువుల మధ్య కల్సిపోయింది. వాళ్లంతా ఖరీదైన బట్టలు ధరించి వున్నారు. వాళ్లమధ్య వెలిసిపోయినట్లుగా వున్న తన దుస్తుల్ని ఒకమారు చూసుకుని వీళ్లు నన్ను ఏర్పాటు చేయకుంటే బాగుణ్ణు మనసులో అనుకుంటుండగానే ఆమె దృష్టి కాసింత దూరంలో వున్న బాత్ రూమ్ మీద పడింది.

    బాత్ రూమ్ కు సమీపంగా కట్టివున్న తాడుమీద మంచి వస్త్రాలు ఆరవేయబడివున్నాయి. వాటిని చూడగానే ఆమెలో చటుక్కున ఒక ఆలోచన మెదిలింది. కాసేపు అటూ ఇటూ తటపటాయించి తర్వాత బాత్ రూమ్ వైపు నడిచి తాడుమీద తనకు సరిపడే ఒక గాగ్రాఛోళిని తీస్కుని బాత్ రూమ్ లోకి వెళ్లి మార్చుకుని వచ్చింది. ఎవ్వరూ ఆమెను పట్టించుకోవడంలేదు. వెళ్లి ఒక పక్కగా కూర్చుంది.

    "ఫాదర్ కి ఎలావుందో ఏమో! వెళ్లి చూసి వద్దామనుకున్నా ఈ నగరం అర్థం కావడం లేదు. ఈ రాత్రికి స్టేషన్ లోనే వుండి వుదయాన్నే పోలీసుల సహాయంతో వెళ్దామన్నా పరిస్థితి బాగోలేదు. అసలు వీళ్ళల్లో కల్సిపోయాను కాని ఇప్పుడేం చేయాలి?" ఆమె మనసు కలవరపడింది.  

    పదిహేను నిముషాలు గడిచిపోయాయి. పెళ్లివాళ్లు నృత్యాలు మొదలెట్టారు. అదే సమయంలో పక్కన వచ్చి కూర్చున్న వాళ్ల మాటలద్వారా వాళ్లంతా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని తెల్సింది.

    వీళ్లవెంట వెళ్లిపోతే సరి. కాని ఇక్కడ ఫాదర్? తనలో తను అనుకుంటూండగానే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఆమె చేయి పట్టి లాగింది.

    ఉలిక్కిపడి చూసింది గౌసియా.

    "డాన్స్ చేద్దాం" పిలిచింది ఆ అమ్మాయి గౌసియా కాదనలేదు. అమ్మాయి అందించిన కర్రాల్ని పట్టుకుని వచ్చీరానీ నృత్యాన్ని చేయనారంభించింది.

    అర్థగంట తర్వాత టూరిస్టు బస్సువచ్చి గేటు బయట ఆగింది. పెళ్లిజనాలు ఒక్కొక్కరుగా బస్సులోకి ఎక్కి కూర్చోసాగారు. కొందరు లగేజీతో వెళ్తున్నారు. కొందరు ఖాళీగా వెళ్తున్నారు. వాళ్లందరితో పాటుగా తనూ వెళ్లాలనుకుంటూ కోలాటం కర్రల్ని ఆ అమ్మాయికి అందించింది గౌసియా.

    "నువ్వు కూడా వెళ్తావా?" అడిగింది అమ్మాయి.

    "అందరూ వెళ్లిపోతున్నారుకదా?" అంది గౌసియా.

    "వాళ్లంతా హైదరాబాదు వెళ్తున్నారు. మనం మాత్రం ఇక్కడే వుండి హాయిగా డాన్స్ లు చేసుకుందాం. మనతోపాటుగా ఇంకా చాలామంది కూడా వుంటున్నారు. సరేనా?" అంది ఆ అమ్మాయి.

    "వద్దు నేను వెళ్లిపోతాను" అంటూ బస్ వైపు నడిచి బస్సు ఎక్కి కూర్చుంది గౌసియా. అమ్మాయి కూడా బస్సు ఎక్కింది.

    "ప్లీజ్ నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. నువ్వే నా ఫ్రెండువి. కిందికి దిగవా?" బ్రతిమాలినట్లుగా అంది.

    "నేను హైదరాబాద్ వెళ్లాలి" అంది గౌసియా.

    "మనం తర్వాత వెళ్దాం" అంది అమ్మాయి.

    విన్పించుకోలేదు గౌసియా. అమ్మాయి కాసేపు అడిగి, డ్రైవర్ బస్సు ఎక్కగానే "చూద్దాంలే" అంటూ బస్సు దిగి వెళ్లిపోయింది.

    "హమ్మయ్యా" అమ్మాయి బస్సు దిగగానే అనుకుంది గౌసియా.


            photo


    అక్కడ వెంకట్ గౌసియాను కొంత దూరం వరకు వెదికి తిరిగి స్టేషన్ కు వచ్చాడు. అతడి ముఖం కంగారుతో నిండిపోయి వుంది. అప్పటికి స్టేషన్ కు కృష్ణ వచ్చి వున్నాడు. అతడు వాళ్లకోసమే వెదుకుతున్నట్టుగా బయటే నిలబడివున్నాడు.

    "కృష్ణా ఆ పోరి కనబడట్లేదు" జీపు దిగీదిగకుండానే హడావిడిగా చెప్పాడు వెంకట్.

    "ఎక్కడికెళ్లింది?" కృష్ణ కూడా కంగారుపడ్డాడు.

    "అది తెలిస్తే ఇంత కంగారు ఎందుకు పడ్తాను?" చేతులు నలుపుకున్నాడు వెంకట్.

    "మరి ఇప్పుడెలా?"

    "ప్చ్... అదే అర్థం కావడంలేదు"

    "ఆ పోరి నీ కళ్లుగప్పి పారిపోవడానికి నువ్వెక్కడికి వెళ్లావు?"

    "ఆ దరిద్రపు ఫైల్సు సర్దుతున్నాను"

    "అరరే"

    "ఆ ఫాదర్ గాడు వస్తున్న జీపుకు యాక్సిడెంట్ జరిగింది. అందులో మన కానిస్టేబుల్స్, ఎస్.ఐ. కూడా వున్నారు. ఎవ్వరికీ ఏం కాలేదు. కాకపోతే ఆ పోరికి కొద్దిగా బిల్డప్ ఇచ్చాను. అదీ నా లైను క్లియర్ అవుతుందేమోనని. ప్చ్... ఒప్పుకోలేదు. పైగా పారిపోయింది. ఆ పోరి డైరెక్టుగా ఆసుపత్రికి వెళ్లిందేమో? వెళ్తే మాత్రం మన గురించి చెప్పేస్తుంది. వెళ్లినా వెళ్లకపోయినా మన ఉద్యోగం మాత్రం ఊడుతుంది ప్చ్..." రెండు విధాలా కలవరపడిపోయాడు వెంకట్.

    "అవునవును. అనవసరంగా ఆ పోరితో ఎక్స్ ట్రాగా ప్రవర్తించాం. ఇప్పుడేం చేద్దాం?" కృష్ణ మరింత కలవరపడిపోతూ ఏకంగా తల పట్టుకుని మెట్లపై కూలబడిపోయాడు.

            *    *    *

    ఇక్కడ గౌసియా వెళ్తున్న బస్సులోంచి బయటకు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది.

    బస్సులోని స్త్రీ పురుషులు పాటలు పాడుతున్నారు. గౌసియా ఎవ్వరిపాటనూ వినడం లేదు. ఆమె మెదడు రకరకాల ఆలోచనలతో నిండిపోయి వుంది. ఆ ఆలోచనలు ఆమెను ఒకవిఅపు భయపెడుతున్నాయి, ఒకవైపు కలవరపెడుతున్నాయి, మరోవైపు తొందరపెడుతున్నాయి, ఇంకోవైపు ఎటూ అర్థం కాకుండా చేస్తున్నాయి.

            శుక్రవారం

    గౌసియా గురించిన మొత్తం సమాచారం అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ దినపత్రికల్లో ప్రధానవార్తగా ఫోటోలతోసహా ప్రచురింపబడింది. ఎవ్వరూ ఊహించని గౌసియాగాథ దేశం మొత్తంమీద సంచలనం సృష్టించింది. ఎవ్వరినోట చూసినా ఆ మాటలే వినబడసాగాయి.

    గౌసియాకు అదేమీ తెలియదు. పెళ్ళి వాళ్ళతో కలిసి రెండుగంటలకల్లా హైద్రాబాద్ చేరుకుంది. అప్పటివరకూ పెళ్ళిజనాలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.

    అందరితోపాటుగా బస్సు దిగి అటూ ఇటూ చూసింది. అది ఆమెకు ఏమాత్రం పరిచయంలేని ప్రాంతం. అయినప్పటికీ ఎరిగినవాళ్ళు ఎవ్వరైనా కనబడ్తారేమో అన్న ఆశతో జనాల్ని కలియచూసింది.

    పెళ్ళివాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా తెలిసినవాళ్ళకోసం ఆమె కళ్ళు గాలించసాగాయి.

    "అమ్మాయీ" అంతలోనే ఎవరో పిలిచారు.

    ఎవరన్నట్టుగా చూసింది గౌసియా.

    "నీవు చందూలాల్ కూతురివి కదూ?" అడుగుతూ వచ్చి ఆమె పక్కలో కూర్చుంది ఒక నడివయసు స్త్రీ.

    వెంటనే ఏంచెప్పాలో తోచలేదు గౌసియాకు. చేసేది లేక అవును అన్నట్టుగా తలాడించింది.

    "నేను నిన్ను రాత్రినుంచి చూస్తున్నాను. ముఖంమాత్రం అచ్చు అలాగేఉంది కానీ, అవునా కాదా అనుకుంటున్నాను" అంటూ మరికొంచెం చేరువగా జరిగి, "మరి ఒక్క సొమ్ము కూడా పెట్టుకోలేదు ఎందుకు?" అడిగింది.

    "పెట్టుకోలేదు" ఇబ్బందిగానూ భయంగానూ అంది గౌసియా.

    "అవున్లే! చిన్నపిల్లవికదా. ఎందుకైనా మంచిది అని పెట్టలేదనుకుంటాను? అవునూ మీ అమ్మానాన్న రాలేదుకానీ, నువ్వు ఒక్కతివే వచ్చావేంటీ?"

    "వచ్చాను"

    "మీ అమ్మావాళ్ళు వెనక వస్తారేమో కదూ?"

    "అవును"

    "మీ అన్నయ్య డాక్టరు కోర్సు చదువుతున్నాడుకదూ?"

    "అవును"

    "మరి నీవేం చదువుతున్నావు?"

    "నేను పదవ తరగతి"

    "నీ పేరు ఏదో వుంది కదా? మాలతి కదూ?

    "అవును"

    "ఆ... మాలతీ! ఒక్కపని చెప్తాను చేస్తావుకదూ?"

    "చెప్పండి"

    "మరేంలేదు. నాకు కొద్దిగా తలనొప్పిగా వుందమ్మా. ఆ ఎదురుగా కనిపిస్తున్నాయే దుకాణాలు, అక్కడికి వెళ్ళి ఒక అమృతాంజనం సీసా, అనాసిస్ మాత్రలు తీసుకురా.

    "పని చెప్తున్నానని మరేం అనుకోవద్దు. నేను నీకు మేనత్త వరస అవుతాను. నువ్వు గుర్తుపట్టలేవుగానీ, మీ నాన్న నాకు బాగా తెలుసు" అందామె.

    "సరే" తలాడించింది గౌసియా.

    "వేరే ఎవ్వరికైనా ఈ పని చెప్పేదాన్నే అనుకో! కానీ నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదమ్మా. అందుకే నువ్వేం అనుకోవద్దు" డబ్బులు అందిస్తూ క్షమార్పణగా ముఖం పెట్టిందామె.

    "ఏమీ అనుకోనులే" అంటూ డబ్బు అందుకుని బయటకు నడిచింది గౌసియా.